– మూసీ ప్రాజెక్టు..మరో కాళేశ్వరం తరహా ఏటీఎం
– మీకు పాలన చేతకావట్లేదు
– సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సవాల్
– ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగలేఖ
హైదరాబాద్: ఎన్నికల ముందు తానిచ్చిన హామీలు అమలుచేశానని సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా నమ్మకం ఉంటే.. మళ్లీ జనంలోకి వెళ్లి పాదయాత్ర చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. అలవికాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలోని అన్ని వర్గాలను నిండతా ముంచిందని మండిపడ్డారు.
బండి సంజయ్ తన బహిరంగలేఖలో ఇంకా ఏమన్నారంటే…
రేవంత్ రెడ్డి గారు,
మాకు అచ్చు వేసి మరీ ఇచ్చినటువంటి హామీలు ఆచరణకు నోచుకోలేదు. ‘షరతులు వర్తిస్తాయి’ అనే గ్యారెంటీ కార్డు వచ్చిందని అమాయకులైన తెలంగాణ ప్రజలకు తెలియదు.
6 హామీలు అనేవి అవాస్తవం. వాటిని నెరవేర్చడానికి 100 రోజులు, వెయ్యి రోజులు లేదంటే 10 వేల రోజులు అయినా సరిపోవు. మీరు యావత్ తెలంగాణను మోసం చేశారు. మీ అవాస్తవ హామీలు రాష్ట్రాన్ని, ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి.
మీ గ్యారంటీ కార్డు ప్రకారం ప్రతి కుటుంబానికి రూ.2.50 లక్షల లబ్ధి చేకూరుతుంది. కానీ గతంలో కేసీఆర్ వల్ల తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డపై లక్ష భారం పడినట్లే, మీ వల్ల ప్రతి తెలంగాణ వ్యక్తిపై రూ.2.50లక్షల అప్పు భారం పడుతుంది.
రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, చాలామంది రైతులను అందుకు మినహాయించారు. కాంగ్రెస్ హామీ అంటే నీటి మీద బుడగ అని నిరూపించారు. ఈ సీజన్ లో రైతుభరోసా ఆగిపోయింది. తక్కువ సమయంలోనే మీరు వ్యవసాయ సంక్షోభాన్ని సృష్టించారు.
రూ.500 బోనస్ అనేది ఓ బోగస్ అని చంటి పిల్లవాడిని అడిగినా తెలుస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా ప్రారంభం కాలేదు. రూ.500 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లో అర్హులైన అనేక మంది లబ్ధిదారులను వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు శూన్యం అనడానికి ఇది నిదర్శనం.
6 గ్యారెంటీల అమలుకు మీ వద్ద నిధులు లేవు. కానీ మూసీ ప్రాజెక్టు కోసం మాత్రం మీ వద్ద రూ.1.50లక్షల కోట్లు ఉన్నాయి. మూసీ ప్రాజెక్టును మరో కాళేశ్వరం తరహా ఏటీఎంగా తయారు చేస్తున్నారు.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల ఇళ్లను కూల్చివేస్తోంది. ఢిల్లీ నుండి వచ్చిన ఆదేశాలు, హైదరాబాద్ లో తూ.చ తప్పకుండా పాటిస్తున్న మీకు పాలన చేతకావట్లేదు.
హాస్టళ్లలో భోజనం సరిగా లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగార్థుల మాట వినకుండా లాఠీఛార్జ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం విద్యార్థులు, కళాశాలల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జాబ్ క్యాలెండర్ అనేది మీరు వేసిన అతిపెద్ద జోక్. ఎన్నికలకు ముందు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తుంగలో తొక్కారు. ఈ నీచమైన నిర్లక్ష్యం ప్రభుత్వ అసలు ప్రాధాన్యతలను తెలియజేస్తుంది.
పట్టపగలు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. పౌరులను రక్షించడంలో ప్రభుత్వ వైఫల్యానికి ఇవి అద్దంపడుతున్నాయి. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది.
తెలంగాణ పురోగమించట్లేదు కానీ మీరిచ్చిన హామీలు అబద్ధాలుగా మార్పు చెందుతున్నాయి. కాంగ్రెస్ అబద్ధపు హామీల జాబితా ఎప్పటికీ ఆగదు. అవి ఈ జన్మలో నెరవేరవు. తెలంగాణ పునర్నిర్మాణానికి బదులు విధ్వంసాన్ని సృష్టిస్తూ, గతంలో ఎన్నడూ లేనంతలా తెలంగాణని అంధకారంలోకి నెడుతున్నారు.
నిజంగా 6 హామీలు అమలు చేశారని మీకు నమ్మకం ఉంటే.. పాదయాత్ర చేపట్టాలని మరోసారి సవాల్ విసురుగుతున్నాను. ప్రజల్లోకి వెళ్లండి, నిజాలు ఏంటో మీరే తెలుసుకోండి.