-పాలన చేతకాక సోషల్ మీడియాపై వేధింపులు
-వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే భయపడుతున్నారు
-వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను చూసి వణికిపోతున్నారు
-ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. కాపాడుకుంటాం
-30 ఏళ్ల తర్వాత కూడా కేసుల ఓపెన్
-స్వయంగా ఈ మాట చెబుతున్న రాష్ట్ర డీజీపీ
-అదే సూత్రాన్ని చంద్రబాబుకూ వర్తింపచేయాలి
-ఆయనపై గతంలో నమోదైన కేసులన్నీ బయటకు తీయాలి
-ధైర్యం ఉంటే వాటన్నింటిపై వెంటనే దర్యాప్తు చేయాలి
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాయలంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ప్రెస్‌మీట్
తాడేపల్లి: పరిపాలన చేతకాక, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక, వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్న కూటమి ప్రభుత్వం, వారి వైఫల్యాలను ఎత్తి చూపినందుకు తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ఆక్షేపించారు.
తమ పార్టీ తరపున ఎవరు మాట్లాడినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అక్రమంగా అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వేధించడం చూస్తుంటే అప్రకటిత రాష్ట్రపతి పాలన విధించారా? అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో విపక్ష టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు అతి దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. ఈ స్థాయిలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు.
అందుకు పూర్తి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్న మాజీ ఎమ్మెల్సీ, కేవలం ఈ నాలుగు నెలల్లోనే 100 మందికి పైగా కార్యకర్తలపై కేసులు పెట్టి, అరెస్టు చేసి వేధిస్తున్నారని వెల్లడించారు. తప్పులను విమర్శిస్తూ తమ పార్టీ కార్యకర్తలు పెడుతున్న పోస్టులకు ప్రభుత్వం వణుకుతోందని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న తమ పార్టీ కార్యకర్తల విషయంలో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, కనీసం 41–ఏ కింద నోటీసులు ఇచ్చి, విచారణకు కూడా రమ్మనకుండా, అర్థరాత్రి వేళల్లో ఇళ్ల మీద పడి అరెస్టు చేసి తీసుకుపోతున్నారని, కనీసం ఏ స్టేషన్‌కు తీసువెళ్తున్నారన్నది కూడా చెప్పడం లేదని తెలిపారు. మరి ఇది ప్రజాస్వామ్యమా? లేక నియంతృత్వమా? అని ప్రశ్నించారు.
పోలీసులు తమ బా«ధ్యత మర్చి, అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్సీ, తీవ్రమైన నేరాల్లో దొరికిన టెర్రిరిస్టులకు విధించే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పారు. ఈ దమనకాండ ఎంతో కాలం కొనసాగదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద జరుగుతున్న వేధింపులను ఈ సందర్భంగా జూపూడి ప్రస్తావించారు.
‘నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో ఒక వాట్సప్ గ్రూప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తోందంటూ, గ్రూప్‌లోని 170 మందికి నోటీలిచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన మాచర్ల వెంకటరమణారెడ్డి హైదరాబాద్‌లో లేకపోవడంతో ఆయన బావను ఎత్తుకొచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో సన్నీ అనే వ్యక్తిని తిరువూరు పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పడం లేదు. చిలకలూరిపేటకు చెందిన పెద్దింటి సుధారాణి ఎన్నికల తర్వాత కూటమి అరాచకాలు భరించలేక ఇళ్లొదిలేసి కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లిపోతే, అక్కణ్నుంచి వారిని బలవంతంగా తీసుకొచ్చారు. అలా చేయొచ్చని ఏ చట్టంలో ఉంది?.
తాడేపల్లిగూడెంలో అయ్యప్పమాల వేసుకున్న వ్యక్తిని ఎత్తుకొచ్చి వినుకొండ పీఎస్ తీసుకురావడమే కాకుండా, లేని ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా చూపి వేధించారు. కొల్లిపరకు చెందిన ఆళ్ల జగదీశ్వర్‌రెడ్డిని తీసుకెళ్లిన పోలీసులు, ఎక్కడికి తరలించారో చెప్పడం లేదు. అందుకే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయబోతున్నాం’.. అని జూపూడి ప్రభాకర్ వివరించారు.
30 ఏళ్ల తర్వాతైనా సరే కేసులు ఓపెన్ చేయొచ్చని చెబుతున్న డీజీపీ, అదే సూత్రాన్ని సీఎం చంద్రబాబుకు కూడా వర్తింప చేసి, ఆయన మీదున్న పాత కేసులు దర్యాప్తు చేయాలని జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. వేధింపులకు భయపడి ప్రశ్నించడం ఆపేస్తారనుకోవడం భ్రమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా కేసుల దర్యాప్తు వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా మానిటర్ చేస్తున్నారని, ఆ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారని డీజీపీ చెప్పడాన్ని ఆయన తప్పు బట్టారు.
తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని చెబుతున్న రాష్ట్ర డీజీపీ, కూటమి నాయకుల ఆదేశాలతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ తెలిపారు. ఎన్ని వేధింపులకు గురి చేసినా న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని స్పష్టం చేసిన ఆయన, కార్యకర్తలెవరూ భయాందోళనకు గురి కావొద్దని, ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పవన్‌కు బాబు అంటే కోపం. కారణం..
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.. దళిత మహిళ అని కూడా చూడకుండా హోం మంత్రి అనిత పోస్టు లాగేసుకుంటానని చెప్పడం ఆయన అహంకారాన్ని సూచిస్తోందని జూపూడి ప్రభాకర్ అన్నారు. పవన్‌కు దమ్ముంటే శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ అందులో విఫలమైన సీఎం చంద్రబాబును నేరుగా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గుంతలు పూడ్చే పనులకు శంకుస్థాపన చేద్దామనుకుంటే చంద్రబాబు అవకాశం ఇవ్వలేదనే కోపాన్ని పవన్ దళిత మంత్రి మీద చూపించారని ఆరోపించారు. అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని చెప్పారు.
ఇంకా ఏం చేసినా చెల్లుతుందనుకుని, ప్రైవేటు భూముల్లోకి ప్రవేశించడం లాంటి విధానాలు కూడా మానుకోవాలని పవన్‌కు హితవు పలికారు. పార్టీలన్నీ ఏకమై జగన్‌ను అన్యాయంగా 16 నెలలు జైలు పాల్జేసినా, ఆయనను సీఎం కాకుండా ఆపలేకపోయారని, మళ్లీ ఉవ్వెత్తున లేచి అరాచకాలను అణిచివేస్తారని జూపూడి ప్రభాకర్ చెప్పారు.