– మార్కాపురంలో అరెస్ట్
– పట్టువదలని ‘ఐజీ ప్రవీణు’డు
– జగన్ కనెక్ట్స్ అనే వేదిక నుంచిఆపరేషన్
– దానికి సజ్జల ఇన్చార్జి
– అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమ్మారెడ్డి సూచనల ప్రకారం పని
– నిందితులకు 40 యూట్యూబ్ చానళ్లు
– జడ్జిలకు వ్యతిరేకంగా కూడా పోస్టులు
– ఇలాంటి వారికి అరబ్ దేశాల్లో కఠిన శిక్షలు
– వీరంతా రాక్షసజాతికి చెందిన వారు
– కర్నూలు రేంజి ఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్
కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వంటి ప్రముఖులను బెదిరిస్తూ.. వారిపై అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్‌మీడియా యాక్టివిస్టు, భారతీరెడ్డి పీఏ వర్రాను పోలీసులు ఎట్టకేలకూ అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురంలో ఉండగా ఆయనను పట్టుకున్నామని కర్నూలు రేంజి ఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్రా రవీంద్రారెడ్డిని మార్కాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నామని కర్నూలు రేంజి ఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ వెల్లడించారు. వర్రా రవీంద్రారెడ్డి గతంలో భారతి సిమెంట్ కంపెనీలో పనిచేశాడని, డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైసీపీకి అనుకూలంగా వినియోగించుకున్నారని చెప్పారు. వీరు జడ్జిలకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారని వెల్లడించారు. కుటుంబంలోని మహిళలు, పిల్లలపైనా పోస్టులు పెట్టారని తెలిపారు.
ఇలాంటి పోస్టులు పెట్టేవారు రాక్షస జాతికి చెందినవారని, నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే వీరి లక్ష్యమని ఐజీ కోయ ప్రవీణ్ వివరించారు. ఇలాంటి వారికి అరబ్ దేశాల్లో అయితే తీవ్రమైన శిక్షలు ఉంటాయని అన్నారు. ఇలాంటి పోస్టులు పెట్టేవారిని 45 మందిని గుర్తించామని, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
నేతల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టేవారని, నిందితులకు 40 యూట్యూబ్ చానళ్లు ఉన్నట్టు గుర్తించామని అన్నారు. వీరు తమ యూట్యూబ్ చానళ్ల ద్వారా కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారని వెల్లడించారు.
వీరంతా జగన్ కనెక్ట్స్ అనే వేదిక నుంచి పనిచేస్తున్నారని .. ఈ జగన్ కనెక్ట్స్ కు 2022 నుంచి సజ్జల భార్గవరెడ్డి ఇన్చార్జిగా కొనసాగుతున్నారని వెల్లడించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలంతా సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమ్మారెడ్డి సూచనల ప్రకారం పనిచేస్తుంటారని వివరించారు
నిందితులు వాడిన భాష జుగుప్సాకరంగా ఉందని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబాలపై తీవ్రమైన దూషణలు చేశారని, నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలించామని పేర్కొన్నారు.
వర్రా రవీంద్రారెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ అనే నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరిద్దరూ కూడా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని ఐజీ వెల్లడించారు.
పట్టువదలని ప్రవీణ్
కడప జిల్లాలో పోలీసుస్టేషన్‌కు వచ్చినట్లే వచ్చి తప్పించుకుపోయిన వర్రా పరారీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అన్నమయ్య జిల్లా పోలీసుల వైఫల్యంతోనే వర్రా పరారయ్యారని, ఒక సీఐ, మరో ఎస్ఐ ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ పరిణామాలకు ఏమాత్రం సంబంధం లేని, నాటి ఎస్పీ హర్షవర్ధన్‌రాజును బదిలీ చేయడంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది.
దానితో స్వయంగా రంగంలోకి దిగిన కర్నూలు రేంజి ఐజీ డాక్టర్ కోయ వ్రవీణ్ పోలీసులను పరుగులుపెట్టించారు. వర్రా, అతని అనుచరుల సెల్‌ఫోన్ నెంబర్ల ద్వారా వారిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. వర్రా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రవీణ్ గత రెండురోజుల నుంచి ఆ కేసునే సీరియస్‌గా తీసుకుని, చివరకు అనుకున్నది సాధించి వర్రాను అరెస్టు మీడియా ముందు ప్రవేశపెట్టగలిగారు.
కాగా వర్రాను పట్టుకుని ప్రవీణ్ పోలీసుల పరువు నిలబెట్టారన్న ప్రశంసలు ఆ శాఖలో వినిపిస్తున్నాయి. వర్రాను వదిలేయడంపై టీడీపీ సోషల్‌మీడియా సైనికులు అటు ప్రభుత్వ-ఇటు పోలీసుల అసమర్ధతను ఎండగడుతూ శరపరంపరగా పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్రాను అరెస్టు చేయటంతో పోలీసు శాఖ హాయిగా ఊపిరిపీల్చుకుంది.