– విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వం
అమరావతి: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వర్గీకరణపై ముందుకు వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో నిర్దిష్టమైన సిఫార్సులను సూచిం చడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది.
ఈ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 60 రోజుల్లోగా నివే దిక ఇవ్వాలని స్పష్టం చేసింది. వర్గీకరణపై అధ్యయనానికి కమిషన్కు అవసరమైన పూర్తి సహకారం అందించాలని సాంఘిక సంక్షేమశాఖ అదికారులను ఆదేశించింది. కమిషన్ కోరిన సమాచారం, పత్రాలు, ఆధార సహిత ధ్రువీకరణలను అన్ని శాఖల అధికారులు అందించాలని స్పష్టం చేసింది.
కమిషన్ విధులివే…: జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో
అందుబాటులో ఉన్న సమకాలీన సమాచారం, జనాభా గణన పరిగణనలోకి తీసుకోవడం. తద్వారా ఎస్సీల్లోని ఉప కులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయడం, షెడ్యూల్డ్ కులాల్లోని ఉప కులాల వెనుక బాటుతనాన్ని గుర్తించడానికి అధ్యయనాలు చేయడం, సర్వీసుల్లో ప్రాతినిధ్యం లేకపోవడం, విద్యాసంస్థల్లో ప్రవేశాలపై దృష్టి పెట్టడం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిశీలించడం,సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణను సమర్థంగా అమలు చేసే విధానాన్ని గుర్తించడం, వర్గీకరణ ప్రయోజనాలు ఎస్సీల్లోని అన్ని ఉప కులాలకు సమానంగా పంపిణీ అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించడం.