Suryaa.co.in

Andhra Pradesh

మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రస్తక్తే లేదు

– గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో లక్షా 29 వేల కోట్లు అప్పులు చేసింది
– పీపీఏలు రద్దు చేయవద్దని కేంద్రం చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది
– పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్తాయన్నా గత సర్కారు వినలేదు
– వైసీపీ హయాంలో మోగావాట్ విద్యుత్ కూడా ఉత్ప‌త్తి చేయ‌లేదు
– విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
– గృహ విద్యుత్ వినియోగదారులపై అదనపు భారంపై మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమరావతి: వ్యవసాయం మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏ ల రద్దు అంశం చాలా వివాదాస్పదం అయినట్లు మంత్రి పేర్కొన్నారు.

కేవలం పీపీఏ ల రద్దు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినట్లు పేర్కొన్నారు. నాడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనది కాదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా లేఖ రాసిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. ప్రతీ ఏడాది వినియోగదారుల సంఖ్య 5 నుంచి 6 శాతం పెరుగుతున్నా కానీ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క మెగా వాట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేసిన పాపన పోలేదని విమర్శించారు.

విద్యుత్‌ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందు కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏపీ తీసుకొచ్చిన పాలసీ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు క్రమంగా వస్తున్నాయని అన్నారు.

గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టం లోని లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం (రెండో సవరణ), 2024 బిల్లు తీసుకువస్తున్నాట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనపు భారం గానీ, విద్యుత్ సుంకం కానీ విధించడం లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లును వైసీపీ ప్రభుత్వం 2021 లోనే తీసుకుని వచ్చినా… సుంకం విధించే విషయంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు.

2014లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి విద్యుత్ అంతరాయాలు ఏపీలో ఎక్కువగా ఉండేవని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విద్యుత్ వినియోగానికి జరిమానాలు వేసిన విష సంస్కృతి నాడు ఉండేదని దుయ్యబట్టారు. తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా పాలించిన ప్రభుత్వం తమదని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఈఆర్సీకి కేవలం రూ. 3 వేల కోట్ల మాత్రమే అప్పు ఉన్నట్లు మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 2022-23 ఏడాదికి రూ. 6 వేల కోట్లు అప్పు ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. దీనితో పాటు 2023-24 ఏడాదికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. మొత్తంగా రూ. 17 వేల కోట్లు ప్రజలపై భారం వేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో విద్యుత్ రంగం సర్వనాశనం అయ్యిందని నమ్మిన ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేసినట్లు విమర్శించారు.

LEAVE A RESPONSE