-గంజాయిని కూకటివేళ్లతో పెకిలిస్తాం : హోంమంత్రి అనిత
-చంద్రగిరి యువగళం యాత్రలో గంజాయి ప్రభావం ప్రత్యక్షంగా చూశా
-వైసీపీ పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి
-25 వేల కిలోల గంజాయి స్వాధీనం, 916 మందిపై కేసులు
-గంజాయి నిర్మూలనకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
-దా’రుణ’ యాప్ బాధితుల్లో చదువుకున్న వారే అధికం
-శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత
అమరావతి: గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని శాసనసభలో హోంమంత్రి అనిత వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికట్టే అంశంపై శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (రాజమండ్రి) , రెడ్డప్పగారి మాధవిరెడ్డి(కడప), సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి) అడిగిన ప్రశ్నలకు ఆమె గురువారం జరిగిన సభలో సమాధానం ఇచ్చారు.
014-19 ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో పోలిస్తే 2019 – 24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందని ఆరోపించారు. గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఏనాడూ గంజాయిపై ఒక్క రివ్యూ కూడా చేయలేదని విమర్శించారు. అందుకే ఏజెన్సీ ఏరియాల నుంచి చిన్నపిల్ల స్కూల్ బ్యాగుల్లోకి గంజాయి వచ్చి చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
యువగళం పాదయాత్ర సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి, తన బిడ్డను తీసుకొచ్చి నారా లోకేష్ ని కలిసి గంజాయి బారిన పడిన విషయాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి గుర్తు చేశారు. గంజాయి వల్ల తమ జీవితాలు ఎంత నాశనమయ్యాయో ఆ తల్లి నాడు లోకేశ్ కి వివరిస్తూ కన్నీరు పెట్టిన సంగతిని ప్రస్తావించారు. అప్పుడే మంత్రి నారా లోకేష్ .. అధికారంలోకి రాగానే గంజాయిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి కట్టడిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
గంజాయి రవాణా రాష్ట్రమంతటా జరుగుతున్నా..వైసీపీ పాలనలో చెక్ పోస్టుల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని హోంమంత్రి మండిపడ్డారు. కానీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెక్ పోస్టులు పెంచడంతో పాటు.. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. దానివల్లనే ఐదు నెలల పాలనలో సుమారు 25 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగలిగామన్నారు. 916 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.
తాజాగా రాజమండ్రిలో ఒక ఫార్మాసిస్ట్.. జైల్లో ఉన్న నిందితుడికి గంజాయి అందించిన ఘటనలో నిఘా అధికారులు అతన్ని గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపించడమే అప్రమత్తతకు ఒక ఉదాహరణగా వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో గంజాయి నేరస్థులపై పీడీ యాక్టులతో పాటు వారి ఆస్తులు స్వాధీనం చేసుకునేలా కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. గంజాయి నిర్మూలన కోసం ఇప్పటికే 469 మంది సిబ్బందితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ స్పెషల్ ఫోర్స్ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించామన్నారు.
మిగిలిన శాఖలతో సంబంధం లేకుండా గంజాయి నిర్మూలనలో సర్వాధికారాలు కల్పించామన్నారు. రాబోయే రోజుల్లో గంజాయిని పూర్తిగా అరికడతామని సభలో హోంమంత్రి ప్రకటించారు. గంజాయి నిర్మూలనకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తిని టాస్క్ ఫోర్స్ కు పర్యవేక్షణ అధికారిగా నియమించేందుకు ఇటీవల కేబినెట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
గంజాయి నిర్మూలనతో పాటు ప్రజల్లో సామాజిక బాధ్యత పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. కడప శాసనసభ సభ్యురాలు మాధవిరెడ్డి తమ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న గంజాయి రవాణాపై అధికారులతో సమన్వయం చేసుకుని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అడ్డుకునేందుకు నేరస్థుల వివరాలతో ప్రొఫైలింగ్ చేస్తున్నట్టు తెలిపారు. అనుమానిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా పోలీస్ శాఖను ఆదేశించడం జరిగిందన్నారు. రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు.
దా’రుణ’ యాప్ బాధితులలలో చదువుకున్నవారే అధికం : హోంమంత్రి
లోన్ యాప్స్ అరాచకాలు, బలవంతపు వసూళ్లపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం వెల్లడించారు. లోన్ యాప్స్ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 212 మంది ఇబ్బందిపడినట్లు బాధితులను గుర్తించామన్నారు. ఈ యాప్ కు సంబంధించిన వారి బెదిరింపులకు భయపడి 8 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఆమె స్పష్టం చేశారు.
గూగుల్ ప్లేస్టోర్ లో 456 నకిలీ రుణ యాప్ లను గుర్తించి వీటిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. గో క్యాష్, లోన్ బారో, క్యాష్ బనానా, లింక్ లోన్ వంటి యాప్ లను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇప్పటికే 229 యాప్ లను ప్లే స్టోర్ లో బ్లాక్ చేయించడం జరిగిందన్నారు. వేధింపులకు పాల్పడిన యాప్ లకు సంబంధించి ఏకంగా 199 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామన్నారు. అక్రమ వసూళ్లు, వేధింపులకు పాల్పడే 1138 మొబైల్ స్పామ్ కాల్స్ నంబర్లను గుర్తించి టెలికం డైరెక్టర్ కు ఫిర్యాదు చేసి వాటిని బ్లాక్ చేయించినట్లు ఆమె పేర్కొన్నారు.
ఇకపై ఎవరైనా ఆన్ మోసాలకు గురైతే 1930 హెల్ప్ లైన్ లో సంప్రదించాలని కోరారు. 2020 కోవిడ్ సమయంలో ఆన్ నేరాలు, లోన్ యాప్ ల ఆగడాలు విస్తృతంగా పెరిగి నేరాల స్వరూపం కొత్త మార్గాలను అన్వేషించినట్లు హోంమంత్రి తెలిపారు. బలహీనతలను క్యాష్ చేసుకుంటూ షెల్ కంపెనీలు, దివాళాతీసిన సంస్థలకు సంబంధించిన వారు చిన్న చిన్న మొత్తాల్లో లోన్ లు ఇస్తామని అమాయక యువతని ట్రాప్ చేసి వారు ఆత్మహత్యలు చేసుకునేవరకూ విడిచిపెట్టకుండా హింసిస్తున్న ఘటనలున్నాయని ఆమె వివరించారు.
ఆశకి పోకుండా అవగాహన కలిగి ఉండడం వల్లనే ఈ తరహా వేధింపుల బారిన పడకుండా యువత, తల్లిదండ్రులు అప్రమత్తం చేసే అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ తరహా ఘటనలలో చదువుకోని వారితో పాటు చదువుకున్న వారు కూడా బలవుతున్న నేపథ్యంలో దీనిపై మరింత విస్తృత చర్చ జరగాలని హోంమంత్రి పేర్కొన్నారు.