( మార్తి సుబ్రహ్మణ్యం)
మీరు గూగుల్‌మాతను ఈ పెపంచకంలో అతి మంచివాడు.. అతి నిజాయతీపరుడు ఎవరని అడిగితే… ఇంకెవరు? వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అని ఠక్కున బదులిస్తుంది.
మీరు అసెంబ్లీ బయట, ఆర్డీఓ ఆఫీసు బయట చెట్ల ఉండే చిలకజోస్యం వాడిని కలసి ఇదే ప్రశ్నలు వేశారనుకోండి. పంజరంలో ఉన్న చిలకమ్మ చలాకీగా హంసనందినిలా నడుం ఊపుకుంటూ వచ్చి వయ్యారంగా ఒక కార్డు తీస్తుంది. అందులో కూడా ‘షిక్కటి షిరునవ్వులు షిందిస్తూ’ ఉండే జగనన్న ఫొటోనే కనిపిస్తుంది.
అక్కడికీ నమ్మకం కుదరక.. ఏ తావీజులు కట్టే మంత్రాల సాయిబు గారినో, గోరుకు సింధూరం వేసి అంజనంతో అన్వేషించే ఏ బైరాగిని ఇదే ప్రశ్న అడిగారనుకోండి. వారిద్దరూ కూడబలక్కున్నట్లు.. ఇంకెవరూ.. జగనన్నే అని ఠపీమని చెబుతారు.
నిజం. కావాలంటే తాడేపల్లికి వెళ్లి జగనన్ననే అడగండి. ఆయన కూడా అదే చెబుతారు. తనను అందరూ నవ్వు ఒఠ్ఠి అమాయకుడవోయ్ జగనూ.. నువ్వొట్టి అమాయకుడివి! నవ్వు చాలా నిజాయతీపరుడవోయ్ జగనూ అని, పార్టీ నాయకులంతా అన్నయ్యకే చెబుతుంటే.. పాపం జగనన్నియ్య సిగ్గుతో చితికి పోయి, నేలచూపులు చూస్తూ.. అంతా మీ అభిమానం అన్నా! అంటున్నారట బ్రహ్మానందం లెక్క!
పొగుడూ పొగిడించు.. మా నవ్వులు పండించు అన్నట్లు.. మనల్ని ఎవరూ పొగడకపోతే మనల్ని మనమే పొగుడుకోవాలి. లేదా వందిమాగధులతో పొగిడించుకోవాలి. ఎన్టీఆర్ ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి ప్రభ తెలుగుదేశంలో దివ్యంగా వెలుగుతున్న రోజుల్లో, తనకు సన్మానం చేయించుకోవాలన్న ఆశ పుట్టింది. తనను అంతా పొగడాలన్న కోరిక పుట్టింది. తన మనసులోని ఆ చిన్న కోరికను అప్పటి మంత్రుల చెవిలో వేశారు.
అంతే.. అమ్మగారు అడగడం.. రవీంద్రభారతిలో అంగరంగవైభవంగా ల.పా.తీ గారికి సన్మానం చేయడం.. వేదిక దద్దరిల్లేలా.. భట్రాజులు కూడా ఈర్ష్యపడేలా మేడ మ్ గారిని మంత్రులు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేయడం చకాచకా జరిగిపోయింది. తర్వాత మీడియా వద్ద అనుగ్రహభాషణం చేసిన ల.పా.తీ.. తనకు అసలు ఇలాంటివి సుతరామూ ఇష్టం ఉండదని, పిల్లలే (అప్పటికే 50 ఏళ్లు దాటిన దేవేంద్ గౌడ్ లాంటి వాళ్లు ఆ స్టేజీపై ఉన్నారు. అంటే ఆయన కూడా మేడమ్ దృష్టిలో పిల్లవాడి కిందే లెక్కన్నమాట) పట్టుపట్టి సన్మానం చేశారని ప్రవచించారు.
అలాగే లేటెస్టుగా అభినవ గాంధీ, అభినవ అంబేద్కర్ అయిన వైసీపీ అధినేత జగన్‌రెడ్డి కూడా.. తనను నాయకులంతా అతి మంచివాడు.. అతి నిజాయితీపరుడు అంటున్నారని, అందుకే మనం ఓడిపోయామని చెబుతున్నారన్న రహస్యాన్ని మీడియాకు వెల్లడించారు. మీడియా వాళ్లు కూడా.. ‘అవునా సారూ’ అంటూ, చెవిలో పెట్టుకునేందుకు పూలు అందుబాటులో లేక, నోటిమీద పెన్ను పెట్టుకున్నారట.
అంటే తన స్వర్ణయుగ పాలనలో చెప్పిందే చేశానని.. అబద్ధాలు చెప్పే అవకాశాలున్నా చెప్పలేదని.. బటన్‌నొక్కి ప్రతి ఇంటికీ మేళ్లు చేశానన్నది, జగన్‌రెడ్డిగారి కవి హృదయం కామోసు! అయితే అంత అతి మంచితనంతో.. అంత అతి నిజాయతీతో ఉండటం వల్లే మనం ఓడిపోయామని, నాయకులు తనకు చెవిలో చెప్పారని.. జగనన్న మీడియా ద్వారా పెపంచ పెజానీకానికి అందుమూలకంగా సెలవిచ్చారన్నమాట.
అలా సెలవిచ్చిన జగనన్న.. తాను షిక్కటి షిరునవ్వుతో బటన్‌నొక్కి డబ్బులు వేసినా, ఎందుకు ఓడిపోయానో అర్ధం కాలేదని వాపోవడమే వింతన్నది వైకాపేయుల ఉవాచ. అసలు అధికారంలో ఉన్నప్పుడు అన్నియ్య ఎవరితోనైనా మాట్లాడితేనే కదా? పాలన ఎలా ఉంది అని అడిగితేనే కదా? జనం ఏమనుకుంటున్నారని తెలుసుకుంటే దా? పదవులు ఇచ్చేముందు సీనియర్లతో చర్చిస్తేనే కదా? మంత్రివర్గ సమావేశాల్లో మనసువిప్పి ప్రజాసమస్యలు-వాటి పరిష్కారంపై చర్చించేందుకు చాన్సు ఇస్తేనే కదా? కష్టసుఖాలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీనియర్లకు అపాయింట్‌మెంట్ ఇస్తేనే కదా.. ఎందుకు ఓడిపోయానో తెలిసేది?! మంత్రులు, ఎమ్మెల్యేలను ధనంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, మిధున్‌రెడ్డి ఖర్మానికి వదిలేసి.. తాను మాత్రం బిందాస్‌గా కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటే, ఎందుకు ఓడిపోయానో ఎలా తెలుస్తుందన్నది వైసీపీ సీనియర్ల ప్రశ్న.
రాజకీయ పార్టీలో కొందరు సంపాదనకే ఉన్నప్పటికీ, చాలామంది గౌరవం కోసమే కొనసాగుతారు. అసలు తన నాయకులకు విలువ-గౌరవం ఇవ్వలేని నాయకత్వం.. వారి నుంచి గౌరవం ఎలా ఆశిస్తుంది? తాను గౌరవించని నాయకులు, తనని మానసికంగా ఎలా గౌరవిస్తారు? ఒకవేళ గౌరవించినా అది అవసరార్ధమే కదా? ఏ పార్టీకయినా సమిష్ఠి నిర్ణయాలే శ్రీరామరక్ష. మునిసిపల్ చైర్మన్ల నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక వరకూ పార్టీలోని అత్యున్నత విధాయక కమిటీలో చర్చించి, సమిష్టి అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకుంటేనే ఆ పార్టీ శోభిల్లుతుంది. అధికారంతో సంబంధం లేకుండా పదికాలాల పాటు నిలుస్తుంది. కానీ జగన్ తన ఐదేళ్ల జమానాలో ఏనాడైనా, ఏ పదవులకైనా పార్టీలో సీనియర్లతో చర్చించిన దాఖలాలు లేవు. అన్ని నిర్ణయాలు ఆయనే కదా తీసుకుని అమలు చేసింది? కాబట్టి అపజయాలకు కూడా ఆయనే బాధ్యుడన్నది వైకాపేయుల విశ్లేషణ.
నిజానికి గత ఎన్నికల వరకూ టీడీపీలో సమిష్టి నిర్ణయాలే అమలయ్యేవి. ఏ చిన్న ఎన్నిక వచ్చినా పొలిట్‌బ్యూరోలో కూలంకషంగా చర్చించి, నిర్ణయించే ప్రజాస్వామిక వాతావరణం ఉండేది. అందుకే అధికారంలో ఉన్నా, లేకున్నా టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ అంటే బోలెడు ఉత్కంఠ, క్రేజీ ఉండేది. ఆ క్రమంలో అసలు ఊహించని వారికి ఎమ్మెల్సీ, రాజ్యసభ పద వులు వరించిన సందర్భాలు కోకొల్లలు. రాత్రి దుప్పటిముసుగేసుకుని పడుకున్న నాయకుల తలుపు తట్టి, సారు రమ్మంటున్నారని పొలిట్‌బ్యూరో సభ్యులు వారిని బాబు వద్దకు తీసుకువెళితే.. ‘రేపు రాజ్యసభ సీటు నామినేషన్‌కు పేపర్లతో రెడీగా ఉండు’ అని బాబు చెబితే, అక్కడే ఢామ్మని కిందపడిన నేతల సంఖ్య బోలెడు.
ఫలానా కులానికి మనం ప్రాతినిధ్యం ఇవ్వలేదు కాబట్టి, ఆ కులం నేతను వెతకండి అన్న బాబు ఆదేశాలతో, ఎమ్మెల్సీలయిన వారి సంఖ్య ఎంతో చెప్పడం కష్టం. అందుకే టీడీపీ మూలాలు.. అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పటికీ బలంగా ఉన్నాయి. ఇదంతా ‘‘ఎన్నికల ముందువరకూ’’ టీడీపీలో కనిపించిన ఒక ప్రజాస్వామిక వాతావరణం!
రాజకీయ పార్టీలో నియంతృత్వం, ఒంటెత్తుపోకడ ప్రమాదం. వివిధ రాజకీయ అంశాలపై సలహాలు, సూచనలు తీసుకుని ఆ మేరకు అడుగులేయడం నాయకత్వాల కర్తవ్యం. ఎందుకంటే ఏ పార్టీకయినా నాయకులే కళ్లు,చెవులు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో మమేకం అయ్యేది వారే. ప్రజల నాడి వారికే తప్ప, రాజధానిలో కూర్చున్న నాయకత్వాలకు ఎలా తెలుస్తుంది?
ప్రజాప్రతినిధులు, నాయకులు, సీనియర్ జర్నలిస్టులతో.. నాయకత్వాలు – ముఖ్యమంత్రులు- ప్రతిపక్ష నాయకులు నిరంతం సంప్రదింపులు చేస్తుండాలి. వీరంతా జనంలో ఉండే వర్గాలు. గతంలో చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య వంటి ప్రముఖులు.. సీనియర్ జర్నలిస్టులతో ఫోన్‌లో మాట్లాడి క్యాబినెట్ నిర్ణయాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ అభ్యర్ధుల జాబితాపై ఫీడ్‌బ్యాక్ తీసుకునేవారు. జాబితా ఎలా ఉందని ఆరా తీసేవారు. ఫలానా పదవికి ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయం అడిగేవారు. అందుకు వారు ఏమాత్రం భేషజాలకు పోయేవారు కాదు.
ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. అంతా కార్పొరేట్ కల్చర్. తమ ప్రతినిధులుగా కొంతమందిని నియమించుకోవడం..టికెట్ల ఎంపిక నుంచి నిధుల పంపిణీ వరకూ ‘అన్ని వ్యవహారాలు’ వారితో చక్కబెట్టడం ఇప్పుడు అన్నిచోట్లా సాధారణమయింది. ఒకవేళ ఏదైనా అభిప్రాయం కావాలంటే.. అది మీడియా అయినా, సోషల్‌మీడియా అయినా, వ్యక్తులయినా తమ కులాల వారితో సంప్రదించడం మామూలయిపోయింది. నాయకత్వాలకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకపోవడానికి ఇదో ప్రధాన కారణం.
ఒకప్పుడు చంద్రబాబునాయుడయితే సీనియర్ జర్నలిస్టుల నుంచి ఎక్కువ ఫీడ్‌బ్యాక్ తీసుకునేవారు. ఫోన్లలో కూడా మాట్లాడేవారు. వారంతా ఎమ్మెల్యే, ఎంపి, మంత్రులు, సీనియర్ నాయకులకు అందుబాటులో ఉండేవారు. వైఎస్ దగ్గరయితే.. ప్రజాప్రతినిధుల అపాయింట్‌మెంట్లకు ఎప్పుడూ ఇబ్బందులుండేవి కాదు. చంద్రబాబునాయుడు వెళ్లేముందో, వచ్చేముందో మాట్లాడేవారు. కానీ జగన్ పనితీరు అందుకు భిన్నం. ఐదేళ్ల జగన్ పదవీకాలంలో ఆయనతో మాట్లాడిన ప్రజానిధులను వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. ఇప్పుడు మిగిలిన వారు కూడా ఈ విషయంలో జగన్‌నే ఆదర్శంగా తీసుకునే వాతావరణం కనిపిస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలాగే వ్యవహరించేవారు. ఆయన కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు కాదు. దానికి కేటీఆర్ ఒక వింత భాష్యం ఇచ్చారు. సీఎం అంటే అందరినీ కలవాలని ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు అదే కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డి ఎవరినీ కలవడం లేదని వాపోవడమ వింత. జగన్ కూడా కేసీఆర్ చెప్పులోనే కాలుబెట్టి అధికారం-సంపాదన అంశంలో అడుగులు వేశారు.
‘‘ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ అవసరాల కోసం వస్తారే తప్ప తమపై ప్రేమతో కాదు. కాబట్టి వారిని కలవాల్సిన పనిలేదు. అసలు ఆ స్థాయి తమది కాదు. మేము దైవాంశసంభూతులం’’ అన్నది వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే వారు పతమయ్యారన్నది విస్మరించకూడదు. అందాకా ఎందుకు? కుక్కను నిలబెట్టి గెలిపిస్తానన్న ఎన్టీఆర్ కూడా, ఇదే నియంత వైఖరికి రాజకీయంగా పతనమయ్యారన్నది నిష్ఠుర నిజం. ఎన్టీఆర్ ఎన్నో జనాకర్షణ పథకాలు ప్రవేశపెట్టి, పేదల్లో దేవుడిగా స్థిరపడినప్పటికీ, ఆయనకూ ఓటమి తప్పకపోవడానికి ఆ మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణం.
కాబట్టి.. ఏ రాజకీయ పార్టీ నాయకత్వమైనా, నాయకులను గౌరవించకుండా.. సమిష్టి నిర్ణయాలు తీసుకోకుండా.. వారి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా.. అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా దూరంగా పెడితే.. ఐదేళ్ల తర్వాత ప్రజలు కూడా వారిని దూరం పెడతారు. అప్పడు గౌరవం లేని చోట నాయకులూ ఉండరు. అధికారం-సంపాదన విషయంలో కేసీఆర్,జగన్ చూపిన ‘నయా కార్పొరేట్ పాలిటిక్స్’ దారిలో నడవాలని కోరుకునే వారికి, వారిద్దరి పతనం ఓ హెచ్చరిక.