– మీరు మాట్లాడాల్సింది పోయి.. ఒక గాలి బ్యాచ్ ను వదిలారు
– నడ్డా గారు.. మీరు మా అడ్డా కు వచ్చి అడ్డగోలుగా మాట్లాడకండి
– కేటీఆర్ , హారీశ్ మాటలనే కిషన్ రెడ్డి, ఈటెల కాపీ కొడుతున్నారు
– కేసీఆర్ చెప్పాలి.. మూసీ ప్రక్షాళన చేయాలో వద్దో
– వద్దంటే మా నల్లగొండ బిడ్డలు మీకు డిపాజిట్లు కూడా ఇవ్వరు
– నల్గొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నల్గొండ : జూన్2, 2014 కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ 7, 2024కు అంతే ప్రాధాన్యత ఉంది. నల్లగొండ జిల్లా పోరాటాల పురిటిగడ్డ. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం పదవీ త్యాగం చేశారు. తెలంగాణ కోసం ఆత్మ త్యాగం చేసిన శ్రీకాంతాచారిది నల్లగొండ గడ్డనే. మలిదశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవికి త్యాగం చేసి.. మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు.
తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ జిల్లా పాత్ర మరువలేనిది. నల్లగొండలో అడుగు పెట్టగానే ఆనాటి సాయుధ పోరాటం గుర్తొస్తుంది. ఈ నేల గాలి పీల్చగానే నిజాంను గడ గడలాడించిన చరిత్ర కళ్లముందు కదులుతుంది. మల్లు స్వరాజ్యం, రావి నారాయణ రెడ్డి , ధర్మబిక్షం లాంటి నాయకులు ఎంతో మంది ఈ గడ్డ నుంచి పోరాట స్ఫూర్తి నింపారు.
వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ, ఉదయసముద్రం ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. నల్లగొండను ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి విముక్తి కలిగించాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తే మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు.. 500 గ్రామాలకు తాగు నీరు ఇవ్వాలనుకుంది కాంగ్రెస్.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీరు ఇవ్వాలనుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలో నల్లగొండ జిల్లా ఎక్కువ నిర్లక్ష్యానికి లోనైనది. మీ ఆశీర్వాదంతో నల్లగొండలో 11 ఎమ్మెల్యేలు గెలిచాం. నల్గొండ ఎంపీని దక్షిణభారత దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించారు.
జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని వేల కోట్లయినా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి రాష్ట్రానికే కాదు. దేశానికే తలమానికంగా నిలపాలని ప్రయత్నిస్తున్నాం. వరి వేస్తే ఉరే అని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. సన్నాలు పండించండి బోనస్ తీసుకొండని మా ప్రభుత్వం చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.
వరి పండించినవారు నిశ్చింతగా గుండెలపై చేయి వేసుకునే పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంది. దేశంలోనే తెలంగాణ రికార్డు స్థాయి వరి ధాన్యం పండిచింది. 5 లక్షల 12వేల ఎకరాల్లో వరి పండించి రాష్ట్రంలోనే నల్లగొండ మొదటి స్థానంలో నిలబడ్డది. కేసీఆర్ ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనడం మంచిది కాదు. ఆనాడు సీఎల్పీ హోదాను తొలగించినా భట్టి విక్రమార్క మీ ప్రభుత్వంపై పోరాటం చేశారు, సలహాలు ఇచ్చారు.
మీ వయసును, అనుభవాన్ని తెలంగాణ ప్రజల కోసం ఏనాడైనా ఉపయోగించారా? ఆత్మ పరిశీలన చేసుకోండి. ఓడిపోతే కుంగిపోయి ఫామ్ హౌస్ లో పడుకోవడం మీ స్థాయికి, మీ గౌరవానికి తగదు. మేం ఓడిపోతే మళ్లీ ఎంపీలుగా గెలిచి ప్రజా సమస్యలపై కొట్లాడాం. మీకు ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే మీరు మాట్లాడాల్సింది పోయి.. ఒక గాలి బ్యాచ్ ను వదిలారు. ఏం చేసినా వద్దనడం తప్ప వాళ్లకు ఇంకోటి తెలుస్తలేదు.
గ్రూప్ 1 పరీక్షలు వద్దనడం, డీఎస్సీ వద్దనడం తెలంగాణకు మంచిదా? తెలంగాణ ఏర్పడింది…నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసమా? మీ నలుగురు కుటుంబ సభ్యుల కోసమా? ఆత్మ పరిశీలన చేసుకో కేసీఆర్. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. నల్లగొండ గడ్డపై నుంచి ఈ విషయాన్ని నేను గర్వాంగా చెబుతున్నా.
ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించి శాఖలవారీగా లెక్కలు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నడ్డా గారు.. మీరు మా అడ్డా కు వచ్చి అడ్డగోలుగా మాట్లాడండి. మోదీ గారు.. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఒక్క ఏడాదిలో 55,143 ఉద్యోగాలు భర్తీ చేశారా? నిరూపిస్తే ఢిల్లీ నడిబజారులో తలవంచుకుని మీకు క్షమాపణ చెబుతా.. లేకపోతే మీరు మా రాష్ట్రాన్ని అభినందించండి. కేటీఆర్ , హారీశ్ మాటలనే కిషన్ రెడ్డి, ఈటెల కాపీ కొడుతున్నారు.
దొంగల సోపతి పట్టి దొంగల బండి ఎక్కోద్దు.. దొంగల బండిలో చేరితే మీకున్న గౌరవం తగ్గుతుంది. కేసీఆర్, మోదీకి నల్లగొండ వేదికగా సవాల్ విసురుతున్న. ఏడాదిలో 21వెల కోట్లు విడుదల చేసి రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మాది. దేశంలో ఎక్కడైనా ఇలాంటి చరిత్ర ఉందా? రూ.2,400 కోట్లు ఒక్క నల్లగొండ జిల్లాలో రుణమాఫీ జరిగింది. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానిది.
విద్యా వ్యవస్థలో సమూల మార్పు తీసుకొచ్చి విద్యార్థులను మన ప్రభుత్వం ఆదుకున్నది నిజం కాదా? రైతాంగం కోసం55 వేల కోట్లు ఖర్చు చెస్తే కేసీఆర్ కుటుంబం చేసిన అప్పులకు ఏడాదిలో 65వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. నల్గొండ గడ్డపై నుంచి తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా. ఈసంక్రాంతి తరువాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది.
రైతుల ఖాతాల్లో రైతు భరోసా పడుతుంటే బీఆరెస్ గుండెల్లో గుబులు పుట్టాలి. రైతులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. సన్నాలు పండించండి.. బోనస్ పొందండి. మీరు పండించిన సన్న బియ్యంతోనే పేద బిడ్డలకు అన్నం పెడతాం. ఫోర్త్ సిటీని అభివృద్ధి చేసి 50వేల ఎకరాల్లో కొత్త నగరాన్ని నిర్మించనున్నాం. మీ కష్టాలు తీర్చేందుకు మూసీ ప్రక్షాళన చేయాలని మేం ముందుకొస్తే బీఆరెస్ అడ్డుకుంటోంది.
మూసీ ప్రక్షాళన చేయాలో వద్దో.. పక్కన ఉన్న ఏకలింగాన్ని అడగండి. వద్దంటే ఆ ఏకలింగాంన్ని మూసీలోనే ముంచండి. మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేసి.. నల్లగొండ ప్రజలను మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తాం. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. అడ్డొచ్చిన వారి సంగతి మీరు చూసుకోండి. మూసీ వద్దనే వారికి గోరీ కట్టే శక్తి మీకుంది.ఎన్ని కష్టాలు వచ్చినా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం.అనుభవం కలిగిన కేసీఆర్ చెప్పాలి.. మూసీ ప్రక్షాళన చేయాలో వద్దో.వద్దంటే మా నల్లగొండ బిడ్డలు మీకు డిపాజిట్లు కూడా ఇవ్వరు.