Suryaa.co.in

Editorial

కాపులలో ‘అల్లు’కుంటున్న అసంతృప్తి

  • అర్జున్ అరెస్టుతో చీలిపోయిన కాపులు

  • పవన్ ఖండించకపోవడంపై కాపుల్లో భిన్నాభిప్రాయాలు

  • ఖండికపోవడంపై కాపు యువకుల కన్నెర్ర

  • అర్జున్‌ను పరామర్శించకపోవడంపై కాపు యూత్ అసంతృప్తి

  • సినీ పరిశ్రమ అల్లును పరామర్శించలేదా అని ప్రశ్నల వర్షం

  • బీజేపీ,బీఆర్‌ఎస్ ఖండించినప్పుడు పవన్ మౌనం ఎందుకని వాదన

  • పవన్ మౌనంపై భగ్గుమంటున్న బన్నీ ఫ్యాన్స్

  • కాపు సంఘాలు-పెద్దలతో వాగ్వాదం

  • ఖండించకపోతే ఇకపై మీ సభలకు వచ్చేది లేదంటూ అల్టిమేటమ్

  • అల్లును అరెస్టు చేసి అవమానించినా ఖండించరా అని ఆగ్రహం

  • ‘పుష్ప’ సినిమాను ఫస్ట్ డే చూడవద్దంటూ వచ్చిన సందేశాలపై అర్జున్ ఫ్యాన్స్ ఫైర్

  • ఎందుకు ఖండించాలంటున్న కాపు పెద్దలు

  • తగిన శాస్తి జరిగిందంటూ కాపు పెద్దల వ్యాఖ్య

  • ఆయన వైసీపీ మద్దతుదారంటూ వ్యాఖ్యలు

  • పవన్ దగ్గరకే అర్జున్ రావాలని వాదన

  • అల్లు అరెస్ట్‌పై సోషల్‌మీడియాలో మెగా ఫ్యాన్స్ వ్యంగ్య పోస్టులు

  • కష్టకాలంలో శిల్పాలు రారు మెగా మామయ్యేలే వస్తారంటూ కామెంట్లు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై జనసేన దళపతి-ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మౌనం కాపు సామాజికవర్గంలో చీలికలకు దారితీస్తోంది. తెలుగు సినీ పరిశ్రమతోపాటు.. బీజేపీ-బీఆర్‌ఎస్ గంపగుత్తగా అల్లు అర్జున్‌కు కష్టకాలంలో దన్నుగా నిలిచిన సందర్భంలో, సమీప బంధువైన జనసేన అధిపతి పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటివరకూ అల్లు అరెస్టును, కనీసం ఖండించకపోవడంపై కాపు వర్గాల్లో.. ప్రధానంగా కాపు యువతలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అరెస్టయిన తర్వాత పవన్ కల్యాణ్ హైదరాబాద్ వెళ్లి అల్లు అర్జున్‌ను పరామర్శించకపోవడమే కాపు యువత ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే ఈ అంశంపై కాపు సంఘ పెద్దలు ఒక వైపు.. 40 ఏళ్లలోపు కాపు యువత మరొక వైపు నిట్టనిలువునా చీలినట్లు వారి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో పుష్ప-2 సినిమా షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె తనయుడు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. దీనిపై సోషల్‌మీడియాలో విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో.. ఆరోజు పుష్ప-2 షోకు వచ్చిన అల్లు అర్జున్‌పై కేసు పెట్టిన పోలీసులు, ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

ఒక రాత్రి జైలు జీవితం గడిపిన అర్జున్, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌తో బయటకొచ్చారు. జైలునుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్‌ను, తెలుగు సినీ పరిశ్రమ యావత్తూ ఇంటికివెళ్లి పరామర్శించింది. అగ్ర హీరోలు, దర్శక నిర్మాతలూ, డిస్టిబ్యూటర్స్ అల్లుకు మేమున్నామంటూ సంఘీభావం ప్రకటించారు.

ఇక కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌తోపాటు ఆ పార్టీ మొత్తం అల్లు అర్జున్ అరెస్టును ఖండించింది. పోలీసుల చర్యను బీజేపీ-బీఆర్‌ఎస్ తప్పుపట్టాయి. సీఎం చంద్రబాబునాయుడు సైతం, హీరో అర్జున్ తండ్రి అల్లు అరవింద్‌తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి కన్నబాబు తెలంగాణ ప్రభుత్వ చర్యను ఖండించారు. అంటే తెలంగాణలో బీజేపీ-బీఆర్‌ఎస్, ఏపీలో వైసీపీ అల్లు అర్జున్ అరెస్టును విధానపరంగా వ్యతిరేకించినట్లు స్పష్టమవుతూనే ఉంది.

ఇక అల్లు అర్జున్ అరెస్టు తర్వాత, చిరంజీవి కుటుంబ సభ్యులు అర్జున్ ఇంట్లో దాదాపు 3 గంటలు గడిపారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైసీపీకి ఇటీవలే రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా, హైదరాబాద్ వెళ్లి అర్జున్‌ను పరామర్శించారు. అల్లు అర్జున్ తాజాగా చిరంజీవి ఇంటికి వెళ్లినట్లు బయటకు వచ్చిన ఫొటోలు చెబుతున్నాయి.

అటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం.. అరెస్టులో తన ప్రమేయం ఏమీ లేదని, ప్రభుత్వం చట్టప్రకారం వ్యవహరించిందని స్పష్టం చేశారు. అయినా వాళ్లేమీ దేశం కోసం యుద్ధం చేయలేదు కదా? పైసలు పెట్టి సినిమాలు తీశారు. పైసలు వచ్చినయ్. మేము అరెస్టు చేయకపోతే, ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని మీరే అడుగుతారు కదా? అర్జున్ భార్య మాకు బంధువు. ఆయన మామ మా కాంగ్రెస్ నాయకుడని కుండబద్దలు కొట్టారు. అల్లు అర్జున్ అరెస్టుకు ముందు.. తర్వాత జరిగిన పరిణామాలివి.

అయితే..ఈ వ్యవహారంలో జనసేన అధినేత, ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం.. అర్జున్ అరెస్టును ఖండించకపోవడం, కాపు సామాజికవర్గం రెండుగా చీలేందుకు కారణమయింది. ఈ వ్యవహారంలో 40 ఏళ్లు లోపున్న కాపు యువత ఒకవైపు-కాపు పెద్దలు-సంఘాలు మరో వైపు చీలిపోవడం విశేషం. అల్లు అర్జున్ అరెస్టును, పవన్ ఖండించకపోవడాన్ని కాపు యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అరెస్టయినతర్వాత కూడా పవన్ హైదరాబాద్‌కు వెళ్లి.. అర్జున్‌ను పరామర్శించి, ధైర్యం చెప్పకపోవడమే కాపు యువత ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

బీజేపీ-బీఆర్‌ఎస్-యావత్ తెలుగు సినిమా పరిశ్రమ బన్నీకి దన్నుగా ఉంటే.. దగ్గరి బంధువు, కాపు అభిమానంతో తాము ఓట్లు వేసి గెలిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం, కనీసం ఖండించకపోవడాన్ని కాపు యువత జీర్ణించుకోలేకపోతోంది. దీనిపై వారంతా కాపు పెద్దలు, కాపు సంఘాల నాయకులతో వాదనకు దిగుతున్నారు.

‘‘పవన్‌కు మీరెందుకు నచ్చచెప్పరు? మీరు కూడా కాపు సంఘ నాయకులుగా ఎందుకు ఖండించరు? అర్జున్ కాపు కాదా? చిరంజీవి-పవన్ చెబితేనే స్పందిస్తారా? అలా అయితే మీ కార్యక్రమాలకు రమ్మనమని ఇకపై మాకు చెప్పవద్దు. అల్లు అర్జున్ అరెస్టయి కష్టాల్లో ఉంటే, ఒక కాపు నేతగా కూడా పవన్-మీరు ఖండించకపోతే ఇక ఈ సంఘాలు, మీ పెద్దరికాలు ఎందుకు’’ అని కాపు యువకులు, కాపు సంఘ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

అయితే.. అల్లు అర్జున్ గత ఎన్నికల్లో నంద్యాలకు వచ్చి వైసీపీ అభ్యర్ధి శిల్పాకు ప్రచారం చేసిన విషయాన్ని కాపు పెద్దలు, యువకులకు గుర్తు చేస్తున్నారు. ‘‘ అప్పుడు పవన్ ఒకవైపు వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే, అర్జున్ వైసీపీ అభ్యర్ధి కోసం ప్రచారం చేస్తే పవన్‌కు అర్జున్ ఏం విలువ ఇచ్చినట్లు? మళ్లీ తన ఇష్టం వచ్చిన వాళ్ల దగ్గరకు వెళతానని తలబిరుసుగా చెప్పడం ఏమిటి? ఇవన్నీ మీకు తెలియదు. ఉడుకు రక్తం’’ అంటూ హితవు పలికి పంపిస్తున్నారు. ప్రధానంగా తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కాపు యువకుల్లో, ఈ తరహా అసంతృప్తి కనిపించడం గమనార్హం.

కాపు పెద్దలు ఎంత నచ్చచెబుతున్నప్పటికీ, యువత సమాధానపడటం లేదు. పైగా పుష్ప-2 సినిమాను మొదటి రోజు చూడవద్దంటూ.. మెగా సంఘం అధ్యక్షుడొకరు మెగా అభిమాన సంఘాలకు సందేశాలు పంపించారంటూ బన్నీ ప్యాన్స్ మండిపడుతున్నారు. ‘‘రాజకీయాలు వేరు. సినిమా వృత్తి- వ్యక్తిగతం వేరు. అర్జున్ అసెంబ్లీ ఎన్నికల ముందు నంద్యాల వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేసినందున, అల్లును దూరం పెట్టడం ఏమిట’’ని ఆయన అభిమానులు, కాపు పెద్దలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

అలాగైతే ఎన్నికల ముందు టీడీపీ-జనసేనపై పోటీ చేసిన వైసీపీ వాళ్లు టీడీపీ-జనసేనలో చేరడం లేదా? మరి వారిని ఎలా చేర్చుకుంటున్నారు? రాజకీయాలకు-వ్యక్తిగ త విషయాలకూ ముడిపెడితే ఎలా అని కాపు పెద్దలను నిలదీస్తున్నారు. పైగా అల్లు అర్జునే కాబోయే కాపు నాయకుడని, మీరు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుంటున్నారని రుసరుసలాడుతుండటం, కాపు పెద్దలకు ఇబ్బందిగా పరిణమించింది.

నిజానికి ఏపీలో కాపు ఉద్యమం సజీవంగా ఉండటానికి, ముద్రగడ పద్మనాభం రాష్ట్ర స్థాయి కాపు నేతగా ఎదగడానికి, కాపు యువకులే కారణమన్నది నిష్ఠుర సత్యం. అలాంటి యువతకు ఎలా నచ్చచెప్పాలో అర్ధం కాని పరిస్థితి కాపు పెద్దలు, సంఘాల నాయకులది. అలా అని వారిని వదిలేస్తే, వైసీపీ వారిని వాడుకునే ప్రమాదం ఉందన్నది కాపు పెద్దల మరో ఆందోళన. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్ధం కాని అయోమయం వారిది.

అయితే అర్జున్ అభిమానులయిన కాపు యువత.. తరచూ జరిగే కాపు సభలు-సమావేశాలకు, అర్జున్ అరెస్టుపై మౌనానికీ లింకు పెట్టడం కాపు సంఘ పెద్దలకు ఇబ్బందికరంగా మారింది. నిజానికి 40 ఏళ్లలోపు వయసున్న కాపు యువకులే.. గత ఎన్నికల్లో జనసేనతోపాటు, టీడీపీ విజయానికి పనిచేసింది. కాపు పెద్దలు- సంఘాలకు చిరంజీవి కుటుంబ వ్యవహారాలు, వారి శైలి తెలిసినందున ఆచితూచి వ్యవహరిస్తుంటారు.

కానీ ఇప్పుడు అర్జున్ అరెస్టును తాము ఖండించకపోతే, భవిష్యత్తులో తమ సంఘాలు నిర్వహించే బహిరంగసభలు, సమావేశాలకు కాపు యువత దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. కాపు యువత సహకారం లేకపోతే ఏ కార్యక్రమాలూ విజయవంతం కావు. వారికి డబ్బులు ఇవ్వకపోయినా, కులాభిమానంతో భుజానవేసుకుని పనిచేస్తారు. అందువల్ల వారిని సంతృప్తి పరచాలంటే, అర్జున్ అరెస్టును కాపు సంఘ నాయకులుగా తాము ఖండించక తప్పని పరిస్థితి. ఖండిస్తే పవన్‌ను రాజకీయంగా ఇబ్బందిపెట్టిన వారమవుతామన్న సంకటం. ఇదీ కాపు సంఘాలు, కాపు పెద్దల ఇరకాట పరిస్థితి.

అల్లు అర్జున్ అరెస్టును ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ ఎలా ఖండిస్తారన్నది కాపు పెద్దలు, సంఘాల నాయకుల వాదన. ఒకవేళ ఖండిస్తే సంధ్యా థియేటర్ ఘటనలో మృతి చెందిన మహిళ, చావుబతుకుల్లో ఉన్న యువకుడికి ఏమైనా ఫర్వాలేదా? అని వచ్చే విమర్శలు, పవన్‌కు రాజకీయంగా ఇబ్బంది కలిగించవా అని ప్రశ్నిస్తున్నారు. రేపు ఇలాంటి ఘటన ఇక్కడ జరిగినా పవన్ ఖండించాల్సి వస్తుంది కదా? అందుకే పవన్ మౌనంగా ఉన్నారని, ఈ విషయాలు కాపు యువకులకు చెప్పినా అర్ధం కావడం లేదని తల పట్టుకుంటున్నారు.

మరికొందరు కాపు సంఘ నాయకులు మాత్రం.. అర్జున్ అరెస్టును పవన్ ఖండించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. ‘‘ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేసిన అర్జున్ అరెస్టును బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ఎలా ఖండిస్తారు? ఒకవేళ ఖండిస్తే.. వైసీపీకి ప్రచారం చేసినా అర్జున్ అరెస్టును పవన్ ఖండించారంటే, వాళ్లూ వాళ్లూ ఒకటే అన్న విమర్శలు రావా? అయినా పవన్ కల్యాణ్ ఎందుకు హైదరాబాద్ వెళ్లి అర్జున్‌ను పరామర్శించాలి? అర్జునే విజయవాడ వచ్చి పవన్‌ను కలవాలి. పవన్ స్థాయి అది. చిరంజీవి ఇంటికి వెళ్లిన అర్జున్, విజయవాడలో పవన్ దగ్గరకు రాలేరా? అయినా తనకు నచ్చినట్లు ఉంటానన్న అర్జున్ అరెస్టును ఖండించాల్సిన అవసరం పవన్‌కు ఏమిటి? అని వాదిస్తున్నారు.

కాగా తాజా ఎపిసోడ్‌లో బన్నీ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్.. సోషల్‌మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. కష్టకాలంలో శిల్పాలు రారు. మామయ్యలే వస్తారు.. నా ఇష్టం చోటకు వెళతానన్న తగిన శాస్తి జరిగింది.. ఇప్పుడైనా మెగా విలువ తెలిసిందా అంటూ పోస్టులు పెడుతున్న పరిస్థితి అల్లు-మెగా వర్గాల మధ్య పెరుగుతున్న దూరానికి ఒక సంకేతంలా కనిపిస్తోంది. కానీ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం ఒక శుభసంకేతమని, ఇది రెండు వర్గాల మధ్య ఉన్న అపోహలు తొలగించేందుకు కారణమవుతాయని కాపు వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం, కాపుల్లో చీలికకు కారణమవుతోంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన మాత్రం.. కాపు పెద్దలు, కాపు సంఘాల నాయకుల్లో కనిపిస్తోంది.

LEAVE A RESPONSE