Suryaa.co.in

Editorial

మంత్రుల మౌనరాగం!

  • సైలెంట్ మోడ్‌లో సీనియర్లు

  • వైసీపీ విమర్శలపై ఎదురుదాడి కరవు

  • పెన్షన్ల తొలగింపుపై వైసీపీ ఉధృత ప్రచారం

  • 3 లక్షల పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ క్షేత్రస్థాయి ప్రచారం

  • అయినా తిప్పికొట్టలేని నిస్సహాయ స్థితిలో కూటమి

  • పదువులు తీసుకున్నా.. మంత్రుల మౌనం

  • పదవులొచ్చిన వారితోనే మాట్లాడించమంటున్న సీనియర్లు

  • ఉత్సవ విగ్రహాలుగా మారిన సచివులు

  • నియోజకవర్గ నేతల్లోనూ అదే నిర్వేదం

  • కూటమిలో మాట్లాడుతున్నది కొందరే

  • పెదవి విప్పని సీనియర్ నేతలు

  • బుద్దా వెంకన్న, డొక్కా, విల్సన్ మరికొందరి ఎదురుదాడి

  • సీనియర్లలో స్పందిస్తున్నది సోమిరెడ్డి ఒక్కరే

  • స్తబ్దతలో సోషల్‌మీడియా సైన్యం

  • ఫలితంగా వైసీపీ ఆరోపణలు నిజమని నమ్ముతున్న వైనం

( మార్తి సుబ్రహ్మణ్యం)

అధికారంలోకి రాకముందు వైసీపీపై చెలరేగిపోయిన టీడీపీ సీనియర్లు.. పార్టీ అధికారంలోకి వచ్చాక మాత్రం నిస్తేజంగా కనిపిస్తున్నారు. అటు టీడీపీ సొషల్‌మీడియా సైనికులదీ అంతే నిర్వేదం. పోనీ.. మంత్రి పదవులు తీసుకున్న మంత్రులేమైనా వైసీపీపై ఎదురుదాడి చేస్తున్నారా అంటే.. వారూ దుప్పటిముసుగేసుకుని పడుకోవడం, తమ్ముళ్లకు నచ్చడం లే దు. పోనీ పాతకాపులేమైనా పెదవి విప్పుతున్నారా అంటే.. ‘పదవులిచ్చిన వారితో మాట్లాడించండి. మాతో ఎందుక’ంటూ నిష్ఠూరపు స్వరాలు వినిపిస్తున్న వైచిత్రి. ఆ ప్రకారంగా.. పదవులు పొందిన వారు-పొందని వారూ కలసి ఏకగళంతో మౌనరాగం ఆలపించడమే ఆశ్చర్యం. ఫలితంగా ఆరునెలల కూటమి పాలనపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు-విమర్శలే జనంలోకి వెళుతూ, అవి నిజమేనని నమ్ముతున్న పరిస్థితి.
ఆరునెలల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, సర్కారు సాధించిన విజయాలు తప్ప.. సర్కారుపై వైసీపీ చేసే విమర్శలు, ఆరోపణలే జనంలోకి వెళుతుండటాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి పదవులు తీసుకున్న వారితోపాటు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన వారితోపాటు..మంత్రి పదవులు దక్కని సీనియర్లు సైతం, వైసీపీ నేతల ఆరోపణలపై ఎదురుదాడి చేయకుండా, మౌనరాగం ఆలపిస్తుండటంపై పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది.

ప్రధానంగా రేషన్ బియ్యం కుంభకోణంతోపాటు.. తాజాగా రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్లు కట్ చేశారంటూ వైసీపీ అధినేత జగన్ నుంచి, మాజీ మంత్రుల వరకూ శరపరంపరగా చేస్తున్న ఆరోపణలను.. ఆ స్థాయిలో తిప్పికొట్టే మంత్రులు గానీ, పదవులు తీసుకున్న కార్పొరేషన్ చైర్మన్లు గానీ, భూతద్దం వేసి వెతికినా కనిపించకపోవడంపై క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సహజంగా కొత్తగా మంత్రులయిన వారు చురుకుగా ఉంటారు. తమను తాము నిరూపించుకునేందుకు, ఉబలాటపడుతుంటారు. తమ నాయకుడిని మెప్పించి, ఆయన దృష్టిలో పడేందుకు విపక్షాలపై ఎదురుదాడికి అస్త్రశస్త్రాలు పదునుపెడుతుంటారు. కానీ విచిత్రంలో కూటమి ప్రభుత్వంలో.. కొత్తగా మంత్రి పదవి అవకాశం లభించిన సత్యకుమార్‌యాదవ్ తప్ప, మిగిలిన మంత్రులంతా మౌనరాగం ఆలపించడాన్ని క్యాడర్ ఆక్షేపిస్తోంది.
పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, డోలా స్వామి, రాంప్రసాద్‌రెడ్డి, సుభాష్, దుర్గేష్, నాదెండ్ల మనోహర్, సవిత, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, బిసి జనార్దన్‌రెడ్డి, టిడి భరత్, అనగాని సత్యప్రసాద్, రామానాయుడు రాజకీయ విమర్శలపై ఎదురుదాడి చేయకపోవడాన్ని పార్టీ క్యాడర్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. ఇక హోంమంత్రి అనిత అప్పుడప్పుడు స్పందిస్తున్నారన్న వ్యాఖ్యలు లేకపోలేదు. అయితే వీరిలో రామానాయుడు, సవిత, నాదెండ్ల మనోహర్ తమ శాఖలపై పట్టు సాధించి తరచూ మాట్లాడుతుండటం ఒక ఊరట.
ఇక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆనం రామానారాయణరెడ్డి, గతంలో కూడా మంత్రిగా పనిచేసిన నారాయణ, ఫరూఖ్, అచ్చెన్నాయుడు, పార్ధసారథి కూడా వైసీపీ ఆరోపణల దాడిపై ఎదురుదాడి చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి సీఎం-ఆయన కుటుంబసభ్యులు, పాలనలో అవినీతిపై దాదాపు ప్రతిరోజూ ఆరోపణలు సంధిస్తున్నారు. అయితే విచిత్రంగా క్యాబినెట్‌లో సీనియర్ అయిన ఆనం గానీ, గతంలో మంత్రిగా చేసిన నారాయణ గానీ వాటిపై ఇప్పటివరకూ ఎదురుదాడి చేసిన దాఖలాలు లేవు.
సీనియర్ మంత్రి ఆనం ఇప్పటివరకూ జగన్‌పై నేరుగా ఎదరుదాడి చేసిన దాఖలాలు లేవంటున్నారు. అయితే కాకాణి ఆరోపణలతో పాటు, జగన్ ఆయన పార్టీ నాయకులపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతోంది కేవలం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాత్రమే కావడం గమనార్హం. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా, తొలి నుంచీ టీడీపీ ప్రత్యర్ధులపై అదే స్థాయిలో ఎదురుదాడి కొనసాగిస్తుండటం విశేషం.
కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్ , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర బాగానే స్పందిస్తున్నా, మరో మంత్రి పార్ధసారథి మాత్రం స్పందించకపోవడం కార్యకర్తల అసంతృప్తికి కారణమవుతోంది. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ మంత్రి దేవినేని ఉమా మాత్రం జగన్, ఆయన పార్టీపై నిరంతరం విరుచుకుపడుతున్నారు.
ఇక గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూటమిపై విరుచుకుడుతున్నా, జిల్లా మంత్రి అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ నుంచి చప్పుడు లేక పోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసలు ఈ జిల్లాలో పార్టీ కార్యకర్తలు.. తమకు కష్టం వస్తే ఎవరిని కలవాలో అర్ధం కాని పరిస్థితి. దానితో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, యరపతినేని శ్రీనివాసరావును కలసి సమస్యలు మొర పెట్టుకుంటున్న పరిస్థితి.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి నాగార్జున, జిల్లా ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూటమిపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నా.. జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా స్వామి తమకేమీ పట్టనట్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలి కాలంలో జగన్‌పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో మంత్రి అనగాని సైతం అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. పోనీ ఈ ముగ్గురు తమ శాఖలపై పట్టు సాధించి, శాఖాపరంగా ఏమైనా ప్రతిభ కరబరుస్తున్నారా అంటే అదీ లేదంటున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మాజీ మంత్రి కన్నబాబు.. ఇటీవలి కాలంలో రేషన్ బియ్యం కుంభకోణం, కాకినాడ సెజ్‌కు సంబంధించి శరపరంపరంగా సంధించిన ఆరోపణాస్త్రాలకు.. జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్ నుంచి ఎదురుదాడి కరవు. వీరిలో కందుల దుర్గేష్ తన శాఖపై కొంత పట్టు సాధించినా, సుభాష్ విషయంలో అది కూడా కనిపించడం లేదంటున్నారు. జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా రేషన్ కుంభకోణంపై ఎదురుదాడి చేయకపోవడంపై కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన నియోజకవర్గానికే పరిమతమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి రామానాయుడు తన శాఖపై అద్భుతమైన పట్టు సాధించిన ప్పటికీ, వైసీపీపై ఎదురుదాడిలో నిర్లిప్తంగా ఉన్నారంటున్నారు.
ఇక ఉమ్మడి విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్, సమన్వయకర్త విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కల్యాణి కూటమి వైఫల్యాలపై శరపరంపరగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నప్పటికీ, విశాఖ జిల్లాలో వాటిపై స్పందించే నేతలకు దిక్కులేకుండా పోయింది. ఇక్కడ మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, గంటా శ్రీనివాసరావు, బండారు శ్రీనివాసరావు ఉన్నప్పటికీ వారంతా మౌనంగా ఉండటమే శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. జిల్లా మంత్రి వంగలపూడి అనిత అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తున్నారంటున్నారు.
ఉమ్మడి విజయనగరంలో మాజీ మంత్రి బొత్స తరచూ కూటమి వైఫల్యాలను విమర్శిస్తున్నప్పటికీ.. జిల్లా మంత్రి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌లో చలనం లేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అసలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారంటున్నారు. ఇక శ్రీకాకుళంలో జగన్ బాధితుడైన సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు.. వైసీపీ ఆరోపణలపై ఎదురుదాడి చేయకుండా మౌనంగా ఉండటంపై, పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసే విమర్శలపై అచ్చెన్నాయుడు స్పందించకపోవడం బట్టి, ఆయన రాజకీయంగా పెద్ద చురుకుగా లేరని అర్ధమవుతోందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల నుంచి పెద్దగా విమర్శలు లేకపోయినా.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, జగన్-వైసీపీ ఆరోపణలకు సంబంధించి రాజకీయపరమైన ఎదురుదాడికి దూరంగా ఉంటున్నారని, పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సీనియర్ మంత్రి ఫరూఖ్, కొత్త మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, టిజి భరత్ రాజకీయపరమైన ఎదురుదాడిలో విఫలమయ్యారన్న విమర్శలు లేకపోలేదంటున్నారు. వీరికంటే సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, సుజాతమ్మనే వైసీపీపై ఎదురుదాడి చేస్తున్నారని చెబుతున్నారు. అసలు కర్నూలు ఎంపి ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారన్నది పార్టీ కార్యకర్తలకే అర్ధం కావడం లేదంటున్నారు.
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడైన ఎంపి విధున్‌రెడ్డి, మాజీ మంత్రి రోజా, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి శరపరంపరగా సంధిస్తున్న ఆరోపణాస్త్రాలను ఎదుర్కొనే నేతలే లేకపోవడం ఆశ్చర్యం. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఈ విషయంలో విఫలమయ్యారన్న విమర్శలు లేకపోలేదు. ఇక తిరుమల లడ్లలో కల్తీ అంశం నుంచి.. జగన్‌పై ఎదురుదాడి అంశంలో బలిజనాడు కన్వీనర్, పార్టీ నేత ఓవి రమణ ముందున్నారు. ఇది సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడం ప్రస్తావనార్హం.
కడపలో ఎంపి అవినాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి కూటమిపై చేసే విమర్శలను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, బీటెక్ రవి మినహా ఎవరూ స్పందించడం లేదంటున్నారు. ఇటీవల ఇక్కడి నుంచి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరినప్పటికీ, జగన్‌పై ఎదురుదాడికి నాయకత్వం వహించే వారే కరవయ్యారంటున్నారు. కడప వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడం ప్రస్తావనార్హం.
ఇక అనంతపురంలో వైసీపీ నేత అనంతవెంకట్రామిరెడ్డి కూటమిపై తరచూ చేస్తున్న విమర్శలను.. జిల్లాకు చెందిన మంత్రి పయ్యావుల కేశవ్, సవిత తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. మంత్రి సవిత కనీసం తన శాఖాపరమైన విషయంలో చురుకుగా ఉన్నప్పటికీ, సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఎందుకో నిర్లిప్తంగా ఉండటంపై, పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేయడంలో నిష్ణాతుడైన కేశవ్, ఎందుకో నిర్లప్తంగా ఉండటం పార్టీ నేతలను విస్మయపరుస్తోంది. వీరిద్దరికంటే మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక్కరే, జగన్‌పై నేరుగా ఎదురుదాడి చేస్తున్నారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో కార్పొరేషన్ పదవులు తీసుకున్న నేతలు సైతం, వైసీపీపై ఎదురుదాడిలో విఫలమవుతున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఆనం వెంకట రమణారెడ్డి, లంకా దినకర్, విజయ్‌కుమార్, అనిమిని రవినాయుడు, జి. కోటేశ్వరరావు, జీవీ రెడ్డి వంటి అతికొద్దిమంది మాత్రమే వైసీపీపై ఎదురుదాడి చేస్తున్నారని, మిగిలిన వారంతా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇక ప్రభుత్వ చీఫ్ విప్ జి.ఆంజనేయులు ఒక్కరే వైసీపీపై ఎదురు దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

పవన్ మౌనం
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం.. వైసీపీ అధినేత జగన్ విమర్శలపై మౌనంగా ఉండటంపై, కూటమిలో విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో జగన్‌పై విరచుకుపడిన ఆయన, ఇప్పుడు జగన్ విమర్శలపై స్పందించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబునాయుడు సందర్భానుసారంగా జగన్‌పై విమర్శలు సంధిస్తుంటే, మంత్రి లోకేష్ జగన్‌పై నేరుగా ఎదురుదాడి చేస్తున్నారు. కానీ జనసేన దళపతి పవన్ మాత్రం మునుపటి మాదిరిగా, జగన్‌పై విరుచుకుపడకపోవడంపై, కూటమి వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ వైసీపీపై విరుచుకుపడకపోవడాన్ని, కూటమి శ్రేణులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
అటు బీజేపీ సైతం వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్‌పై ఎదురుదాడి చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎంపి సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, పాతూరి నాగభూషణం, నాగోతు రమేష్, జయప్రకాష్ మాత్రమే వైసీపీపై ఎదురుదాడి చేస్తుండటం ప్రస్తావనార్హం. కాకినాడ జిల్లాలో ఎంపి ఉదయ్ శ్రీనివాస్ సహా, జనసేన ఎమ్మెల్యేలంతా మౌనరాగం ఆలపించడాన్ని ప్రస్తావిస్తున్నారు. వీరిలో కొందరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడితో అంటకాగుతున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.
ప్రధానంగా మచిలీపట్నం ఎంపి, గత వైసీపీ సర్కారులో జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బాలశౌరి కూడా, ఇప్పటివరకూ జగన్‌పై ఒక్క విమర్శ చేయకపోవడాన్ని కూటమి కార్యకర్తలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. నిజానికి వైసీపీ అధినేత జగన్‌కు సంబంధించి బాలశౌరికి తెలిసినన్న రహస్యాలు మరెవరికీ తెలియవంటున్నారు. అయినప్పటికీ బాలశౌరి వైసీపీ అధినేత జగన్ రహస్యాలపై పెదవి విప్పకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
కాగా.. టీడీపీ సీనియర్లు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారంతా మౌనంగా ఉండటం ప్రస్తావనార్హం. ఏదైనా అంశానికి సంబంధించి వారిని స్పందించాలని, పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిన సందర్భంలో..‘మేం ఎందుకు? ఫలానా మంత్రితో మాట్లాడి ంచండి’ అంటూ నిష్ఠూరపు స్వరాలు వినిపిస్తున్న పరిస్థితి. ఏతావతా.. ఇటు పదవులు తీసుకున్నవారు, అటు పదవులు రాని సీనియరు..్ల వైసీపీ చేసే ఆరోపణాస్త్రాలపై జమిలిగా మౌనరాగం ఆలపిస్తున్న వైచిత్రి.
గతంలో జిల్లాలు, రీజియన్ మీడియా కో ఆర్డినేటర్ల వ్యవస్థ పార్టీలో బలంగా ఉండేది. జిల్లా-రాష్ట్ర స్థాయిలో ప్రత్యర్ధులు చేసే విమర్శలపై, ఎప్పటికప్పుడు మానటరింగ్ చేసే వ్యవస్థ ఉండేది. మండతల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీపై వచ్చే విమర్శలపై పర్యవేక్షణ ఉండేది. టీడీ జనార్దన్, మాల్యాద్రి వంటి సీనియర్లు వాటిని పర్యవేక్షించేవారు. జిల్లాల్లో మీడియా కో ఆర్డినేటర్లకు ఎప్పడికప్పుడు సందేశాలు వె ళ్లడంతో, ఆయా నాయకులు వెంటనే స్పందించేవారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో ఆ వ్యవస్ధ పనిచేస్తున్నట్లు కనిపించలేదనడానికి.. నేతల మౌనరాగమే నిదర్శనంగా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE