-
అల్లు అర్జున్ వివాదానికి ఇక శుభం కార్డు?
-
రంగంలో దిగిన బడా నిర్మాత దిల్‌రాజు
-
నేడు సీఎం రేవంత్‌రెడ్డితో సినీ పెద్దల ముచ్చట్లు
-
రేవంత్‌కు బన్నీతో క్షమాపణ చెప్పించే యత్నం?
-
దానితో సంధ్య థియేటర్ వివాదానికి శుభం కార్డు?
-
నాగార్జున వివాదంపైనా చర్చ?
-
సంక్రాంతి సినిమాలపైనే సినీ పెద్దల ఆందోళన?
-
సంక్రాంతి బరిలో బాలకృష్ణ, చరణ్‌తేజ, వెంకటేష్ సినిమాలు
-
డాకు మహరాజ్, గేమ్‌ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్
-
వాటికి నిర్మాతలు దిల్‌రాజు, నాగవంశీ
-
అందులో సంక్రాంతికి వస్తున్నాం, గేమ్‌ఛేంజర్ సినిమాలు దిల్‌రాజువే
-
బన్నీ వల్ల తమ సినిమాలు ఆరిపోతాయని బడా నిర్మాతల బెంగ
-
పుష్ప ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదన్న రేవంత్, కోమటిరెడ్డి
-
దానితో బడా నిర్మాతల్లో కలెక్షన్ల లబ్ ‘డబ్బు’
-
అవి ఉంటేనే పెద్ద హీరో సినిమాలకు కలెక్షన్స్
-
అందుకే ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజును రంగంలోకి దింపిన పెద్దలు?
-
ఆసుపత్రికి వెళ్లి చిన్నారికి 2 కోట్లు ప్రకటించిన పుష్ప టీమ్
-
ఆ చెక్కును దిల్‌రాజుకే అందించిన అరవింద్
-
టాలీవుడ్‌లో ఫలించనున్న లాబీయింగ్ ‘పుష్ప’ం
( మార్తి సుబ్రహ్మణ్యం)
సంధ్య థియేటర్‌లో పుష్ప సినిమా షో రోజు జరిగిన దుర్ఘటన వివాదం కార్చిచ్చుగా మారి.. విమర్శలు-ప్రతి విమర్శలతో, తెలుగు సినీ పరిశ్రమకు వేడిపుట్టిస్తున్న సమయంలో సినీపెద్ద వెంకట రమణారెడ్డిగారు రంగంలోకి దిగేశారు. నేడు ఆయన నాయకత్వంలో, సినీ పెద్దలంతా సీఎం రేవంత్‌రెడ్డితో ముచ్చటించనున్నారు. అంటే వెంకట రమణారెడ్డిగారు రంగంలోకి దిగారంటే.. ఇప్పటివరకూ వివాదలతో వికసించని పుష్ప ఇకపై విరబూయటం ఖాయమేనన్నమాట. ఇంతకూ వెంకట రమణారెడ్డిగారు ఎవరో తెలుసా? అదేనండీ.. టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు అన్నమాట! తెలుసుగా సారు పలుకుబడి.. తెలుగురాష్ట్రాల్లో ఆయనకున్న సినిమా థియేటర్లు.. అవీనూ!? మరి అంతలావు పెద్దమనిషి రంగంలోకి దిగిన తర్వాత ఇక పుష్ప.. కాయా?పండా? అని అడిగితే, అంతకుమించిన స్వాతిముత్యం ఎవరూ ఉండరు. అందుకే సహజంగా.. ఇప్పుడు అందరి చూపూ, రేవంత్‌రెడ్డి-వెంకట రమణారెడ్డి భేటీ వైపే!
అనుకున్నదే అవుతోంది. సినిమా-సర్కారు మధ్య ‘అల్లు’కుంటున్న వివాదం క్రమంగా చల్లార్చే యత్నాలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా షో తర్వాత జరిగిన పరిణామాలతో, సర్కారు-సినిమా పరిశ్రమ మధ్య పెరిగిన అగాధాన్ని పూడ్చి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగేశారు.
అందులో భాగంగా నేడు సీఎం రేవంత్‌రెడ్డితో, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు (వెంకటరమణారెడ్డి) పరిశ్రమ ప్రముఖులతో కలసి భేటీ కానున్నారు. ఈ భేటీలో అల్లు అర్జున్ వివాదం ప్రధానాంశం కానుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పనిలోపనిగా అక్కినేని నాగార్జునతో వైరం అంశం కూడా పరిష్కరించాల్సిన అజెండాలో ఉంటుందన్నది బహిరంగ రహస్యమే.
ప్రధానంగా..ఇకపై కొత్త సినిమా విడుదలకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండవని సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుండబద్దలు కొట్టిన వైనం, సినీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఎందుకంటే పెద్ద హీరోల సినిమా విడుదల రోజు.. ప్రభుత్వం ఇచ్చే ఆ రెండు వెసులుబాటే, నిర్మాతలకు కోట్ల రూపాయల కలెక్షన్లు కురిపిస్తాయన్నది బహిరంగ రహస్యమే. అందుకే నిర్మాతలు పాలకుల చుట్టూ తిరిగి, ఆ వెసులుబాటు తెచ్చుకుంటారు. ఆ వెసులుబాటు లేకపోతే నిర్మాతలకు ఆశించినంత లాభం రాదు.
ఇప్పటివరకూ దాని విషయంలో నిర్మాతలకు సర్కారుతో ఎలాంటి వివాదం లేదు. గత బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు, పెద్ద సినిమాలకు ఆ వెసులుబాటు కల్పిస్తూనే ఉన్నాయి. కానీ పుష్ప సినిమా తర్వాత.. సీఎం రేవంత్‌రెడ్డి.. హీరో అర్జున్ వ్యవహారశైలిని వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకోవడంతో, బడా నిర్మాతల పరిస్థితి అయోమయంలో పడింది. దాని ప్రభావం మొత్తం సినీ పరిశ్రమలోని బడా నిర్మాతలందరిపైనా పడుతోంది.
దానికి అల్లు అర్జున్ మాత్రమే కారకుడన్న అసంతృప్తితో ఉన్న బడా నిర్మాతలు.. అగ్ర నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీ సీ చైర్మన్‌గా ఉన్న దిల్ రాజుతో భేటీ అయ్యారు. ముందు పరిశ్రమపై ఆగ్రహంతో ఉన్న సీఎం రేవంత్‌ను చల్లబరచాలని, తర్వాత పెద్ద హీరో సినిమాలకు నిలిపివేస్తామన్న వెసులుబాటును పునరుద్ధరించాలని, దిల్‌రాజుతో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా సంక్రాంతికి విడుదలయ్యే మూడు పెద్ద హీరోల సినిమాల కలెక్షన్లు ప్రభుత్వనిర్ణయంపై ఆధారపడటం, ఆ సినిమా నిర్మాతలకు ఇబ్బందికరంగా పరిణమించింది. అందులో వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’, రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలకు దిల్‌రాజునే నిర్మాత కావడం గమనార్హం.
ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహరాజ్ సినిమాకు నాగవంశీ. అయితే ఈ సినిమాకు నైజాంలో డిస్ట్రిబ్యూటర్ కూడా దిల్‌రాజునే కావడం విశేషం. అంటే ఒకరకంగా ఈ మూడు పెద్ద సినిమాలన్నీ దిల్‌రాజువేనన్నమాట. సో.. ఇప్పుడు తన సినిమాలకు బెనిఫిట్ షో, టికెట్ల ధర పెంపు వెసులుబాటు తెచ్చుకోవలసిన అవసరం అటు దిల్‌రాజుపైనా ఉంది. లేకపోతే ఆయన కూడా ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు.
దానితో రంగంలోకి దిగిన దిల్‌రాజు తొలి అడుగు.. థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన మహిళ కుమారుడు చికిత్స పొందుతున్న, కిమ్స్ ఆసుపత్రివైపు పడ్డాయి. వివాదానికి కేంద్రబిందువైన అల్లు అర్జున్‌ను మినహాయించి, ఆయన తండ్రి అల్లు అరవింద్ తో కలసి దిల్‌రాజు ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని చూశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి వాకబు చేసిన అనంతరం.. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప టీమ్ పక్షాన రెండు కోట్ల రూపాయల చెక్కును, దిల్‌రాజుకు అందిస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు.
సరిగ్గా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఒకరోజు ముందే.. దిల్‌రాజు ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రెండుకోట్లు ఇవ్వడం బట్టి, సీఎం భేటీలో ఏం జరగతోందో సులభంగా అర్ధమవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే.. బాధిత కుటుంబాన్ని, వివాదానికి కారణమయిన సినిమా యూనిట్ భారీ స్థాయిలో ఆర్ధికంగా ఆదుకుందని, సీఎంకు వివరించడమే ఈ సాయం ప్రధాన లక్ష్యమంటున్నారు.
పైగా మృతురాలి భర్త తాను పెట్టిన కేసును కూడా వాపసు తీసుకుంటున్నట్లు చెప్పినందున.. అల్లు అర్జున్‌ను పెద్ద మనసుతో క్షమించి విడిచిపెట్టాలని సినీ పెద్దలు, సీఎం రేవంత్‌రెడ్డిని అభ్యర్ధించవచ్చని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఆ సందర్భంలో అర్జున్‌తో రేవంత్‌రెడ్డికి వీడియోకాల్ ద్వారా.. క్షమాపణ చెప్పించేందుకు కూడా ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధానంగా పెద్ద హీరోల సినిమా విడుదల రోజు టికెట్ల రేటు పెంపు, బెనిఫిట్ షోల అనుమతిని పునరుద్ధరించాలని, లేకపోతే వందలకోట్లు పెట్టి సినిమాలు తీసే తాము దారుణంగా నష్టపోతామని, రేవంత్‌ను అభ్యర్ధించనున్నట్లు తెలిసింది. అసలు రేవంత్‌ను కలిసే ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటని చెబుతున్నారు.
ఇక అక్కినేని నాగార్జున వివాదం కూడా, సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు సినీ పెద్దలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున.. ఆమెపై పరువునష్టం దావా వేశారు. అది ప్రస్తుతం కోర్టులో విచారణ దశలో ఉంది.
కేటీఆర్‌కు సన్నిహితుడైనందుకే, నాగార్జున ఫంక్షన్‌హాల్‌పై ప్రభుత్వం గురిపెట్టిందన్న వ్యాఖ్యలు అప్పుడే వినిపించాయి. ఆ వివాదాన్ని కూడా సమరస్యంగా పరిష్కరించుకునేందుకు సినీ పెద్దలు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా.. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువునష్టం దావాను ఉపసంహరించుకునే ప్రతిపాదన చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు. రేవంత్‌తో భేటీకి అక్కినేని నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, అశ్వనీదత్, సునీల్ నారంగ్‌తోపాటు నిర్మాతమండలి, ఛాంబర్ ప్రతినిధులకు ఆహ్వానం అందింది. మరి ఈ భేటీకి నాగార్జున హాజరవుతారో, డుమ్మా కొడతారో చూడాలి.
ఈ నేపథ్యంలో అందరి చూపు రేవంత్‌తో పరిశ్రమ పెద్దల భేటీ వైపే ఉంది. ఒకవేళ సీఎం రేవంత్.. దిల్‌రాజు నేతృత్వంలో తరలివచ్చే పెద్దలపై క రుణచూపితే.. అల్లు అర్జున్‌పై ఉన్న కేసుల పురోగతి ఏమిటన్న ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తుంది. ఇప్పటికే ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని, పోలీసులు హైకోర్టులో సవాల్ చేస్తున్న ప్రయత్నాల మాటేమటి? అర్జున్ రెండు మూడు రోజుల్లో జైలుకు వెళతారని, ప్రభుత్వ న్యాయవాది స్వయంగా మీడియావద్ద స్పష్టం చేశారు. మరి ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి అర్జున్ బెయిల్ రద్దు చేయించే ప్రక్రియ వేగం అందుకుంటుందా? వ్యూహాత్మకంగా ఆలస్యం అవుతుందా? అన్న ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.
అదే సమయంలో ఇకపై కొత్త సినిమాల విడుదలకు బెనిఫిట్‌షోలు, రేట్ల పెంపు ఉండవని స్వయంగా సీఎం, మంత్రి స్పష్టం చేసినందున.. భేటీ నేపథ్యంలో ఆయన ఆ వైఖరికే కట్టుబడి ఉంటారా? సడలిస్తారా? అన్న చర్చకూ ఊపిరిపోసుకుంది. ఒకవేళ తాము ఈ విధానాన్ని సడలించుకుంటే, తమ వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున, కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటే, ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఉండదని మధ్యేమార్గంగా వెళతారా?
ఒకవేళ పరిశ్రమ పెద్దల ఒత్తిళ్లకు లొంగకుండా.. సీఎం రేవంత్ తన పాత వైఖరినే కొనసాగిస్తే, ప్రజల్లో ఆయన ఇమేజ్ ఆకాశమంత పెరుగుతుంది. అందుకు భిన్నంగా దిల్‌రాజు ఒత్తిళ్లకు లొంగి.. టికెట్ల పెంపు-బెనిఫిట్ షోలను పునరుద్ధరించి, అల్లు అర్జున్ వ్యవహారంపై పట్టు సడలిస్తే.. సీఎం రేవంత్‌కు ఈ ఎపిసోడ్‌లో వచ్చిన ఇమేజ్‌కు డ్యామేజీ తప్పదు. రేవంత్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.