Suryaa.co.in

Editorial

అనగనగా.. ఒక పిఠాపురం!

  • పవన్ సొంత ఇమేజ్‌తోనే గెలిచారన్న నాగబాబు

  • అది తమ వల్లే అనుకుంటే వారి కర్మ అంటూ వ్యాఖ్య

  • పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై నాగబాబు పరోక్ష విమర్శ

  • నలభైఏళ్ల టీడీపీని నిలబెట్టామన్న జనసేన దళపతి పవన్

  • అన్నదమ్ముల కామెంట్లపై శివమెత్తుతున్న టీడీపీ సోషల్‌మీడియా సైనికులు

  • వర్మ వల్లనే గెలిచానన్న పవన్ పాత వీడియోలు మళ్లీ తెరపైకి

  • ఓడిన నియోజకవర్గాల్లో మళ్లీ ఎందుకు పోటీ చేయలేదంటూ తమ్ముళ్ల ప్రశ్నల వర్షం

  • గెలిచిన ఎమ్మెల్యేలలో టీడీపీ వాళ్లు ఎంతమందంటూ మాజీ మంత్రి అంబటి ప్రశ్న

  • టీడీపీతో పోలిస్తే మనకు ఏం బలం ఉందన్న పవన్ వీడియో మళ్లీ లైవ్ లోకి

  • నాగబాబు ఒక్కడు చాలంటూ వ్యంగ్యాస్త్రాలు

  • అన్నదమ్ముల అత్యుత్సాహంపై సోషల్‌మీడియా సైనికుల ఆగ్రహం

(మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘వర్మ గారూ.. నా గెలుపు మీ చేతుల్లో, మీ అబ్బాయి చేతిలో పెట్టాం. విజయం సాధించవచ్చు. కానీ అది చిరకాలం గుర్తుండిపోవాలి’’
– ఎన్నికల ముందు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మనుద్దేశించి జనసేన దళపతి పవన్ కల్యాణ్ వ్యాఖ్య.
‘‘పిఠాపురం విజయం నా ఒక్కడి ది కాదు. అందరి విజయం. ముఖ్యంగా

వర్మగారి విజయం. వాళ్లబ్బాయి కృష్ణంరాజు గారి విజయం’’
– ఎన్నికల తర్వాత జనసేన సమావేశంలో అధినేత పవన్ కల్యాణ్.
‘‘మనకు పోల్ మేనేజ్‌మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పాతుకుపోయిన టీడీపీతో మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు మనకు ఉన్నారా? ప్రతి నియోజకవర్గంలో వెయ్యిమందికి 50 రోజులు ఎంతోకొంత డబ్బులిస్తూ, భోజనం పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? ఆ స్థాయి నాయకులు ఉన్నారా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది. వెయిట్ చేయాలి. ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలు కానివ్వం’’
– ‘‘ఎన్నికల ముందు బహిరంగసభలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.
ఇక్కడ పిఠాపురంలో పవన్ కల్యాణ్ అఖండ విజయానికి రెండు ఫ్యాక్టర్స్. ఒకటి పవన్ అయితే.. రెండు పిఠాపురం ప్రజలు, జనసైనికులు. వీళ్లందరూ లేకపోతే మేం ఎంతచేసినా, ఏం చేసినా ఉపయోగం లేదు. సో..ఇంకైవరైనా సరే, పవన్ విజయానికి నేనే దోహదపడ్డా అనుకుంటే అది వారి ఖర్మ’’.
– తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు
‘‘మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం. కాకపోతే మనం నిలబడటానికి గాజువాక, బీమవరాలు వదిలేసి పిఠాపురం రావల్సివచ్చింది. పార్టీని

నిలబెట్టడానికి నలభైఏళ్ల టీడీపీ తోడు కావలసి వచ్చింది’’
– నాగబాబు కామెంట్ల తర్వాత సోషల్‌మీడియాలో వెల్లువెత్తిన తమ్ముళ్ల ఆగ్రహజ్వాల.
‘‘ వందశాతం స్ట్రైక్ రేట్ అంటున్నారు. అసలు అందులో మీపార్టీ వాళ్లు ఎంతమంది పోటీ చేశారు. టీడీపీ నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్లు ఎంతమంది?’’
– మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు
-ఇదీ పిఠాపురం జనసేన జయకేతనం సభ అనంతరం సోషల్‌మీడియాలో కేంద్రంగా జరుగుతున్న హాట్ టాపిక్.
* * *
విజయం వినయం,విధేయత నేర్పాలి. గర్వానికి దారితీయకూడదు. విజయం అసాధ్యమైనా సాధించవచ్చు. కానీ దానిని నిలబెట్టుకోవడమే విజ్ఞుల లక్షణం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. ఇవన్నీ తమ జీవితాల్లో విజయం సాధించిన వారు చెప్పే హితోక్తులు. అందుకు భిన్నంగా.. అంతా మా వల్లే.. అంతా మేమే అనుకుంటే వారికి పతనం తప్పదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మరిప్పుడు సున్నా నుంచి వంద శాతం స్రైట్ రేట్ సాధించిన జనసేన బ్రదర్స్ శైలి, అందుకు అనుగుణంగా ఉందా? భిన్నంగా ఉందా? వారు గత పరాజయాలు మరిచి మాట్లాడుతున్నారా? లేక ఏదైనా వ్యూహంతో మాట్లాడైతున్నారా? ఓసారి చూద్దాం!

గత ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఆ పార్టీ దళపతి పవన్ స్వయంగా పోటీ చేసిన భీమవరం, గాజువాకలో ఘోరంగా ఓడిపోయారు. అన్నయ్య నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంత జగన్ గాలిలో కూడా ‘విజయే తనం’ ఎగరవేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, కొన్నాళ్ల తర్వాత జనసేనకు ఝలక్ ఇచ్చి, వైసీపీ జెండా ఎగరవేశారు. ఇదీ జన సేన గత ఎన్నికల ప్రస్థాన ం.

సీన్ కట్ చేస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు, ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన పవన్.. ప్రతిపక్షాల ఓట్లు చీలకూలడదన్న లక్ష్యంతో, తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఎన్నికల్లో 21 సీట్లు తీసుకున్న జనసేన, 21 స్థానాల్లోనూ ‘విజయకేతనం’ ఎగరవేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన కోటా నుంచి పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి లభించగా, ఆ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు మంత్రి పదవులు లభించాయి.

రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా.. ఆరోవేలుగా భావించే డిప్యూటీ సీఎం హోదాకు, సీఎం చంద్రబాబు అపురూప గౌరవం ఇచ్చారు. అంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోతోపాటు, డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు పెట్టేలా ఆదేశాలిచ్చారు. గత కూటమి సర్కారులో నిమ్మకాయల చిన రాజప్ప, కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవులిచ్చినా, వారికి ఆ గౌరవం ఇవ్వలేదు. బాబు తర్వాత ఆ స్థాయి భద్రత ఇవ్వలేదు. జగన్ జమానాలో ఐదుగురు డిప్యూటీ సీఎంలున్నా, ఎవరికీ కనీస గుర్తింపు లేని దుస్థితి.

కానీ అలాంటి గౌరవం ఒక్క పవన్‌కు మాత్రమే దక్కింది. నిజానికి ఉప ముఖ్యమంత్రులకు ప్రత్యేక హోదా, అధికారాలు ఏమీ ఉండవు. వారు కూడా మంత్రులలో ఒకరు. కానీ అందుకు భిన్నంగా పవన్‌కు, బాబు ప్రత్యేక హోదా ఇచ్చారు.సహజంగా డిప్యూటీ సీఎంలు అయినప్పటికీ వారిని ఏదో ఒక జిల్లాకు ఇన్చార్జిగా నియమిస్తారు. కానీ పవన్‌తోపాటు, లోకేష్‌కు మాత్రం అందుకు మినహాయింపు ఇచ్చారు. అంటే ‘వారిద్దరూ ప్రత్యేకం’ అన్న సంకేతం పంపారన్నమాట! పవన్ కోరిక మేరకు ఆయన అన్నయ్య నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి ఆ గౌరవం జనసేన నిలబెట్టుకుంటోందా? అదే ఇప్పుడు కూటమిలో చర్చ.

మరో దశాబ్దిన్నరపాటు కూటమిలోనే ఉంటామన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకూ ఎలాంటి ఇబ్బంది లేకున్నా, కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు కూటమికి చేటు తెస్తారా? అన్న అనుమానం పిఠాపురంలో ఆయన ప్రసంగం విన్న మెడ మీద తల ఉన్న ఎవరికయినా రాక తప్పదు. పిఠాపురం విజయం పవన్ ఒక్కడిదే. అందులో ఎవరి ప్రమేయంలేదన్న నాగబాబు వ్యాఖ్యలు.. మనం నిలబడ్డాం. 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టామన్న పవన్ వ్యాఖ్యలు జనసైనికుల కంటే.. వైసీపేయేయులను బహు ఆనందపరిచి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వైసీపీ ఇలాంటి కామెంట్ల కోసమే కాచుకుకూర్చుంది. కూటమి విచ్ఛిన్నం కావాలన్నదే దాని సహజమైన కోరిక. అది కాగల కార్యం తీర్చే నాగబాబు గంధర్వుడి రూపంలో తీరుతున్నందున, వారికి అంతకంటే ఆనందం ఏముంటుంది?

ఇక పిఠాపురంలో పవన్ విజయానికి తామే కారణమనుకుంటే అది వారి ఖర్మ అన్న నాగబాబు.. మనం నిలబడ్డాం. 40ఏళ్ల టీడీపీని నిలబెట్టామన్న పవన్ మాటల్లో నిజమెంత అన్నదానిపై ఇప్పుడు సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చలోకి వెళదాం.

పిఠాపురం సభలో నాగబాబు, పవన్ వ్యాఖ్యల తర్వాత టీడీపీ సోషల్‌మీడియా సైనికుల పోస్టులో ఇది ఒకటి.
‘‘ తెలుగుదేశం ని మీరు నిలబెట్టడం ఏమిటి? రావణుడు లాంటి దుష్టుడిని మట్టుపెట్టడానికి రామ – సుగ్రీవులు కలిశారు. మేము లేకపోతే సీతారాములు కలిసేవారు కాదు అనుకుంటే పొరపాటే. బాబుగారు ఒదిగి వున్నారు కదా అని అంతా మేము చేసాము అని అనకండి. మీకు కృతజ్ఞత ఉంటే మీ కోసం సీటు త్యాగం చేసిన వర్మ గారికి MLC వచ్చేలా చేసేవారు. మిడిసిపడే దీపం ఎక్కువసేపువెలగదు

History

గాజువాక

2019 లో పవన్ కళ్యాణ్, జనసైనికుల ఫ్యాక్టర్స్‌తో జనసేనకు వచ్చిన ఓట్లు 58,539. 2019లో పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చిన ఓట్లు 56,642. వైసీపీకి వచ్చిన ఓట్లు 75,292. వైసీపీ మెజారిటీ 16,753…

2024లో..
టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస రావు గారికి వచ్చిన ఓట్లు 1,57,703. వైసీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 62,468. ఒకవేళ జనసేన లేకుండా టీడీపీ వెళ్తే 1,57,703-58,539= 99,164 (టీడీపీకి పడే ఓట్లు 2019 లెక్క ప్రకారం) టీడీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 95,235. అందులో 58,539 (జనసేన షేర్ తీసేస్తే) తక్కువలో తక్కువ 35 వేలు టీడీపీకి మెజారిటీ వచ్చేది.

పిఠాపురం

2019లో.. జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 28,011. టీడీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 68,467. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 83,459.
2024లో…జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 134,394. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 64,115.
ఒకవేళ.. ఫర్ ఎగ్జాంపుల్… టీడీపీ ఇక్కడ మద్దతు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంటే…1,34,394-68,467=65,927 (జనసేనకు పడే ఓట్లు ) జనసేన అభ్యర్ధికి వచ్చే మెజారిటీ 10 వేలు లోపే… (19,24కి పోలింగ్ శాతం ఎక్కువ కాబట్టి)
(పోలింగ్ శాతం పెరిగింది అప్పటికి ఇప్పటికి… అందులో అన్ని పార్టీల ఓట్లు ఉంటాయి. జరిగినవి కొంత ఎక్కువ… అటు ఇటుగా ఈ లెక్కలు రాసా…)

ఫ్యాక్టర్స్ మాట్లాడే ముందు ఫ్యాక్ట్ తెలుసుకో.
* * *
మనం నిలబడ్డాం
పార్టీని నిలబెట్టాం

కాకపోతే మనం నిలబడడానికి
గాజువాక , భీమవరాలు వదిలేసి
పిఠాపురం రావాల్సి వచ్చింది

పార్టీని నిలబెట్టడానికి నలభై ఏళ్ళ
తెలుగు దేశం తోడు కావాల్సి వచ్చింది
* * *
– ఇవీ.. జనసేన బ్రదర్స్ వ్యాఖ్యల తర్వాత, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు సంధిస్తున్న పోస్టులు.
ఇక పిఠాపురంలో పవన్ విజయానికి తామే కారణమనుకుంటే అది వారి ఖర్మ అన్న నాగబాబు.. మనం నిలబడ్డాం. 40ఏళ్ల టీడీపీని నిలబెట్టామన్న పవన్ మాటల్లో నిజమెంత అన్నదానిపై ఇప్పుడు సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చలోకి వెళదాం.
పిఠాపురం సభలో నాగబాబు, పవన్ వ్యాఖ్యల తర్వాత టీడీపీ సోషల్‌మీడియా సైనికుల పోస్టులో ఇది ఒకటి.

నిజానికి పిఠాపురంలో పవన్ కోసం తన సీటు త్యాగం చేసి, ఆయన విజయంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే వర్మకు స్వయంగా పవన్ చొరవ తీసుకుని, ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబుకు సిఫార్సు చే స్తారని చాలామంది భావించారు. ఎందుకంటే ఇండిపెండెంట్‌గా గెలిచిన సత్తా ఉన్న నాయకుడు వర్మ కాబట్టి! కానీ అందుకు భిన్నంగా, పవన్ తన సోదరుడు నాగబాబు పేరు సిఫార్సు చేయడం వారిని ఆశ్చర్యపరిచింది. జనంలో నుంచి నాయకుడురావాలన్న పవన్.. తన అన్నను దొడ్డిదారిన ఎలా తీసుకువచ్చారన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్న పవన్ చిత్తశుద్ధిని ప్రశ్నించేదే.

కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా, ఇప్పటివరకూ వర్మకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడం, సహజంగానే టీడీపీ సైనికులను అసంతృప్తి పరుస్తోంది. పవన్‌కు పోటీ అవుతారన్న కారణంగా, పవన్ ఒత్తిడి వల్ల వర్మకు ఎలాంటి పదవి ఇవ్వడం లేదన్న బలమైన అభిప్రాయం టీ డీపీ సైనికుల్లో లేకపోలేదు. అంటే కేవలం పవన్ ఒత్తిళ్ల మేరకే వర్మకు అన్యాయం చేస్తున్నారన్న భావన-సానుభూతి ఉందన్నమాట. ఇప్పుడు తన తమ్ముడి విజయంలో వర్మ పాత్రేమీలేదని నాగబాబు కుండబద్దలు కొట్టిన తర్వాత.. వర్మను అంతా కలసి బలిపశువును చేశారన్న సానుభూతి, రెండింతలయిందన్నది మనం మనుషులం అన్నంత నిజం.

ఇక నలభై ఏళ్ల టీడీపీని నిలబెట్టామన్న పవన్ వ్యాఖ్యల్లో నిజమెంత అన్న చర్చకూ తెరలేచింది. జగన్ ఐదేళ్ల జమానాలో అన్ని వర్గాలు విసిరివేసారి పోయాయి. చంద్రబాబు అరెస్టు దేశదేశాల్లోని తెలుగువారిని కదిలించి, రోడ్డుపైకి తెచ్చింది. అంతకంటే ముందు.. జగన్‌పై తొడగొట్టి నాలుగేళ్లపాటు అలుపెరుగని యుద్ధం చే సిన ఒంటరి సేనాని రఘురామకృష్ణంరాజు ఒక్కరే. అసలు ఆయన పోరాటంతోనే వైసీపీ పతనం ప్రారంభమైందన్నది నిష్ఠుర నిజం. ప్రతిరోజూ సోషల్‌మీడియా వేదికగా.. కేంద్రానికి జగన్ సర్కారుపై ఫిర్యాదులు చేసి, లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న రఘురామకృష్ణంరాజు చేసిన పోరాటంతో పోలిస్తే, పవన్ ప్రతిఘటన చాలా చిన్నది.

జగన్‌తో ఐదేళ్లు న్యాయపోరాటం చేసి, నేరుగా ఒక సీఎంను సైకో అని విమర్శించిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పోరాటంతో పోల్చుకుంటే, పవన్ పోరాటం తక్కువే. జగన్ సర్కారు తమపై కేసులు పెడుతుందని తెలిసినా వెరవకుండా, నాటి సర్కారుపై సోషల్‌మీడియా వేది గా యుద్ధం చేసిన పసుపు సైనికుల పోరాటంతో పోలిస్తే, పవన్ చేసిన పోరాటం తక్కువే. కాకపోతే.. పవన్ సెలబ్రిటీ. సినిమా స్టార్, ఆయనకు ఉచిత ప్రచారం వస్తుంది. మిగిలిన వారికి రాదు. అంతే తేడా!

జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో వచ్చిందంటే.. శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి ఉనికి లేని ఎచ్చర్ల అనే బీసీలున్న నియోకజవర్గంలో కమ్మ వర్గానికి చెందిన బీజేపీ పార్టీ అభ్యర్దిని నిలబెడితే, అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు. ఇక రాయలసీమలో పెద్దగా కనిపించని బీజేపీ సునాయాసంగా గెలిచింది. ఒక్క ధర్మవరంలోనే పోటాపోటీగా కలబడి నిలబడింది. అసలు కూటమి అభ్యర్దులంతా 25 వేల నుంచి 95 వేల మెజారిటీతో మీసం మెలేశారంటే.. అది జగన్‌పై వ్యతిరేకత తప్ప, కూటమి గొప్పతనం కాదన్నది సుస్పష్టం. దాన్ని అర్ధం చేసుకోకుండా అంతా తమ గొప్పతనమే అనుకోవడమే వింత. అంటే దీన్నిబట్టి గత ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా సునాయాసంగా గెలిచేవారన్నది జనసేన అర్ధం చేసుకోకుండా, అంతా తమ గొప్పతనమే అనుకోవడమే ఆశ్చర్యమన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య.

నాగబాబు వ్యాఖ్యల తదనంతర పరిణామాలపై టీడీపీ నాయకత్వం గుంభనంగా ఉంది. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోణంలో, పవన్‌ను దూరం చేసుకోకూడదన్నది.. పార్టీ నాయకత్వం ఆలోచన ఆ మౌనానికి కారణం కావచ్చు. కానీ రాజకీయంగా లాభనష్టాలతో పనిలేకుండా, నిస్వార్ధంగా క్షేత్రస్థాయిలో పనిచేసే పార్టీ క్యాడర్ మాత్రం.. నాయకత్వ లాభనష్టాలతో సంబంధం లేకుండా స్పందిస్తుంది. రేపు శాసనమండలిలో కూడా నాగబాబు ఇలాగే మాట్లాడినా ఇంతే మౌనంగా ఉంటారా? అన్నది పసుపు సైనికుల ప్రశ్న. మొత్తంగా నాగబాబు వ్యాఖ్యలను భవిష్యత్తు రాజకీయ కోణంలో దర్శించి, ఇప్పటికయినా వర్మకు న్యాయం చేయడమే నైతికధర్మమన్నది పసుపు సైనికుల మనోభావం. మరి పవన్‌కు పోటీ ఎందుకని మౌనంగా ఉంటుందా? లేక జెండా మోసిన నేతకు పదవి ఇచ్చి పార్టీని బతికించుకుంటుందా?

అంబటి రాంబాబు కామెంట్స్:

  • 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్నావ్.. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు నీ వాళ్లు కాదు పవన్ కళ్యాణ్
  • టీడీపీలో టికెట్ రాక, మేము రిజక్ట్ చేసిన వాళ్లు నీ పార్టీలోకి వచ్చి గాలి వీయడంతో గెలిచేశారు
  • జనసేన, టీడీపీ వేరు కాదు.. రెండు పార్టీలకు బాస్ చంద్రబాబే

LEAVE A RESPONSE