– 40 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం సాధించిందేమీ లేదు
– వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు బీఆర్ఎస్ వ్యతిరేకం
– మైనారిటీల పక్షాన కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే
– లక్షా 50 వేల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి…షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇవ్వలేదు
– బాన్సువాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
– ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
బాన్సువాడ : రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గత 15 నెలల్లో 40 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సాధించుకొచ్చింది ఏమీ లేదని, రాష్ట్రంలో పాలన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోందా లేదా ఢిల్లీ కేంద్రంగా నడుస్తోందా అని నిలదీశారు. ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకోవాలని అన్నారు.
రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా బాన్సువాడలోని జామా మసీద్ లో ఏర్పాటు చేసిన దావత్ – ఏ – ఇఫ్తార్ లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , బాన్సువాడ వైస్ చైర్మన్ జుబైర్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినవక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, మైనారిటీల వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా కొట్లాడడానికి బీఆర్‌ఎస్ పార్టీ ముందుంటుందని తేల్చిచెప్పారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నెలకు ఒకటి చొప్పున మత ఘర్షణలు చోటు చేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు ఈ ఘటనలపై సమీక్షించడం లేదని, జైనూర్ లో మూడు నెలలు ఇంటర్నెట్ బంద్ పెట్టారని, అక్కడ హిందూముస్లింల ఇండ్లను దహనం చేసినా ముఖ్యమంత్రికి వాటిపై సమీక్షించేంత తీరిక లేదని విమర్శించారు.
బాధితులకు కనీసం పరిహారం ఇవ్వలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఎండగట్టారు. “తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికి మంచి చేయాలనే సంకల్పంతో కేసీఆర్ పని చేశారు. ఆ సోయి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు. ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ పెట్టడం దారుణం. మైనార్టీల కోసం పెట్టిన బడ్జెట్ లో 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదు. ముస్లిం యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు అని వ్యాఖ్యానించారు.
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈద్ ముబారక్ చెప్పేందుకు వస్తారని, మైనార్టీల బడ్జెట్ ఎందుకు ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని ఆయనను ప్రశ్నించండని పిలుపునిచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ప్రభుత్వానికి అడ్వైజర్ అయ్యారని, ఆయన ఏం సలహాలు ఇస్తున్నారో ప్రశ్నించాలని అన్నారు. మైనార్టీ గురుకులాలు కేసీఆర్ హయాంలో ఎలా ఉన్నాయి.. ఎప్పుడు ఎలా ఉన్నాయో పోచారం శ్రీనివాస్ రెడ్డి ని ప్రశ్నించాలని అని చెప్పారు. బాన్సువాడకు సాగునీళ్లు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కానీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాగా, ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కూడా విడుదల చేయడం లేదని, కొన్ని రోజుల్లోనే విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని, ప్రభుత్వం వెంటనే ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా ఫీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ లకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎండగట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రూ.1,800 కోట్లు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదట ఆ బకాయిలు క్లియర్ చేసి విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారని, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థులకు బకాయిలు ఇప్పించాలని సూచించారు.
కేసీఆర్ షాదీ ముబారక్ కింద రూ.లక్ష మాత్రమే ఇస్తున్నారు… కాంగ్రెస్ ను గెలిపిస్తే రూ.1.60 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, మరి 15 నెలల్లో ఏ ఒక్కరికైనా రూ.1.60 లక్షలతో పాటు తులం బంగారం ఇచ్చారా? అని అడిగారు 15 నెలల్లో లక్షా 50 వేల కోట్లు అప్పులు చేసినా తులం బంగారం ఇవ్వలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నవారు బాజిరెడ్డి గోవర్ధన్, బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ నాయకులు మొచ్చి గణేష్, సాయిబాబా, ఎజాజ్, రజాక్, సంపత్ గౌడ్, అయోషా ఫాతిమా, చాకలి సాయిలు, శివ సూరి , ఎండి ఆపోర్జ్ తదితరులు పాల్గొన్నారు