(చాకిరేవు)
ప్రపంచ జనాభా దినోత్సవం 2025: “అయ్యో, బాగా పెరిగిపోయారు!” నుండి “అబ్బో, ఇంకొంచెం పెరగాలి!” – కథ మరింత రసవత్తరంగా.. బుగ్గలను ఎరుపెక్కిస్తోంది!
జనాభాపై ప్రపంచ దేశాల ఆలోచనలు “తల్లకిందులైపోయాయి”. ఈ 2025 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ “యువత తమకిష్టమైన కుటుంబ జీవితాన్ని గడిపేందుకు అనుకూలమైన, ఆశతో కూడిన ప్రపంచాన్ని అందించడం” అని చాలా చక్కగా ఉంది.
కానీ నిజం చెప్పాలంటే, తెరవెనుక కొన్ని దేశాలు యువ జంటలపైకి డబ్బును విసురుతూ, “అబ్బో, దయచేసి మీ కుటుంబాలను ఇంకొంచెం పెద్దవి చేయండి! మీ ఖర్చులు కూడా మేమే చూసుకుంటాం!” అని బతిమాలుకుంటున్నాయి!
హంగేరీలో, నలుగురు పిల్లలున్న తల్లులకు “జీవితకాల ఆదాయపు పన్ను మినహాయింపు, సబ్సిడీ గృహ రుణాలు, కారు సబ్సిడీలు, సుదీర్ఘ సెలవులు” వంటి భారీ ప్రోత్సాహకాలతో పెద్ద కుటుంబాలను ప్రోత్సహిస్తూ జననాల రేటును పెంచేందుకు కృషి చేస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని 1985లో మొదటిసారిగా ప్రకటించినప్పటి నుండి ప్రపంచ అవగాహన ఎంతగా మారిపోయిందో చూస్తే నవ్వొస్తుంది, ఆశ్చర్యపోతాం! 1985 గుర్తుందా? ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకోగానే, జడుసుకుపోయి కంగారుపడ్డారు. అప్పట్లో, జనాభా ఎక్కువగా ఉన్న “చైనా, భారతదేశం” వంటి దేశాలను ఎగతాళి చేసేవారు.
“ఓహ్, వాళ్ళని చూడండి, ఇంకా కుందేళ్ళలా పిల్లల్ని కంటున్నారు! కుటుంబ నియంత్రణ గురించి వాళ్ళకి తెలీదా?” అని విదేశీ మీడియాలో అచ్చేసేవారు. నిజమే, అప్పుడు మనం అందరం ‘సంతానం’ లాంటి సినిమాలు తీసి ఎక్కువ సంతానం ఉంటే ఎలా కష్టాలు వస్తాయో చెప్పాం. కుటుంబ నియంత్రణ కామెడీలు సినిమాల్లో చూశాం. పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి, టార్గెట్లు పెట్టి కు.ని. ఆపరేషన్లు చేయించేవారు. “తగ్గించాం” అని మనల్ని మనం గొప్పగా చెప్పుకున్నాం.
కానీ కాలం మారింది! ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు జనాభా లేక కుంగిపోతున్నాయి. జనాభా ఎక్కువ ఉన్న చైనా నుండి మనదేశం వరకు (ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించింది) మిగతా దేశాలన్నీ పరుగు పెడుతున్నాయి! 2025 నాటికి ప్రపంచ జనాభా 823 కోట్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరిప్పుడు ఆ “అధిక జనాభా” దేశాలు ప్రపంచంలో పెద్ద మనుషుల్లా తయారవుతున్నాయి!
మిగిలిన వారంతా ఇప్పుడు అడ్డగోలుగా పరుగు పెడుతున్నారు, ఎందుకంటే జనాభానే నిజంగా, చెప్పాలంటే, ఆస్తులు అని తెలిసింది! ఎవరికి తెలుసు? కేవలం మంచి ఆలోచనలు, ఖాళీ ఊయలలతో ఆర్థిక వ్యవస్థను నడపలేమని తేలింది. మనం “జనాభా నియంత్రణ” నుండి “జనాభా నిర్వహణ”కు, కొన్ని సందర్భాలలో ఏకంగా “జనాభా ప్రోత్సాహం” వైపుకు మారుతున్నాం.
పిల్లలుంటే ఆర్థిక చిక్కులు ఎక్కువ, బహుశా చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఉండొచ్చు. నిజం చెప్పాలంటే, పిల్లలను సర్జరీ లేకుండా కనలేని, అదీ ఖరీదైన, ఆశపోతుల ఆరోగ్య వ్యవస్థలో వున్నాం. ముందు అక్కడి నుండి మార్పులు మొదలవ్వాలి. సర్జరీలు లేకుండా ప్రసవం చేసే ఆసుపత్రులను ప్రోత్సహిస్తూ.. ప్రశంసిస్తే.. మీడియాలో తెలిస్తే.. వాటికే ప్రజలు వెళతారు.
“నిజానికి, మనకు ఇంకా కావాలి! మన సంతానోత్పత్తి రేటు కేవలం 1.5 మాత్రమే!” అని నాయుడు అంటున్నారు. ష్… గప్‌చుప్‌గా ఉండండి అని చెప్పిన పిల్లలకే, “అల్లరి చేయండి!” అని చాక్లెట్లు ఇచ్చినట్లుగా ఉందిది! దార్శనికుడు చంద్రబాబు, జనాభా పెరుగుదలకు అనుకూలమైన విధానాలను బలంగా సమర్థిస్తున్నారు.
తన గత వైఖరి అప్పటి కాలానికి చెందినదని బహిరంగంగా అంగీకరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో “జనాభా సంక్షోభాన్ని” ప్రస్తావిస్తూ, మన రాష్ట్రంలో ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని కోరుతున్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇప్పటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇవ్వడంతో పాటు, స్థానిక ఎన్నికల్లో ఇద్దరికి పైగా అనర్హత నిబంధనను కూడా రద్దు చేశారు. మహిళా ఉద్యోగిణులకు ప్రసూతి సెలవులు ఇద్దరు పిల్లలకే అనే నిబంధనను కూడా తీసేశారు.
అంతేకాదు, కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని చూస్తున్నారు, పెద్ద కుటుంబాలకు ఎక్కువ ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది! పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్నవారికి ఆశలు చూపిస్తూ, పిల్లల సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేలా ఉన్నారు.
పిల్లలు లేకపోవడానికి చెప్పే సాకులు ఇంకా నవ్వు తెప్పిస్తాయి: “ఖర్చు చాలా ఎక్కువ!”, “సరైన ఆదాయం లేదు!” గట్రా కంటే “పెళ్లి చేసుకోడానికి అమ్మాయి దొరకడం లేదు” అనే జోకులు, “మీరు మాత్రం ఒక్కరినే కన్నారు” అనే దెప్పిపొడుపులు ఉన్నా… జనాభా పెరుగుదల కోసం “మంచి విధానాలను” రూపొందించడానికి చంద్రబాబు కష్టపడుతున్నారు. భారతదేశ జనాభా లెక్కలు కూడా 2027 నాటి నుండి మొదలెడుతున్నారు.
ఈసారి స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా కుల గణనను కూడా దేసంలో చేర్చుతున్నారు. ఈ మారుతున్న జనాభా వివరాలను అర్థం చేసుకోవడానికి మరియు ప్రోత్సాహకాలను మరింత ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవడానికి ఇదొక కీలకమైన సాధనం.
కాలం ఒక రోలర్‌కోస్టర్! జనాభా గడియారం 823 కోట్లను దాటుతున్నప్పుడు మనం దీన్ని పండుగ చేసుకోవాలా లేక భయపడాలా అని అర్థం కాని స్థితిలో ఉన్నాం.
బహుశా వచ్చే సంవత్సరం, “బేబీ బోనస్‌ల” గురించి, ప్రభుత్వ సబ్సిడీల పుణ్యమా అని, “ఎవరు ఎక్కువ మంది పిల్లలను కనగలరు?” లాంటి చర్చలు రచ్చబండ్ల దగ్గర మొదలవ్వవచ్చు!