– రజాకార్లు, నిజాం వారసుల ముందు తల వంచినవారికే అవి సొంతం
– తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు వేసే వారు, చరిత్ర ముందు లొంగాల్సిందే…
– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఘాటు విమర్శ
హైదరాబాద్: ఓట్ల కోసం ఫోటోల్లో గీతలు గీసి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారిని తెలుగు ప్రజలు ఎప్పటికీ జ్ఞాపకంలో ఉంచుకుంటారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య బంధాన్ని చీల్చే ప్రయత్నాలు వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం మాత్రమేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఘాటుగా విమర్శించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుని మాధవ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. భారతీయ సాంస్కృతిక వైభవానికి సంబంధించిన చిత్రాన్ని బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను ఒక జాతీయవాదిని. ఒక గర్వపడే తెలుగు వాడిని. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష, సంస్కృతి, గౌరవం కోసం శాసన మండలిలో శాసనాల్లో చురుకుగా పని చేసినవాడిని. తెలంగాణ పట్ల, ఆ గొప్ప సంస్కృతి పట్ల నాకు ఉన్న ప్రేమ, గౌరవం రాజకీయవిమర్శలకు అతీతం. రజాకార్లను పొగిడే, నిజాం వారసుల ముందు తల వంచినవారికి, తెలంగాణ ప్రజల హృదయాలలో ప్రతిఫలించే సంస్కృతి, జాతీయత, సమానత్వం అనే విలువలు ఎప్పటికీ అర్థం కావని గట్టిగా అన్నారు. నాకు సోదర తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు, మార్చలేరు అని పేర్కొన్నారు.