Ayodhya, Jan 22 (ANI): Prime Minister Narendra Modi in conversation with Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat during the 'Pran Pratishtha' ceremony of the Ram Janmabhoomi Temple, in Ayodhya on Monday. (ANI Photo)
(నవీన్)
బిజెపిలో 75 ఏళ్ళ కే రిటైర్మెంట్” తేనెతుట్టెను తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కదలించారు.
“ఒక వ్యక్తికి 75 ఏళ్లు నిండినప్పుడు శాలువాతో సత్కరిస్తే, దాని అర్థం ‘మీరు వృద్ధులయ్యారు, ఇప్పుడు పక్కకు తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వండి’ అని (ఆర్ ఎస్ ఎస్ పాతతరం నాయకుడు) మోరోపంత్ పింగ్లే అనేవారు.” ఈ మాటలు నాగ్ పూర్ లో ఒక పుస్తకావిష్కరణ సభలో భగవత్ ప్రస్తావించారు.
అంతే… పార్టీలో, ప్రతిపక్షాల్లో రాజకీయ వర్గాల్లో ప్రధాని 2025 సెప్టెంబర్లో 75 ఏళ్లు నిండనున్న నరేంద్ర మోదీకి ఈ నియమాన్ని వర్తింప చేస్తారా? లేదా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
బీజేపీలో “75 ఏళ్ల వయసు నిబంధన” గత కొన్నేళ్లుగా చర్చకు వస్తున్న అంశమే! 75 ఏళ్ళకు రిటైర్ అవ్వాలన్న నియమం ఇది బీజేపీ పార్టీ నియమావళి (పార్టీ కాస్టిట్యూషన్) లో అధికారికంగా పొందుపరిచినది కాదు.
2014లో నరేంద్ర మోదీ, అమిత్ షా అధికారంలోకి వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, పార్టీలో సీనియర్ నాయకులకు గౌరవప్రదమైన (రిటైర్మెంట్) ఇచ్చేందుకు ఒక అనధికారిక మార్గదర్శకంగా దీనిని అమలులోకి తెచ్చారు. 75 ఏళ్లు దాటిన నాయకులను ఎన్నికల రాజకీయాల నుండి, ప్రభుత్వ పదవుల నుండి తప్పించి, వారికి “మార్గదర్శక్ మండల్” వంటి సలహా కమిటీలలో స్థానం కల్పించారు.
ఈ నిబంధన ప్రకారమే బీజేపీ కురువృద్ధులైన ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా వంటి అనేక మంది సీనియర్ నాయకులను క్రియాశీల రాజకీయాల నుండి పక్కన పెట్టారు. ఇది పార్టీలో కొత్త తరానికి అవకాశం కల్పించేందుకూ, నాయకత్వ మార్పును సులభతరం చేసేందుకూ ఉద్దేశించిన వ్యూహంగా భావించారు.
2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో, ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నాయకులు ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. “మోదీ గెలిస్తే, 2025లో 75 ఏళ్లు నిండిన తర్వాత ఆయన రిటైర్ అయి, అమిత్ షాను ప్రధానిని చేస్తారు” అని వారు ప్రచారం చేశారు. ఇది బీజేపీ ఓటర్లలో గందరగోళం సృష్టించే ప్రయత్నమని బీజేపీ నాయకులు కొట్టిపారేశారు.
ఈ ప్రచారంపై హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా వంటి అగ్ర నాయకులు స్పష్టత ఇచ్చారు. వారి వివరణ ప్రకారం బీజేపీ లో అలాంటి నిబంధన ఏదీ లేదు. ఇది కేవలం ఒక అవగాహన మాత్రమే. ఇది ప్రధాని మోదీకి వర్తించదని, ఆయన తన పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని (2029 వరకు) కొనసాగిస్తారని, ఆ తర్వాత కూడా దేశానికి నాయకత్వం వహిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రతిపక్షాలు సృష్టిస్తున్న అపోహ మాత్రమేనని, బీజేపీలో నాయకత్వంపై ఎలాంటి సందిగ్ధత లేదని వారు పేర్కొన్నారు.
ఇపుడు భగవత్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో, ఆర్ఎస్ఎస్ వర్గాలు స్పందించి, ఆ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, కేవలం పింగ్లే గారి వ్యక్తిత్వాన్ని వివరిస్తున్నప్పుడు చేసిన సాధారణ వ్యాఖ్యలని వివరణ ఇచ్చాయి.
మోదీయే ఇపుడు బిజెపి ముఖచిత్రం .ఆయన చరిష్మా, ప్రజాదరణే పార్టీకి అతిపెద్ద బలం. ముఖ్యంగా, బీజేపీకి సొంత మెజారిటీ రాని ఈ సంకీర్ణ ప్రభుత్వంలో, మోదీ నాయకత్వం మరింత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను పక్కనపెట్టే సాహసం పార్టీ చేయకపోవచ్చు. ఈ “నియమం” పార్టీలో అంతర్గత పోటీని తగ్గించి, నాయకత్వాన్ని సుస్థిరం చేయడానికి గతంలో ఉపయోగపడింది. అయితే, ఆ నియమాన్ని దాని రూపకర్తకే వర్తింపజేయడం రాజకీయంగా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు.
(రచయిత సీనియర్ పాత్రికేయులు)