– ఎన్ ఎంసి నియమాల అమలుకు ఈ మేరకు నిర్ణయం
– కాంట్రాక్టు ప్రొఫెసర్ల నియామకాన్ని వాయిదా వేయాలి
– మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి: జాతీయ వైద్య సంఘం(ఎన్ ఎంసి) నియమాల మేరకు కొత్త, పాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసే నిమిత్తం అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించడానికి కనీస అర్హతల్లో మినహాయింపు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సర్వీసు నియమాల ప్రకారం మూడేళ్ళ బోధానానుభవం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా ప్రమోట్ చేస్తారని, ఆయితే… ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల కొరత ఉంది. 2025-26 సంవత్సరానికి వైద్య విద్య ప్రవేశాలకు ఎన్ ఎంసి అనుమతి పొందడానికి ఈ కొరతను పూరించాల్సి ఉంటుంది. ఇందునిమిత్తం…ఒక సంవత్సరం బోధనానుభవం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఈ సడలింపు ఈ ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ నిబంధన సడలింపు నేపథ్యంలో… కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రొఫెసర్ల నియామకం చేపట్టాలన్న గత ప్రతిపాదనను వాయిదా వేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. అర్హత నిబంధన సడలింపు మేరకు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించిన అనంతరం అవసరాల మేరకు కాంట్రాక్టు ప్రొఫెసర్ల నియామకాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు.
విజయనగరం, పాడేరు, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు కొన్ని పాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కూడా ప్రొఫెసర్ల కొరత ఉంది. ఈలోటును పూర్తిచేసేందుకు నిబంధనల్లో సడలింపుతో పదోన్నతులు జరుగనున్నాయని తెలిపారు. కాగా, అసోసియేట్ ప్రొఫెసర్ల లోటును భర్తీ చేయడానికి సర్వీసు నియమాల మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అవసరాల మేరకు పదోన్నతి కల్పించనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరతను పూరించడానికి గతంలో చేపట్టిన వాకిన్ రిక్రూట్మెంట్ ప్రక్రియను కొనసాగనించనున్నారు.