– ప్రస్తుత పరిస్థితుల్లో సక్సెస్ కు మంత్రం ఇదే
– డిగ్రీలు కాదు… స్కిల్స్ అవసరం
– స్మార్ట్ వర్క్ తో కూడిన హార్డ్ వర్క్ చేయాలి
– ఆటోమేషన్ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి… ఆందోళన వద్దు
– విద్యార్థులకు మంత్రి శ్రీధర్ బాబు దిశా నిర్దేశం
హైదరాబాద్: ‘ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంతో పాటు మనం కూడా మారాలి. కాలం చెల్లిన జ్ఞానాన్ని విడిచిపెట్టి, నిరంతరం నూతన విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే సక్సెస్ మనల్ని వరిస్తుంది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘లెర్న్, అన్ లెర్న్, రీ లెర్న్’ అనేది ఇప్పుడు సక్సెస్ కు ఫార్ములా అని వివరించారు. మంగళవారం మాసబ్ ట్యాంక్ లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన “మన అమెరికన్ తెలుగు సంఘం(మాట) – టాస్క్ ఫ్రీ ఆన్ లైన్ ఐటీ ట్రైనింగ్” సర్టిఫికేట్ల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
‘ఒకప్పటిలా చేతిలో డిగ్రీ ఉంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. 50 శాతం మంది గ్రాడ్యూయేట్లకు ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ లేవని నాస్కామ్ గుర్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కనీస అవగాహన ఉండటం లేదని తేల్చింది’ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు కనుమరుగైపోతాయనే ఆందోళన వద్దు. 2025 నాటికి 8.5 కోట్ల ఉద్యోగాలు రోబోలు, ఏఐ వల్ల పోతే… కొత్తగా 9.7 కోట్లు పుట్టుకొస్తాయని వరల్డ్ ఎకానమిక్ ఫోరం తేల్చింది’ అని చెప్పారు. ‘చేతిలో డిగ్రీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై పట్టు ఉంటేనే కొత్త ఉద్యోగాలను సాధించలేరు. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, టీం వర్క్, అడాప్టబిలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లాంటి స్కిల్స్ కూడా అవసరం. ఆ దిశగా విద్యార్థి దశ నుంచే కృషి చేయాలి’ అని సూచించారు.
‘లక్ష్యం అంటూ లేని జీవితం చిరునామా లేని లెటర్ లాంటిది. విద్యార్థి దశలోనే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. ఆ దిశగా నిరంతరం పరిశ్రమించాలి. అపజయాలకు కుంగిపోవొద్దు. తప్పులను సరిదిద్దుకొని మరింత శ్రమించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్ వర్క్ తో కూడిన హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది’ అని వివరించారు. ‘సాంప్రదాయబద్ధంగా కాకుండా వినూత్నంగా ఆలోచించండి. కొత్త ఆలోచనలకు మేం ఎల్లప్పుడూ అండగా ఉంటాం. స్కిల్ కేపిటల్ ఆఫ్ గ్లోబ్ గా తెలంగాణను మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, టాస్క్ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. సమాజం కోసం కూడా ఆలోచించాలి’ అని సూచించారు. మాట చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు.
కార్యక్రమంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మాట ప్రతినిధులు శ్రీనివాస్, ప్రదీప్, విజయ్ భాస్కర్, నగేష్, కల్యాణి, డా.విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.