– సీమ కరవు, రైతుల కష్టాలు తెలిసిన వాణ్ని…నీళ్లతోనే బతుకులు మారతాయని నమ్మిన వ్యక్తిని
– సీమలో నీటి ప్రాజెక్టులకు ఆద్యుడు ఎన్టీఆర్…ఆచరణ నాది
– గత ప్రభుత్వం హంద్రీనీవాకు రూపాయైనా ఖర్చు పెట్టిందా?
– సంక్షేమం ఇవ్వడం గొప్పగా భావించడం లేదు..బాధ్యతగా స్వీకరిస్తున్నాం
– రాయలసీమంటే వాళ్లది ఓట్ల రాజకీయం..నాది అభివృద్ధి సంకల్పం.
– నీటికోసం తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వద్దు…ఇచ్చిపుచ్చుకుందాం
– సాగునీటి వినియోగదారులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
– మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి 3 పంపుల ద్వారా హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన సీఎం
– జల హారతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
– రికార్డు సమయంలో ప్రాజెక్టు పనుల పూర్తిలో భాగస్వామ్యమైన మంత్రులు, అధికారులకు అభినందన
నందికొట్కూరు : రాయలసీమకు నీళ్లిచ్చానన్న సంతృప్తిని జీవితంలో ఎప్పటికీ మరవలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్రలోనే ఇదొక శుభదినం అని తెలిపారు. హంద్రీనీవా పేజ్-1లో భాగంగా పూర్తైన కాల్వలకు నంద్యాల జిల్లా, మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి గురువారం నీటిని విడుదల చేశారు.
అనంతరం జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి వినియోగదారులతో సమావేశమైన ముఖ్యమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
సీమ కరవు, కష్టాలు తెలిసిన వాణ్ని
సీమలో జన వనరులు పొంగేలా మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశామని ముఖ్యమంత్రి అన్నారు. సీమ దశను మార్చేది నీళ్లేనని స్పష్టం చేశారు. ‘నాలుగు సార్లు సీఎంగా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. నేను ఈ ప్రాంతంలోనే పుట్టి , పెరిగాను. సీమ కరువు, కష్టాలు తెలిసిన వాణ్ని.ఆనాడు అనంతపురం జిల్లాలో వేరుశెనగ పంట ఎండిపోతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను.
సీమలో కరువు వల్ల పశువులకు గడ్డి కూడా వేసుకోలేని పరిస్థితి నెలకొంటే వేరే ప్రాంతాల నుంచి గడ్డి తెచ్చి ఆ పశువులను కాపాడాం. ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా, ఎడారిగా మారిపోతుందని..ఎవరూ కాపాడలేరని బాధపడే పరిస్థితి ఉంది. రాయదుర్గం ఎడారిగా మారుతుంటే వందల కోట్ల ఖర్చుతో అనేక కార్యక్రమాలు చేశాం’ అని సీఎం అన్నారు.
సీమ చరిత్రను తిరగరాసిన వ్యక్తి ఎన్టీఆర్
ఎన్టీఆర్ కరువు సీమ చరిత్రను తిరగరాశారని సీఎం అన్నారు. అప్పట్లో కొందరు సీమకు నీరు రావన్నారని మరికొందరు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ‘ఆనాడు హంద్రినీవా, గాలేరి నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత ఎన్టీఆర్ . ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో జరిగిన చర్చలో నా సీమకు నీరిచ్చాకే చెన్నైకి నీరు ఇస్తానని తేల్చి చెప్పారు. 1995లో నేను ఉరవకొండలో హంద్రినీవాకు శ్రీకారం చుట్టాను.
అందరూ అసాధ్యం అనుకున్నారు. కాల్వలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీరు అందదనే ఉద్దేశంతో 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే రూ.3,890 కోట్లు విడుదల చేశాను. 100 రోజుల్లో పనులు పూర్తి చేసి పంప్ లు ఆన్ చేశాం. మరో 15 రోజుల్లో చివరి వరకూ నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటా’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఇదీ …సీమపై మా కమిట్ మెంట్
హంద్రీనీవా ఫేజ్-2 కూడా పూర్తయితే 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ముఖ్యమంత్రి వివరించారు. దీన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, ఇది రాయలసీమపై టీడీపీకి ఉన్న కమిట్ మెంట్ అని అన్నారు. ‘3,850 క్యూసెక్కుల నీరు అంటే దాదాపుగా 4 టీఎంసీల నీరు ఈ కాల్వ ద్వారా తీసుకెళ్లవచ్చు. 40 టీఎంసీల నీరు తీసుకెళ్లేందుకు అవకాశం వచ్చింది. ఈ శుభ సందర్భంలో రైతన్నలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
అలాగే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థలకు అభినందనలు. GOOD JOB AND BIG CONGRATULATIONS చెబుతున్నాను.
ఎవరైనా ఒక మంచి పని చేస్తే దాన్ని మనం గుర్తించాలి. మీ అందరి పట్టుదల, కృష్టి, చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైంది. సీమ చరిత్రలో 6 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని ధైర్యంగా చెబుతున్నాం. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురంలో జీడిపల్లి రిజర్వాయర్ నింపుతాం’ అని వివరించారు.
త్వరలో హంద్రీనీవా ఫేజ్ 2 పూర్తి చేస్తాం
త్వరలో హంద్రీనీవా ఫేజ్ 2 పనుల పూర్తి చేసి సత్యసాయి జిల్లాలో ఉన్న మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లు, అన్నమయ్య జిల్లాలో ఉన్న
శ్రీనివాసాపురం, అడివిపల్లి రిజర్వాయర్లను నింపుతామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ‘నాకు సవాళ్లు కొత్త కాదు. ఒక పని మొదలెడితే అది అయ్యేదాకా నిద్రపోను. అది నా లక్షణం. బెంగుళూరు నుంచి అనంతపురానికి కియాను రమ్మంటే నీరు లేకుండా ఎలా పరిశ్రమ పెట్టాలన్నారు. 8 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ , కాల్వలు పూర్తి చేసి కియా మోటార్ పరిగెత్తించాను’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
6 లక్షల ఎకరాలకు సాగు…33 లక్షల మందికి తాగునీరు
హంద్రీనీవా కాల్వల విస్తరణతో నెలకు 4.27 టీఎంసీల చొప్పున 4 నెలల కాలంలో అదనంగా 17 టీఎంసీల నీటిని తరలిస్తామని సీఎం స్పష్టం చేశారు. దీంతో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ‘ఫేజ్ 1 ద్వారా కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,906 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలకు మొత్తంగా 1,98,000 ఎకరాలకు నీరు అందుతుంది.
ఫేజ్ 2తో అనంతపురం జిల్లాలో మరో 33,617 ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 1,93,383 ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో
1,40,000 ఎకరాలు… మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రెండు దశలు పూర్తి చేసి…ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 6 లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం. 33 లక్షల మందికి తాగునీటి సరఫరాకు అవకాశం కల్పించామంటే ఇది నా జీవితంలో మర్చిపోలేను. నందికొట్కూరులో నుంచి హంద్రీనీవా నీటిని చిత్తూరుకు తీసుకెళ్తానంటే కొందరు ఎగతాళి చేశారు. ఎన్టీఆర్ కలను తెలుగుదేశం పార్టీ నెరవేర్చింది’ అని సీఎం చెప్పారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే బాదుడు, నరుకుడే
ఒక నేత ఒక్క ఛాన్స్ అన్నందుకు ప్రజలు అందరూ ఏమారారని, ఒక్కఛాన్స్ ఇస్తే బాదుడే బాదుడు, నరుకుడే నరుకుడు అన్నాడని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ‘రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి. నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్టు కట్టాలి, ఇండస్ట్రీ తేవాలి. రోడ్డు వేయాలి , యువతకు ఉద్యోగాలు కల్పించాలి, జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచించాను. 2014- 19 మధ్య సీమ ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాం. కొందరు సీమ గురించి మాట్లాడతారు. కుల, మతాలను రెచ్చగొడతారు. గత ఐదేళ్లలో కనీసం రూ. 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఎవరు సీమకు మంచి చేశారో ప్రజలు అర్ధం చేసుకోవాలి‘ అని సీఎం సూచించారు.
ప్రాజెక్టులు నింపడమంటే సినిమా సెట్టింగ్ కాదు
‘2018లో హంద్రీనీవా కాల్వ వెడల్పు చేసి 3,850 క్యూసెక్కుల నీరు వెళ్లేందుకు టెండర్లు పిలిచానని, ఇంతలో ప్రభుత్వం మారి టెండర్లు క్యాన్సిల్ రద్దు చేసింది సీఎం గుర్తు చేశారు. ‘3,800 క్యూసెక్కులు కాదు ఏకంగా 10 వేల క్యూసెక్కులు నీరు తీసుకెళ్తామని గొప్పలు చెప్పారు. చివరకు రూ.10 పైసలు కూడా ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయలేదు. కుప్పంలో పెద్ద డ్రామా చేశారు. కాల్వల్లో చుక్క నీరు లేదు. సినిమా సెట్టింగ్ వేశారు. షూటింగ్
మొదలెట్టారు. నీరు వచ్చినట్టు ట్రాక్టర్లు తెచ్చారు. వాళ్లు వెళ్లిపోగానే నీరు ఆగిపోయింది. ఈ డ్రామాలు మనకు అవసరం లేదు’ అని సీఎం అన్నారు.
ఈ ఏడాది కుప్పానికి – వచ్చే ఏడాది తిరుపతికి నీరు
రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన ఘతన తెలుగుదేశంపార్టీది అయితే…వాటిని చెడగొట్టిన పాపం వైసీపీదేనని సీఎం విమర్శించారు. ‘హంద్రీనీవా,పోతిరెడ్డి పాడు, ముచ్చుమర్రి, గండికోట సహా అన్ని ప్రాజెక్టులను మనమే ముందుకు తీసుకెళ్తాం. నదుల అనుసంధానం నా జీవిత ఆశయం.
ఈ ఏడాది మనకు సకాలంలో వానలు పడలేదు. దీనివల్ల ఇబ్బందులు వచ్చాయి.కర్ణాటక, మహారాష్ట్రలో పడిన వానలతో జూలైలోనే శ్రీశైలానికి నీరు వచ్చింది. కాల్వలకు నీరు వదిలాం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రానికి కరువు రాదు
పట్టిసీమతో సాగర్ నుంచి వచ్చే నీటిని శ్రీశైలంలో పొదుపు చేసి కృష్టాడెల్టాకు నీరిచ్చాం. 120 టీఎంసీల నీరు సీమకు వదిలాం. సీమలో ఉండే
అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈ సారి వర్షాకాలం కంటే ముందే జలాశయాల్లో నీరు ఉంది. రాబోయే రోజుల్లో సీమను రతనాల సీమగా మారుస్తామనే ధైర్యమొచ్చింది. శ్రీశైలం నుంచి ఒక కాల్వ ఎస్ ఆర్ బీసీ, ఇంకో కాల్వ ముచ్చు మర్రి , మరో కాల్వ మల్యాల హంద్రీనీవా వస్తుంది. ఎస్ఆర్ బీసీ నుంచి వచ్చేది నేరుగా బనకచర్ల వెళ్లి అక్కడి నుంచి తెలుగుగంగ ద్వారా సోమశిల , కందలేరుకు వెళ్తుంది.
హంద్రీనీవా ఇక్కడి నుంచి అనంతపురం కలుపుతూ కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆలూరు కి నీరిచ్చి నేరుగా చిత్తూరు గొల్లపల్లి, శ్రీనివాస పురం వరకు వెళుతుంది. పెన్నా నదిపై పీఏబీఆర్, మిడ్ పెన్నార్, చాగల్లు బ్యారేజ్ కానీ, ఆ కింద పైడిపాలెం, సీబీఆర్, సర్వారాయ్ సాగర్ వస్తాయి. ఇంకోవైపు నేరుగా నగరి, గాలేరుపైన గండికోట, అవుకు దానిపై మైలవరం వంటి ప్రాజెక్టులు వస్తాయి. భవిష్యత్ లో ఇక్కడి నీరు 600 కిలోమీటర్లలు ప్రయాణించి తిరుపతి వెళతాయి’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
దేవుళ్లనూ అనుసంధానం..జలహారతి
శ్రీశైలం మల్లన్న దగ్గర నుంచి ప్రారంభమైన కృష్ణా జలాలు సాక్షాత్తు ఏడుకొండలవారి పాదాల చెంతకు వెళ్తాయని ముఖ్యమంత్రి అన్నారు. రైతుల కష్టాలు తీర్చడమే కాదు…. ఇద్దరు దేవుళ్లను కూడా అనుసంధానం చేసి జలహారతి ఇస్తున్నామని తెలిపారు. ‘రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీమకు నీరు ఇస్తానంటే …ఆనాడు నాయకులు కృష్ణాకు నీరు నిలిపేసి మాకిమ్మన్నారు. బచావత్ అవార్డు ప్రకారం సీమకు నీరిచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఆ తర్వాత నన్నూ ఇబ్బందులు పెట్టారు.
నాది మంచి సంకల్పం. ప్రజలకు గురించే ఆలోచిస్తాను. ఎవరెన్ని ఇబ్బందులు కలిగించినా , శాపాలు పెట్టినా, తిట్లు, బూతులు తిట్టినా మనసుకు చేరవు. క్లైమోర్ మైన్సే ఏమీ చేయలేకపోయాయని, అంతిమంగా ప్రజలు బాగుండాలని సీఎం ఆకాంక్షించారు.
రాష్ట్రానికే మణిహారంగా రాయలసీమ
రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని, రాష్ట్రానికే మణిహారంగా సీమను తయారుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
‘ఒక పార్టీకి సీమ అంటే రాజకీయం , రక్తం. నాకు సీమ అంటే నీళ్లు, ప్రజల భవిష్యత్తు. పాదయాత్రలో రాయలసీమ డిక్లరేషన్ పై లోకేష్ చేసిన ప్రకటనను అమలు చేస్తాం. హార్టీకల్చర్కు సాగుతో తలసరి ఆదాయంలో కోనసీమను దాటేలా రాయలసీమ మార్చుతాం. సాగుకు ప్రాధాన్యం ఇస్తూనే పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేస్తున్నాం.
ఆటోమొబైల్, స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఈ ప్రాంతంలో నెలకొల్పేలా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
డిల్లీ పర్యటనలో కూడా ఇవే అంశాలు చర్చించాము. ఓర్వకల్లు-లేపాక్షి మధ్య ఎలక్ట్రానిక్, డిఫెన్స్, ఏరో స్పేస్ పరిశ్రమలను తెస్తాం. కొప్పర్తి,
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ల కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
కర్నూలు, ఓర్వకల్లు లో డ్రోన్ సిటీ వస్తే దేశానికి కావాల్సిన డ్రోన్స్ అన్నీ ఇక్కడే తయారవుతాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ తెస్తాం. కడపలో
స్టీల్ ప్లాంట్ త్వరలో మొదలు పెడతాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
తెలంగాణతో జగడం అవసరం లేదు
నదీ జలాల విషయంలో ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నీటి వివాదాలపై చర్చలు జరిగాయని, ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించాలన్నదే నా కోరిక. గోదావరి బోర్డు హైదరాబాదులో.. కృష్ణా బోర్డు విజయవాడలో పెడుతున్నాము. శ్రీశైలం ప్లంజ్ పూల్ పనులకు మనమే డబ్బులిచ్చి పనులు చేస్తాం.
అవసరమైతే గోదావరి నీళ్లు వాడుకోమని తెలంగాణకు చెప్పాను. నదుల అనుసంధానానికి సహకరించమని కోరాను. సముద్రంలోకి పోయే నీరు రెండు
రాష్ట్రాలు వాడుకుంటే సీమ, తెలంగాణలో మెట్ట ప్రాంతాలు బాగుంటాయి.
సమైక్యాంధ్రలో తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉన్నాను. పదేళ్లు విపక్షనేతగా ఉన్నాను. విభజన తర్వాత నవ్యాంధ్ర సీఎం అయ్యాను. నేను ప్రజల కోసం
పనిచేస్తున్నాను. చిన్న చిన్న ఇబ్బందులకు భయపడిపారిపోను. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెడతానని సీఎం తెలిపారు.
సుపరిపాలనలో తొలి అడుగు వేశాం
2024 ఎన్నికల్లో ప్రజలు అద్భుత విజయం ఇచ్చారు. 93 శాతం స్ట్రైక్ రేటుతో గెలిపించారు. చెప్పినట్టే సంక్షేమం అందిస్తున్నాం. ఒకటో తేదీన పేదలకు ఠంచనుగా పింఛను అందిస్తున్నాం. అమ్మఒడి అందరికీ ఇస్తామని మోసం చేశారు.
మేము ఎందరుంటే అందరికీ తల్లికి వందనం అని చెప్పాం. చెప్పినట్టే ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం. ఎన్డీఏ రాగానే 207 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు కడుపునిండా తిండిపెడుతున్నాం. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో క్యాంటీన్లు పెడతాం.ఆగస్టు 20 లోగా ప్రతి స్కూల్లో టీచర్లను నియమించే బాధ్యత నాది.
సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. కేంద్రం వేయగానే రైతు భరోసా కింద రైతుల అకౌంట్లో డబ్బులేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాము. 9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాం. వీటి ద్వారా 8.5 లక్షలమందికి ఉద్యోగాలు వస్తాయి. పిల్లలు బాగా చదువుకోవాలి. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. హార్డ్ వర్క్ కాదు .
రాజకీయాలకు రాయలసీమను వాడుకున్నారు
ఓట్ల రాజకీయాల కోసం కొందరు సీమను వాడుకున్నారని, కానీ టీడీపీ చిత్తశుద్ధితో సీమను అభివృద్ధి చేసిందని సీఎం అన్నారు. ‘చరిత్రలో ఎవరూ
ఇవ్వని విధంగా కేజీ మామిడి పంటకు ప్రభుత్వం తరపున రైతుకు రూ.4 ఇచ్చాం.
కానీ గత మాజీ సీం అక్కడికి వెళ్లి వారి పార్టీ నేతకు చెందిన తోట నుంచి 5 ట్రాక్టర్లతో మామిడికాయలు తెచ్చి రోడ్లపై తొక్కించారు. ఇలాంటి వారికి
రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా?
అజాత శత్రువు వివేకాను హత్య చేసి సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అని రాశాడు. వాళ్లు చేసిన నేరాన్ని ముఖ్యమంత్రిపైన నెట్టగలిగాడంటే సామాన్యులు అతనికి లెక్కా? కర్నూలు జిల్లా ఆస్పత్రిలో సీబీఐని అడ్డుకుని ఎలా నాటకాలు ఆడారో మీరంతా చూశారు. ఇటీవల రౌడీషీటర్ ఇంటికి పరామర్శకు వెళ్లి హడావుడి చేశారు. ఇలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
నందికొట్కూరు అభివృద్ధి బాధ్యత నాది
రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చి కనీసం రెండు మెట్ట పంటలు వేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘వేదావతి ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తాం. గోరకల్లు మరమ్మతులకు రూ. 90 కోట్లు మంజూరు చేస్తున్నాం. అలగనూరు జలాశయానికి రూ.36 కోట్లు విడుదల చేసి పూర్తి చేస్తాం. మిట్టూరులో లిఫ్ట్ ఇరిగేషన్ కింద కలవమందలపాడు, హంద్రినీవా సుజల స్రవంతి కెనాల్ నుంచి 19వ కిలోమీటర్ లో ఒక లిఫ్ట్ పెడితే 6 వేల ఎకరాలు సుభిక్షం అవుతుందని స్థానిక రైతులు చెప్పారు. దీని కోసం రూ. 60 కోట్లు విడుదల చేసి త్వరలో పనులు ప్రారంభిస్తాం. నియోజవర్గంలో ఒక మోడల్ స్కూల్, ఆస్పత్రిని నిర్మిస్తాం’ అని సీఎం వరాలు కురిపించారు.