– ఆర్థిక స్వాతంత్రం ద్వారానే లింగ బేధం సమస్య నివారణ
– స్వయం సహాయక సంఘాలతో 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి
– రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే లింగ సమానత్వం సాధ్యం
– నిజాం కళాశాల గొప్పది.. పూర్వ విద్యార్థిగా గర్వపడుతున్నా
– ఒక రోజు నిజాం కళాశాలలో గడపాలని నిర్ణయించుకున్నా
– హైదరాబాద్ నిజాం కళాశాలలో వుమెన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లింగ అసమానతల సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే లింగ వివక్ష సమస్య నివారించే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం నిజాం కళాశాలలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లింగ సమానత్వం సదస్సులో డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు
డిప్యూటీ సీఎం వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ప్రకటించగానే ప్రతిపక్షాలు అపహస్యం చేశాయి, కానీ మేం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగాం మొదటి ఏడాదిలకోట్లు 21,632 కోట్లు వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేశామని వివరించారు.
ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రంలోని మహిళల చేతిలో తిరిగితే ఆర్థిక స్వాతంత్రం, లింగ సమానత్వం సాధ్యమవుతుంది..
మూలం నుంచి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యార్థినిలు బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలి ఉద్యోగాలు సాధించలేని వారు ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలకు నాంది పలకాలని
డిప్యూటీ సీఎం సూచించారు.
నిర్మాణ, విద్యుత్ రంగాల్లో కొద్ది మంది ప్రైవేటు వ్యక్తులే నిలబడి విజయం సాధిస్తారని ప్రచారంలో ఉంది కానీ మేము అందుకు భిన్నంగా గ్రీన్ పవర్
ఉత్పత్తిలో భాగంగా మహిళా సంఘాలతో 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారితో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయించి, ప్రభుత్వమే వారు ఉత్పత్తి చేసిన విద్యుత్తును కొనుగోలు చేసి బిల్లులు చెల్లిస్తుందని ఆ మేరకు విద్యుత్ సంస్థలు మహిళా సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు.
ఈ తరహా కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు జరగలేదు అన్నారు.మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల పై ఆర్థిక భారం లేకుండా గుడి, బడి ,ఆసుపత్రి తిరగడానికి జ్ఞానం పొందడానికి అవకాశం ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాల ద్వారా 650 బస్సులు కొనుగోలు చేయించి ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇప్పించి ఆదాయం వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
అమ్మ క్యాంటీన్లు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ ఇల్లు అన్నీ మహిళల పేరుటే మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మహిళలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటే రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటుందని అన్నారు.
మహిళలకు ఆత్మగౌరవం, లింగ సమానత్వం, వరకట్ట నిషేధం, తల్లిదండ్రుల ఆస్తిలో వాటా వంటి హక్కులు దక్కాయి అంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని తెలిపారు. మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో మీటర్నిటీ లీవ్ వంటివి స్వాతంత్రం రాకముందు లేవు, అణిచివేత ఉండేది స్వాతంత్రం అనంతరం రాజ్యాంగం ద్వారా మహిళలు, కులం, మతం అనే తేడా లేకుండా అందరికీ హక్కులు దక్కాయి అని డిప్యూటీ సీఎం వివరించారు రాజ్యాంగాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని తెలిపారు.
నిజాం కళాశాల గొప్పది.. పూర్వ విద్యార్థిగా గర్వపడుతున్నాను: డిప్యూటీ సీఎం
1880లో ప్రారంభించిన నిజాం కళాశాల చాలా గొప్పదని, ఈ రాష్ట్రం, దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి గొప్ప సైంటిస్టులను, రాజకీయ నాయకులను, పరిపాలికలను అందించిందని వివరించారు.
2010-14 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ గా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ గా
కొనసాగిన తాను అంతా నిజాం కళాశాల విద్యార్థులు కావడం మరువలేని జ్ఞాపకం అని అన్నారు. 1980 కాలంలో గ్రామీణ ప్రాంతం నుంచి తక్కువ మంది విద్యార్థులు నిజాం కళాశాలకు వచ్చేవారని, తాను రూమ్ నెంబర్ 36 లో ఉండి చదువుకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
1982- 84 మధ్యకాలంలో నిజాం కళాశాలలో చదివిన నా సహచరులు గొప్పగా చదువుకొని అమెరికాలో సైంటిస్టులుగా స్థిరపడ్డారని వారంతా నిత్యం
కలుస్తుంటారని తెలిపారు. నిజాం కళాశాలలో ఉన్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని, పూర్వ విద్యార్థిగా ఒక
రోజు నిజాం కళాశాలలో గడపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.