పాఠాలు చెప్పేవారిని ‘టీచర్’ అంటారు. జీవిత పాఠాలను కూడా చెప్పేవారిని ‘మాస్టర్’ అంటారు. జ్ఞానమిచ్చే వారిని ‘గురువు’ అంటారు. గురువు అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు. అలాగే ‘ఆచార్యుడు’ అంటే “ఆచరించి చెప్పేవాడు” అని అర్థం.
పూర్వం మాస్టర్లు రోడ్డు మీద నడుస్తుంటే ఊరి ప్రజలందరూ అభివాదం చేసేవారు. వారి జీవన విధానం కూడా ఆదర్శప్రాయంగా ఉండేది. నేటి కాలంలో కూడా కొంతమంది టీచర్లు పిల్లల మనసు దోచుకోవడం, గౌరవం పొందడం చూస్తూనే ఉన్నాం. ఏ పని చేసినా ‘మనసా, వాచా, కర్మణా’ చేయడం వల్ల వచ్చే బహుమతి అది. టీచర్ని పిల్లలు నిశితంగా పరిశీలిస్తారు.
ఒక విద్యార్థి తన విద్యాభ్యాస కాలంలో 25 వేల గంటలు ఉపాధ్యాయులతో గడుపుతాడు.
వారి ప్రభావం కచ్చితంగా పిల్లలపై పడుతుంది. పాఠాలతో పాటు పిల్లల్లో ఎటువంటి సృజనాత్మకత దాగుందో, ప్రతిభ ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్లపై ఉంది. ఎందుకంటే పేరెంట్స్ శిక్షణ పొందినవారు కాదు. ఒక ఉపాధ్యాయులు మాత్రమే శిక్షణ పొందినవారు. పిల్లల గురించి పిల్లలకి తెలియదు, పేరెంట్స్ కీ తెలియదు. పిల్లలు ఎవరో వారికి తెలియజేయాల్సింది మాస్టర్లే.
– ప్రైమరీ విద్యాభ్యాసం అంతా ప్రేమ ప్రాతిపదికన సాగిపోవాలి. పిల్లలు ఎంత అల్లరి చేసినా సరే, హోమ్ వర్క్ చేయకపోయినా సరే, ప్రేమగా చూడాల్సిందే.
– ఇక హైస్కూల్ నుండి క్రమశిక్షణ అవసరం. ఎలా రాయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా తినాలి, ఎలా నడవాలి వంటి నడవడిక, నడత నేర్పాలి.
– ఇక కళాశాలకి వచ్చాకా గైడ్‌లైన్స్ మాత్రమే ఇవ్వాలి. ఏ కోర్సు ఎంచుకోవాలి, కెరియర్లో ఎలా ముందుకు వెళ్లాలి, విద్యార్ధుల సహజ సామర్ధ్యాన్ని తెలుసుకోవడం వంటి వాటిలో పెద్దలు సహాయపడవచ్చు.
ఈ వేళ పేరుకి క్వాలిఫైడ్ టీచర్లు చాలామంది ఉన్నారు. కానీ తపన, సామర్ధ్యం ఉన్నవారిని పట్టుకోవడానికి స్కూళ్ల యాజమాన్యానికీ తలప్రాణం తోకకు వస్తుంది. దీనికి కారణం మంచి టీచర్లు లేరని నిందించే మనం అందరం కారణమే. మనలో ఎంతమంది తమ పిల్లల్ని మంచి టీచర్/ప్రొఫెసర్ కావాలని కోరుకుంటారు? భవిష్యత్‌లో ప్రతిభగల ఉపాధ్యాయులకు కొరత ఏర్పడుతుందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే ఆర్ట్స్, ఫిజిక్స్, సైన్సు చెప్పడానికి ఉపాధ్యాయులు దొరకటంలేదు. అత్యంత ప్రతిభగల ఉపాధ్యాయులకి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. “బతకలేక బడి పంతులు” ఇది ఒకప్పటి మాట. గొప్ప తరం తయారవ్వాలంటే బెస్ట్ బ్రైన్స్ (అత్యుత్తమ మేధస్సులు) బోధనా రంగంలో ఉండాలని శ్రీ అబ్దుల్ కలామ్ గారి అభిలాష. మానవులను మహనీయులుగా తీర్చిదిద్దడం కంటే మహోన్నత కార్యం జీవితంలో ఏముంటుంది కనుక!
‘నీ ధర్మం సరిగ్గా ఆచరించకపోయినా అది ధర్మమే. పరధర్మం పరిపూర్ణంగా చేసినా అది అధర్మమే!స్వధర్మాన్ని వీలయినంతగా అనుసరించడం ఎంతో మేలు. పరధర్మాన్ని అనుసరించడం భయానకం’ అని భగవద్గీత చెప్తుంది. మన ధర్మాల్లో ప్రధానమైనది ఉపదేశ ధర్మం. ఒక డాక్టరుకు వైద్యం చేయడం కన్నా వైద్యవృత్తిలో వచ్చే పలు కొత్త పద్ధతులను ఇతరులకు బోధించడంలోనే ఎక్కువ సంతృప్తి కలుగుతున్నట్లైతే అతని ధర్మం ఉపదేశ ధర్మమే.
హైస్కూలు పిల్లలకు దిగువతరగతులవారికి బోధించడం నేర్పితే, బోధించడంలోని కిక్ తెలుస్తుంది, బోధించాలనే ఉద్ధేశంతో నేర్చుకుంటే సబ్జెక్టు 95% అర్ధమవుతుంది. తపన ఉంటే పార్ట్ టైమ్ గా పది స్కూళ్లకు వెళ్లి పాఠాలు చెప్పే మంచి అలవాటును అలవరచుకోవచ్చు.
నాసిరకం టీచర్ = బోధిస్తాడు,
సామాన్యమైన టీచర్ = వివరిస్తాడు,
మంచి టీచర్ = ప్రాక్టికల్‌గా చూపిస్తాడు,
ఉత్తమ టీచర్ = స్ఫూర్తిని (ఆసక్తి) కలిగిస్తాడు.
పుస్తకాలలో ఉన్నది చెప్పేవారు = అధ్యాపకులు.
అర్ధమయ్యేటట్టు బోధించగలిగేవారు = ఉపాధ్యాయులు.
నైపుణ్యం (స్కిల్) నేర్పేవారు = ఆచార్యులు.
జీవిత గమ్యం తెలుసుకునేలా చేసేవారు = మార్గదర్శులు.
జీవిత ప్రయోజనం తెలియచేసేవారు = గురువులు.
జార్జ్ గుర్జిఫ్ చెప్పినట్లుగా “తగినంత మంది వ్యక్తులు తమను తాము పాక్షిగంగా అయినా సరే, స్వచ్ఛమైన, సహజమైన మనుష్యులుగా అభివృద్ధి చేసుకున్నట్లైతే, మానవులలో ఒక క్రమంలో ఉండే.. అంతర్గతంగా ఉండే అసలైన సామర్ధ్యాన్ని ఉపయోగించ గలుగుతారు. అటువంటి వ్యక్తి ఇతరులను ఒప్పించి, వందల మంది మనసు గెలవ గలుగుతాడు.
అలా అభివృద్ధి సాధించిన ఒక్కొక్కరు మరో వందమందిని ప్రభావితం చేయగలరు. ఇది అలా సాగుతూనే ఉంటుంది.
పిల్లలు 25% టీచర్ నుండి, 25% సమాజం నుండి, 25% స్నేహితుల నుండి నేర్చుకుంటారట! మిగతా 25% జీవితమే నేర్పిస్తుందట.
ఇది సేకరణే:
– వెలిశెట్టి నారాయణరావు
విశ్రాంత సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయుడు