పదేళ్ళపాటు అప్రజాస్వామికంగా తెలంగాణ రాష్ట్రం నెత్తిన కుటుంబపాలనను రుద్ది, రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసింది బీ ఆరెస్ పార్టీ. అధికారం రుచిమరిగి, అది శాశ్వతమని భ్రమించి, తన కోడీ, తన కుంపటీ లేకపోతే తెల్లారబోదనుకున్న ముసలమ్మలాగే ఇక తెలంగాణకు తామే దిక్కని వారు భావించారు. ఆ క్రమంలో తమకు అధికారం కట్టబెట్టింది ప్రజలేనన్న అసలు వాస్తవాన్ని వారు మరచారు. అందుకే తెలివైన, చైతన్యవంతులైన తెలంగాణ ఓటర్లు ఆ పార్టీని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించి ప్రతిపక్షస్థానంలో కూర్చోబెట్టారు.
ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో వారికి కనీసం ఒక్కటంటే ఒక్క ఎం.పీ. సీటు కూడా ఇవ్వకుండా లోక్ సభలో బీఆరెస్ అడ్రసు గల్లంతు చేశారు.దాంతో తెలంగాణకైతే ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ వచ్చింది కానీ బీఆరెస్ నేతలకు మాత్రం ఇంకా రావలసిన బుద్ధి రాలేదు. వారి దొర పోకడలలో కాస్తన్నా మార్పులేదు. తెలంగాణ భారత రాజ్యాంగం అమలయ్యే భారత దేశంలోని ఒక అంతర్భాగం కానట్లూ, అది ఏదో స్వతంత్రదేశమో లేక వారి స్వంత జాగీరో అన్నట్లు, తాము తెలంగాణను పుడుతూనే వీపుకి కట్టుకుని పుట్టినట్లు, తెలంగాణపై తమకొక్కరికే హక్కుభుక్తాలున్నట్లు మాట్లాడటం వారింకా మానలేదు.
తమ రాజకీయ లక్ష్య సాధన కోసం అవసరమైనప్పుడల్లా తమ అమ్ములపొదిలోంచి సెంటిమెంట్ అస్త్రాన్ని బయటికి తీసి ప్రయోజనం పొందటానికి వారు బాగా అలవాటు పడ్డారు. అందుకే నేటికీ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్రత్యేకించి చంద్రబాబు నుంచి ఏదో ముప్పు ఉందని వాళ్ళు జనాన్ని భయపెట్టి రెచ్చగొట్టటం పరిపాటైంది. వృథాగా సముద్రంలో కలిసే మిగులు జలాలను వాడుకునే హక్కు చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కి ఉందని తెలిసికూడా వారు బనకచెర్ల పై యాగీ మొదలెట్టారు.
అధికారం తమ చేజారిపోయేసరికి వారు తెలంగాణ ఉనికికే ఏదో ప్రమాదం ఏర్పడినట్లు గగ్గోలు పెడుతున్నారు. తమ పదేళ్ళ పాలనలో కాళేశ్వరం నిర్మాణ అక్రమాలు, ఫోన్ టాపింగ్ వంటి తాము చేసిన నేరాలు – ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే కెసిఆర్ అండ్ కో బెంబేలెత్తి పోతున్నది. అందుకే తమకు అవరమైనప్పుడల్లా వారు, తిరిగి ప్రాంతీయ చిచ్చును ఎగదోస్తుండటం వారికి మామూలైపోయింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి పదకొండేళ్ళు అయినా, తమ రాష్ట్ర అభివృద్ధికి తాము నిర్మాణాత్మకంగా ఏమి చెయ్యాలని ఆలోచించడం మానేసి.. తమ చేతగానితనానికి, తమ తప్పుడు నిర్వాకాలకూ వారు దాయాది రాష్ట్రాన్ని, ప్రత్యేకించి చంద్రబాబును ఆడిపోసుకోవటం రివాజు అయింది. ‘మొగుడు కొట్టినందుకు కాదు; తోడికోడలు తొంగిచూసిందని ఏడ్చే ఇల్లాలి వరసలా ఉంది’ – తమను ఈడ్చి నేలకేసి కొట్టిన ప్రజలను ఏమీ చేయలేక కెసిఆర్ అండ్ కో మీడియా మీద అక్కసు వెళ్ళగక్కటం చూస్తుంటే.
అహంకారపు ప్రేలాపనలు
తెలంగాణ ఉద్యమం మంచి ఊపులో ఉండగా ఆ మైకంలో ఒళ్లూ పై తెలియకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడిన సాటి తెలుగువారిని అత్యంత నీచంగా “ ఆంధ్రా కుక్కల్లారా ! ఇరవైనాలుగు గంటలలో ఖాళీ చేసి వెళ్ళిపోండి ! లేకపోతే తన్ని వెళ్ళగొడతాను. లంకలో పుట్టినవాళ్ళంతా రాక్షసులే ! ఆంధ్రాలో పుట్టినవాళ్ళంతా తెలంగాణ ద్రోహులే ! తెలంగాణను దోచుకోవాలని చూసేవారే ! ఇన్ని తిట్టినా, ఇన్ని అన్నా చివరికి ముఖంమీద ఊసినా, సిగ్గులేకుండా ఇక్కడే ఉంటాం – అంటున్నరు. ఇజ్జత్ ఉన్నవాళ్ళయితే బండగట్టుకుని బాయిలో దూకాలె,” అంటూ సంస్కారహీనమైన భాషలో నోరు పారేసుకున్నారు కెసిఆర్.
తనను అందరూ ‘తెలంగాణ జాతిపిత’ గా గుర్తించాలని కోరుకునే కెసిఆర్ సహజసిద్ధమైన సంస్కారం అదీ. ‘ తెలంగాణ ‘ ఏర్పడక ముందూ, ఆ తరువాత కూడా ఆంధ్ర ప్రాంతం వారిని తెలంగాణ రాష్ట్ర ద్రోహులు అనటం కెసిఆర్ అండ్ కో కు అలవాటుగా మారింది. రాజ్యాంగంలో అసలు దేశ ద్రోహం ( Sedition), రాజద్రోహం (Treason) అనే పదాలే లేనప్పుడు.. ఈ రాష్ట్ర ద్రోహం అనే పదం వాడటం అభ్యంతరకరం మాత్రమే కాదు. అది వారి అజ్ఞానానికి తార్కాణం కూడా.
భారత రాజ్యాంగంలోని 19 వ అధికరణం ప్రకారం పౌరులెవరైనా, భారత భూభాగంలో తాము కోరుకున్న ఏ ప్రదేశంలోనైనా స్వేచ్చగా తిరుగాడవచ్చు, స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. తాము కోరుకున్న వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందవచ్చు. ఇవి రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు. తెలంగాణలో నివసించటానికి ఏ దారినపోయే దానయ్యల దయా దాక్షిణ్యాలో లేక బీఆరెస్ వారు జారీ చేసే అనుమతిపత్రాలో ఉండాల్సిన అవసరం లేదు.
చూసి చూసి బాధితులు ఎవరికైనా విసుగొస్తే రాజ్యాంగంలోని తమ ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగేలా బెదరింపులకు, మౌఖిక, భౌతిక దాడులకు పాల్పడుతున్నారనే నేరం మీద గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వంటివారిపై సుప్రీం కోర్టులో తగు ఆధారాలతో రిట్ వేస్తే ‘ కట్టె వంక పొయ్యి తీర్చినట్లు’ తిక్క తిన్నగా కుదురుతుంది. బెదరించే మౌఖిక దాడి కూడా శిక్షార్హమైన నేరమేనని గ్రహించి వారు తమ నోరును అదుపులో పెట్టుకోవాలి.
ఇది ప్రజాస్వామ్యదేశమనీ, పౌరులంతా రాజ్యాంగ రక్షణలో ఉన్నారనే సోయి లేకుండా కెసిఆర్ అండ్ కో తమకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా ఏపీని ముగ్గులోకి లాగి సెంటిమంటలు రాజేయటం, దాడుల ద్వారా ప్రత్యర్థి పార్టీలను, మీడియానూ భయపెట్టాలని చూడటం మరెంతకాలమో సాగదని వారు ఇకనైనా గ్రహిస్తే మంచిది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలలో ఒకటైన,’ ఫోర్త్ ఎస్టేట్’ గా పేరొందిన ప్రెస్ జోలికి వెళ్ళిన నియంతలంతా కెసిఆర్ భాషలో చెప్పాలంటే మైలు లోతు గోతిలో పాతిపెట్టబడ్డారు.
ఎవరి తిండి తింటున్నారు ?
ఆంధ్ర నుంచి వచ్చినవారు పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి తెలంగాణదంటాడు మాజీమంత్రి, ప్రస్తుత సూర్యాపేట బీఆరెస్ శాసన సభ్యుడు శ్రీమాన్ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. అందుకే ఆంధ్రాలో పుట్టినవాళ్ళు అందరూ తెలంగాణలో వీరికి కట్టుబానిసల్లా పడుండాలన్నట్లు ఉంది ఈ తరహా నేతల దొర పోకడ. అందుకే మనం వీరికి కొన్ని ప్రశ్నలు సంధించాలి.
కెసిఆర్ తాత బిహార్ నుంచి, నాయనమ్మ ఉత్తరాంధ్రలోని బొబ్బిలి నుంచి వలస రాలేదా ? తెలంగాణలోని సిద్ధిపేట రూరల్ మండలం చింత మడక నుంచి వచ్చిన వీరి కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడలేదా ? బుడ్డ దొర కెటిఆర్ చదువుకునే రోజుల్లో పస్తులున్నాడా ? గుంటూరులో తిండి తినలేదా ? కెటిఆర్ భార్య శైలిమ ఆంధ్రకు చెందినావిడ కాదా ? ఆమె తండ్రి కీ. శే. పాకాల హరినాథ రావుది ఆంధ్ర కుటుంబమే కదా ? కెటి ఆర్ రోజూ తినే తిండి ఏ తిండి మరి ? ఆంధ్ర తిండా ? తెలంగాణ తిండా ? కెటిఆర్ వ్యాపార భాగస్వాములంతా దాదాపు ఆంధ్రవాళ్ళే కదా ?
ఆంధ్ర బిర్యానీని విమర్శించి వివాదాన్ని మరోమారు తిరగదోడిన కవితగానీ, వాళ్ళ అన్న తారకరామారావు గానీ – తాము అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి తిండి తిన్నారా లేక అప్పట్లో వారు రోజూ ఇక్కడి నుంచి తెలంగాణ బిర్యానీ ప్యాకెట్లు తెప్పించుకునేవాళ్ళా ? ఇప్పుడు లండన్ లో చదువుకుంటున్న గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొడుక్కి కూడా అలాగే రోజూ హైదరాబాద్ బిర్యానీ పాకెట్లు వెళుతున్నాయా ? వెళ్ళటం లేదే ? ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే పాతుకుపోవాలి, ఎవరి ప్రాంతపు తిండి వారే తినాలనే సిద్ధాంతం అలా కెసిఆర్ కుటుంబం, జగదీశ్ రెడ్డి కుటుంబం విషయంలోనే చెల్లని చిల్లి కానీ అయింది కదా ?
ఇంకా ‘ ఎవరి తిండి తింటున్నారు ?’ అంటూ ఎవరిమీద వేస్తారు వీళ్ళు రంకెలు? ‘అసలు పక్క జిల్లాలోళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఈ లొల్లేంది ? మీరందరూ గమ్మునుండండి’ అని మునుపటిలెక్క హైదరాబాద్ కి చెందిన ఏ ఆలుగడ్దో గొంతెత్తితే ఈ రంకేలేసే వాళ్ళ గతేంటో ?
ఆంధ్ర, తెలంగాణలు – చారిత్రక వాస్తవాలు
తెలంగాణలో ఏదైనా పత్రిక లేక ఛానెల్ నడపాలంటే దాని పేరులో ‘నమస్తే తెలంగాణ’, ‘మన తెలంగాణ’, ‘నవ తెలంగాణ’ అనే రీతిలో తెలంగాణ శబ్దమే తప్ప ‘ ఆంధ్ర’ అనే శబ్దమే ఉండరాదట ! ‘ఆంధ్రజ్యోతి’ పేరులో ‘ఆంధ్ర’ శబ్దం తీసెయ్యాలంటాడు మరో ప్రబుద్ధుడు. ఆంధ్ర శబ్దం ఎంత ప్రాచీనమైనదో, దాని అర్థమేంటో మరి ఇలాంటివారికేం తెలుసు ?
ఋగ్వేదంలోని అంతర్భాగమైన, సామాన్య శక పూర్వం 1500 నాటి ‘ఐతరేయ బ్రాహ్మణం’ లోనే ఆంధ్ర శబ్దం ప్రస్తావన ఉంది. నాటి ప్రజలు మాట్లాడిన అంధ్రము, ఆంధ్రము అనేవి తెలుగుకు పర్యాయపదాలు. అందుకే తెలంగాణ మహాకవి కాళోజీ ‘ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా ?’ అంటూ ఇతరభాషలు నేర్చుకుని,తమ మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేసేవారిని కఠినంగా విమర్శించాడు.
ఆంధ్ర గీర్వాణ భాషలలో పండితుడు అంటే తెలుగు సంస్కృత భాషలలో పండితుడని అర్థం. ఆంధ్రదేశం అంటే తెలుగువారు నివసించే ప్రాంతమనీ, తెలంగాణము ( తెలుంగు + ఆణెము ) అంటే ‘తెలుగు మాట్లాడే ప్రదేశం’ అని అర్థం. ఈ రెంటి అర్థమూ ఒకటే. అందుకే కెసిఆర్ అండ్ కో కు భాషా పరిజ్ఞానంతో పాటు కొంత చరిత్ర జ్ఞానం కూడా అవసరం.
అసలు తెలంగాణ అనే ప్రాదేశిక గుర్తింపు ఏర్పడక ముందు, ఆ ప్రాంతం కూడా అనాదిగా ఆంధ్రదేశంలో ఒక అంతర్భాగంగానే ఉండేది. చైనీస్ యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ (సా. శ. 602 – 664 ) తన రచనలలో ఆంధ్ర, తెలంగాణలను విడదీసి చూపలేదు. చాళుక్యుల, కాకతీయుల, ముసునూరి నాయకుల పాలనాకాలంలో తెలుగు వాళ్ళందరం ఒకే ఏలుబడిలో ఉన్న వాళ్ళమే కదా !
ఓరుగల్లు రాజధానిగా పాలించిన రాణి రుద్రమదేవి( 1261 – 1295) ఆస్థానాన్ని 1292 లో సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో తన గ్రంథంలో కాకతీయ రాజ్యాన్ని ‘మోటుపల్లి రాజ్యం’ అని పేర్కొన్నాడు. నేటి ప్రకాశం జిల్లా మోటుపల్లి కాకతీయ రాజ్యంలోని సుప్రసిద్ధ రేవు పట్టణం. కనుక తెలంగాణ వేరుగా పుట్టింది కాదు. అది అనాదిగా ఆంధ్రదేశంలో ఒక అంతర్భాగంగానే ఉండేది.
కాలక్రమంలో ప్రాచీన ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ ( తౌరక్యాంధ్ర ) అనే పేరును సంతరించుకున్నాయి. బహమనీల పాలనలో ఉత్తరాంధ్రతో సహా యావత్తు తెలుగు నేలంతా ఒకే పాలనలో ఉండేదనటానికి ఎన్నో శాసనాధారాలున్నాయి. బహమనీ సామ్రాజ్య విచ్ఛిన్నం తరువాత 1512 నుంచి 1687 వరకు మొత్తం తెలుగు నేలంతా గోల్కొండ నవాబుల పాలనకిందే ఉంది.
గోల్కొండ నవాబుల పాలనలో వారి రాజ్య పరిధిలో కేవలం ఆంధ్ర – తెలంగాణ భూభాగం మాత్రమే కాదు మదరాసు, మరి కొంత దక్షిణ ప్రాంతం కూడా ఉండేది. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు బందరు, చెన్నపట్టణం రేవులలో నౌకా వాణిజ్యం చేసుకొనడానికి, గిడ్డంగులు నిర్మించుకొనడానికి గోల్కొండ నవాబు నుంచి అనుమతులు పొందడం కోసం, తరచు అప్పుడు గోల్కొండ పాలనలో ప్రముఖ భూమిక పోషించిన అక్కన్న, మాదన్నలను కలిసి బంగారం, విలువైన నజరానాలు సమర్పించుకునేవారు.
ఆంధ్ర – తెలంగాణ రెంటినీ దోచుకున్న నిజామ్
గోల్కొండ రాజ్య సంపదకు, వైభవానికి మూలాధారమైన ‘గోల్కొండ వజ్రాలు’ నాటి గోల్కొండ రాజ్యంలోని అంతర్భాగంగా కృష్ణానదీ తీరంలో ఉన్న నేటి గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కోళ్ళూరు వజ్రాల గనిలో లభించినవే. ప్రఖ్యాతమైన కోహినూర్ ( Koh- i- Noor), దరియా – ఏ – నూర్( Dariya – e – Noor), హోప్(Hope), నిజాం(Nizam), ఆర్లోవ్( Orlov), ‘డ్రెస్ డెన్ గ్రీన్’( Dresden Green) వంటి అత్యంత విలువైన వజ్రాలకు పుట్టినిల్లు కోళ్ళూరు గని కావడం విశేషం.
కోళ్ళూరు వజ్రాల గనిలో సా.శ. 16 వ శతాబ్ది నుంచి సా.శ. 19 వ శతాబ్ది వరకు రోజూ మూడు షిఫ్ట్ లలో వజ్రాల తవ్వకాలు సాగేవి. ఇదికాక అప్పట్లో కృష్ణా తీరంలోని గుంటూరు జిల్లాలో అచ్చంపేట, ఓర్వకల్లు, తాడువాయి, ధరణికోట ప్రాంతాలలో వజ్రాలు, ఇతర విలువైన రంగురాళ్ళు విస్తారంగా దొరికేవి. నదికి ఆవలివైపు కృష్ణా జిల్లా బత్తినపాడు, కునికినపాడు, మున్నలూరు, మాగల్లు, పరిటాల, గని ఆత్కూరు లలో వజ్రాలు, కొడవటికల్లులో పుష్యరాగాలు, మల్లవెల్లిలో పచ్చలూ విస్తారంగా దొరికేవి.
ఈ సంపద కారణంగానే గోల్కొండ రాజ్య ప్రతిష్ఠ జగద్విఖ్యాతమైంది. ఆ తరువాత ఈ ప్రాంతమంతా మొఘల్ ప్రతినిధి అయిన హైదరాబాద్ నిజాం స్వాధీనమయింది. నిజాం నవాబు తన పాలనలో తెలుగు నేల ‘మొత్తాన్నీ నిలువు దోపిడీ చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా పేరు తెచ్చుకున్నాడు. తన జాగీర్దార్లు, మోఖాసాదార్లు, తాబేదార్లుగా వ్యవహరించిన భూస్వాములు, దొరలకు జనాన్ని దోచుకోడానికి అడ్డులేని అధికారాలు కట్టబెట్టిన నిజాం నవాబు పరిపాలనలో గొప్ప నిరంకుశునిగానూ పేరొందాడు.
నిజాం రాజ్యంలోని పేద రైతాంగాన్ని పీల్చి పిప్పిచేసి, వారిని మరింత నిరుపేదలుగా చేయడంలో నిజాంకు హంగుబంట్లు గా వ్యవహరించిన దొరలు, గ్రామాధికారులు, కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల పాత్ర ప్రముఖమైనది. 1768 లో ఉత్తర సర్కారు జిల్లాలనూ, 1788 లో గుంటూరునూ,1800 లో నేటి రాయలసీమతోపాటు బళ్ళారినీ నిజాం నవాబు బ్రిటిష్ వారికి ఒక్కటొక్కటిగా కట్టబెట్టేవరకూ, తెలుగువారంతా నిజాం సంస్థానంలో ఒకే పాలన కిందనే ఉన్నారు.
అప్పటిదాకా ఆంధ్ర ప్రాంత ప్రజలను, అక్కడి రైతులనూ కూడా నిజాం నవాబు యథేచ్ఛగా దోచుకున్నాడు. ఆ తరువాత కూడా ఆంధ్ర ప్రాంతంలో వజ్రాలు, విలువైన రంగురాళ్ళు లభించే పరిటాల, గని ఆత్కూరు వంటి పలు ప్రాంతాలన్నిటినీ నిజాం తన పాలన కిందే ఉంచుకున్నాడు.
తెలంగాణ ప్రాంతంలో నిజాం దారుణ దోపిడీనుంచి, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం 1946 – 51 మధ్య కాలంలో తెలంగాణ పేద రైతులు, అణగారిన వర్గాలు నిజాం, ఆయన తాబేదార్లయిన దొరలకూ, రజాకార్లకూ వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ నేతృత్వంలో నాలుగు వేలమందికిపైగా జనం ప్రాణత్యాగం చేసి గొప్ప సాయుధ పోరాటం సాగించారు.
ఆ మహోజ్జ్వల పోరాటం వెట్టిచాకిరీని నిర్మూలించి, పేదలకు భూ పంపిణీ చేసి, నిజాం పాలన పునాదులను దెబ్బతీశాక మాత్రమే భారత బలగాలు అప్పటికే బలహీనపడి నామమాత్రావశిష్టమైన హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశాయి. నిజాం గొప్పతనాన్ని పొగడే కెసిఆర్& కో ఒక్కసారన్నా సామాజిక న్యాయం కోసం, ఉవ్వెత్తున ఉద్యమించిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని స్మరించరు.
ప్రజలను నిలువుదోపిడీ చేసిన నిజాం, ఆయనకు కొమ్ముకాసిన నాటి దొరలు, రజాకార్ల ఆగడాల మీద ఈగనన్నా వాలనీయరు. నిజాం హంగు బంట్లయిన ఈ దొరలూ, రజాకార్లూ నాటి తెలంగాణ ప్రజలను ఎంతగా పీక్కుతిన్నారో అందరికీ తెలిసిన విషయమే ! వారు ముఖ్యంగా నాటి నిజాం రాజ్యంలోని స్త్రీల పై ఎంత అమానవీయ దాడులు, మానభంగాలు చేశారో బీఅరెస్ నేతలు పేరుకన్నా ప్రస్తావించరు. మరి నాటి దొరల వారసులే కదా నేటి నయా దొరలు !!
నిజాం సంస్థానం మొదట్నుంచీ గొప్ప ధనిక రాజ్యమని వారు గొప్పలు చెపుతారేతప్ప, నిజాం, నాటి దొరలూ, రజాకార్లు చేసిన నిలువు దోపిడీ కారణంగానే తెలంగాణ పేదలు మరింతగా నిరుపేదలయ్యారన్న అసలు నిజం మాత్రం చెప్పరు. నిజాం నవాబు ఆంధ్ర ప్రాంత సంపదనూ, అక్కడి పేదలనూ కూడా నిలువు దోపిడీ చేశాడన్న నిజాన్నికూడా మాటవరసకైనా వారు ప్రస్తావించరు.
గోలకొండ, నిజాం రాజ్యాల వైభవానికి మూలధనమైన సా. శ. 1652 నాటి గండికోట యుద్ధంలో గోల్కొండ సేనాని మీర్ జుమ్లా దోచిన గండికోట సంపదను గురించిగానీ, నిజాం నవాబు పోగేసుకున్న కృష్ణా, గుంటూరు జిల్లాల రత్న సంపదను గురించిగానీ పేరుకన్నా వారు ప్రస్తావించరు. తెలంగాణ వెనకబాటు తనానికి,అక్కడి సబ్బండు వర్గాల ప్రజల దరిద్రానికీ నాటి నిజాం, ఆయన బంట్లయిన నాటి దొరలు, రజాకార్లూ శతాబ్దాలపాటు చేసిన దోపిడీయే ప్రధాన కారణమైనప్పటికీ ఆ విషయం మూసిపెట్టి, ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన ఉద్యోగులు, వ్యాపారులను దోపిడీదారులుగా చిత్రించటంలో మాత్రం బీఆరెస్ నేతలు కృతకృత్యులయ్యారు.
ఇది అసలైన దోపిడీదారులకు కొమ్ముకాస్తూ ఆంధ్ర ఉద్యోగులు, వ్యాపారులు తెలంగాణను దోచేశారని ప్రచారం చేయటమే. తెలంగాణ ప్రజలలో పోరాట పటిమనూ, చైతన్యదీప్తినీ రగిలించిన 1946 – 51 నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్నీ ఏనాడూ మెచ్చుకోకుండా, ప్రత్యేక తెలంగాణ సాధనకోసం 1,200 మంది విద్యార్థులు చేసిన ప్రాణత్యాగాన్ని మాట వరసకైనా ప్రస్తావించకుండా, ప్రొ. కోదండరాం వంటి ఎందఱో సహచర ఉద్యమనేతలను అవమానించి ఉపేక్షించి, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి బలహీనవర్గాల నేతల త్యాగాలను విస్మరించి, తమను గెలిపిస్తే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా తమ పార్టీ దళితుడినే చేస్తుందని ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని తుంగలో తొక్కి దళితులను మోసగించి, కేవలం తాను చావునోట్లో తలకాయపెట్టి చేసిన నిరాహారదీక్ష వల్లనే తెలంగాణ కల సాకారమయ్యిందని ప్రచారం చేసుకుంటూ, పార్టీ మానిఫెస్టో పుస్తకం నుంచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి ఫోటోను తొలగించి, ఆయన స్థానంలో తెలంగాణ జాతిపితగా తనను తాను చిత్రించుకునే ప్రయత్నంచేస్తూ, తన ఏకపక్ష, కుటుంబ పాలనకు అడ్డువస్తారనుకున్న సహచరులనందరినీ తొక్కేసుకుంటూ, చివరికి తమ రాజకీయ స్వప్రయోజనాల సాధన కోసమే అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తెచ్చి తెలంగాణ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికీ చెయ్యిచ్చిన కెసిఆర్ తన తిరుగులేని నియంత పాలనకు తెలివిగా మార్గం వేసుకున్నారు.
‘ఆ నలుగురి’ పదేళ్ళ ఏకపక్ష కుటుంబ పాలన దుష్ఫలితాలను, దోపిడీని తెలంగాణ ప్రజలంతా చవిచూసి, సహించినన్నాళ్ళు కెసిఆర్ నియంత పోకడలను ఓర్పుగా సహించి, సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు.
బీఆరెస్ చేసిన చారిత్రక తప్పిదాలకు వారు తగిన మూల్యం చెల్లించారు. ఎన్నికలు రేపు జరుగుతాయనగా కూడా కృష్ణా నదీజలాల వివాదం మరోసారి తెరపైకి తెచ్చి భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు జగన్ రెడ్డి సహకారంతో వారు చేసిన ప్రయాత్నాలేవీ ఫలించలేదు. చైతన్యవంతులైన తెలంగాణ ఓటర్లు బీఆరెస్ ను దెబ్బ మీద దెబ్బ వేసి, వారుండాల్సిన స్థానమేదో వారికి చూపించారు.
– ముత్తేవి రవీంద్రనాథ్
చరిత్ర పరిశోధకుడు