– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పుట్టపర్తి/శ్రీ సత్యసాయి : పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో రాయలసీమలోని ప్రతి ఎకరాకూ నీరందుతుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. రెడ్స్, ఇన్ఫోసిస్ సంస్థల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రైతులకు పండ్లు మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాయలసీమలో తాగు, సాగునీరు అందించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిదేనన్నారు. 3,900 కోట్ల చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుతో రాయలసీమలో తాగు, సాగునీరు అందుతోందన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాయలసీమలో ప్రతి ఎకరాకూ నీరు అందుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే లా పాలన సాగిస్తోందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఉచిత ఇసుక, మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల అందజేస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించామని, ఈనెలలోనే అన్నదాత సుఖీభవ నిధులు మంజూరు చేస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని వెల్లడించారు.
గుక్కెడు నీళ్లివ్వని జగన్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాయలసీమకు ఎంతో మేలు కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమను జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. రాయలసీమలో నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకపోగా, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోలేదన్నారు.
చిరుధాన్యాలతో ఆరోగ్యం
ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను రోజూ ఆహారంగా తీసుకోవాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. చిరుధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు భేష్
స్వచ్ఛంద సేవా సంస్థలు సేవా దృక్పథంతో రైతులకు పండ్ల మొక్కలు పంపిణీ చేపట్టడం అభినందనీయమని ఆయా సంస్థల ప్రతినిధులను మంత్రి సవిత కొనియాడారు. ఇన్ఫోసిస్, రెడ్ సేవా సంస్థల బాటలో మరిన్ని సేవా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.