– మా పిల్లలకు ఏ కుల సర్టిఫికెట్ ఇస్తారు?
– మా పిల్లల చదువులు ఆగిపోతున్నాయి
– ఏ పథకమూ మా ఇంటికి రావడం లేదు
– గిన్నె పట్టుకొని అడుక్కోవాల్సి వస్తుంది
– తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో బుడగ జంగం ఎస్సీ కేటగిరీలో ఉన్నారు.
– మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపండి
– కూటమి ప్రభుత్వానికి బుడగ జంగం కులస్థుల అభ్యర్థన
పెదకాకాని: ఆంధ్రప్రదేశ్ కు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలలో బుడగజంగాలు ఎస్సీ క్యాటగిరిలో ఉన్నారు. ఆంధ్రాలో ఉన్న బేడ బుడగ జంగాలు ఎస్సీ కేటగిరి కాదా? అని ఆ వర్గం విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు ఆ కులం పెద్దలు ప్రభుత్వానికి ఇలా అభ్యర్థిస్తున్నారు.. అయ్యా! మాది పెదకాకాని మండలం, వెనిగండ్ల బుడగ జంగాల కాలనీ. మా తాత, ముత్తాతలు తెలంగాణ నుండి గుంటూరు జిల్లాలో వలస వచ్చి 1979 లో ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో స్థిరపడిపోయారు. అప్పటినుండి రాజ్యాంగం ప్రకారం 61ఎస్సీ కులాలలో సంఖ్య 9వ, నెంబర్ లో మా బేడ బుడగ జంగం కులం ఉంది. మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగం కులం ఎస్సీ కుల సర్టిఫికెట్లు ఇచ్చేవారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాకు బుడగ జంగం ఎస్సీ కుల సర్టిఫికెట్లు ఇవ్వడం ఆపేశారు. దీంతో అప్పటి నుండి మా పిల్లలు కుల సర్టిఫికెట్లు లేకపోవడంతో విద్యకు దూరమవుతున్నారు.
మనకు ఏ కుల సర్టిఫికెట్లు ఇస్తారు? చదవాలా…వద్దా.. ఏ కులం కింద వస్తాం చెప్పాలని మా పిల్లలు ఆందోళన చెందుతున్నారు. మాకు సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రభుత్వ పథకాలు రావడం లేదు… పిల్లలు చదువుకోవాలన్న కుల సర్టిఫికెట్ లేదు. ఇంతకీ మా కులం ఏ క్యాటగిరీలో చేర్చారు. మేం చదువుకోవడానికి ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ మార్గం రూపాలని బేడ బుడగ జంగం వారు వేడుకుంటున్నారు.