– మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలే నిదర్శనం
– మండిపడ్డ మేయర్ భాగ్యలక్ష్మి
తాడేపల్లి: ఎన్నికలకు ముందు ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఆశపెట్టి, నేడు ఆ పథకానికే ముగింపు పలికేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ సిద్ధమైందని విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె బుధవారంమీడియాతో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నామని పరోక్షంగా ప్రకటించడం ద్వారా మహిళలను మానసికంగా సిద్దం చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది మహిళలను నమ్మించి వంచించడానికి చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే…
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోగా ఒక్కో పథకాన్ని ఎత్తేసే కుట్రలకు ప్రభుత్వం తెరదీస్తోంది. మోసపు హామీలిచ్చి మహిళల ఓట్లతో గెలిచిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వంచనకు గురిచేస్తున్నాయి. ఓట్ల కోసం మహిళలను నమ్మించేందుకు ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకొచ్చి ఫేక్ బాండ్లతో ప్రచారం చేసుకున్నారు. వైయస్ జగన్ ఇస్తున్న పథకాలను ఇస్తూనే సూపర్సిక్స్ అమలు చేస్తామని పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్ నమ్మబలికారు.