– రసాయన వ్యర్ధాలను సముద్రంలోకి పంపుతున్న ఓ వైసీపీ ఎంపీ ఫార్మా కంపెనీ?
– వైసీపీ హయాంలో చక్రం తిప్పిన వైసీపీ ఎంపీ కంపెనీ
– కూటమి అధికారంలోకి వచ్చినా అదే హవా
– దానికి ఉన్న కెపాసిటీ ఎంత? విడుదల చేస్తున్న లిక్విడ్ సాలిడ్ ఎంత?
– సముద్రంలోకి వెళ్లే పైప్లైన్లను పీసీబీ తనిఖీ చేస్తోందా?
– పీసీబీ అధికారులు సర్టిఫై చేస్తేనే సముద్రంలోకి వ్యర్ధాల విడుదల
– ఇప్పటికే చచ్చిపడుతున్న సముద్రంలోని లక్షల చేపలు
– విగతజీవులై ఒడ్డుకు కొట్టుకువస్తున్న తాబేళ్ల గుట్టలు
– తాబేళ్ల మృతిపై గతంలో తల్లడిల్లిన డీసీఎం పవన్ కల్యాణ్
– విచారణకు ఆదేశించినా దిక్కులేని దుస్థితి
– ఇప్పటికే తాబేళ్ల మృతిపై మీడియాలో కథనాల వెల్లువ
– సముద్రంలోకి విడుదల చేస్తున్న విష వ్యర్ధాలే దానికి కారణమంటున్న పర్యావరణ ప్రేమికులు
– కొరడా ఝళిపించకుండా కళ్లప్పగించి చూస్తున్న పీసీబీ అధికారులు
– కొందరు పీసీబీ అధికారుల దన్నుతోనే విషపదార్ధాలు సముద్రంలోకి?
– అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ ఎంపి గారి కంపెనీదే హవా
– కూటమి అధికారంలో ఉన్నా ఆ కంపెనీపై కన్నేసేందుకు భయమే
– వైసీపీ ఎంపీ కంపెనీకి సహకరిస్తున్న ఆ పీసీబీ అధికారులెవరు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
విశాఖ సముద్ర జలాలు విషతుల్యమవుతున్నాయా? వైసీపీకి చెందిన ఓ ఎంపి గారి కంపెనీ పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ చేయకుండా, పైప్లైన్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న వ్యర్థ లిక్విడ్‌తో లక్షలాది చేపలు మరణిస్తున్నాయా? సదరు వైసీపీ ఎంపీ గారి కంపెనీ దెబ్బకు, అరుదైన తాబేళ్లు వందల సంఖ్యలో విగతజీవులుగా ఒడ్డుకు కొట్టుకు వైనంపై.. డిప్యూటీ సీఎం, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేసినా ఫలితం లేదా? అసలు సదరు కంపెనీ వివిధ ఫార్మా, ఇతర కంపెనీల నుంచి తీసుకుంటున్న వ్యర్థ లిక్విడ్ ఎంత? సముద్రంలోకి విడుదల చేస్తున్న లిక్విడ్ ఎంత? వాటి తేడాలను పీసీబీ అధికారులు ఏనాడైనా తనిఖీ చేశారా? సముద్రం లోపలకు ఎన్ని కిలోమీటర్లమేర పైప్‌లైన్ ఉందన్న కీలక అంశాలపై, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేశారా? చివరకు పవర్ఫుల్ మినిస్టర్‌గా పేరున్న పవన్ కల్యాణ్‌ను సైతం, సొంత శాఖ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారా?.. ఇదీ ఇప్పుడు విశాఖవాసులు- కార్మిక సంఘాలు జమిలిగా సంధిస్తున్న ప్రశ్నలు.
విశాఖ జిల్లా పరవాడ చుట్టూ దాదాపు 100 కెమికల్ కంపెనీలున్నాయి. ఈ కంపెనీలు విడుదల చేసే వ్యర్థాలను రెండు పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేసే వ్యాపారం ఒకటి, వైసీపీ ఎంపీకి చెందిన ఓ ఎంపీ గారి కంపెనీ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభించింది. ఇప్పుడు ఆ కంపెనీ ఆ రంగంలో రారాజు. ఏ కంపెనీ సొంతంగా తన వ్యర్ధాలను తరలించే వెసులుబాటు లేదు. ఎవరైనా ఎంపి గారి కంపెనీకి అప్పగించి, వారు చెప్పిన ధర చెల్లించాల్సిందే. ఆ ప్రకారంగా లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సిఇటిపి) చేసి, ఆయా నిష్పత్తిలో ట్రీట్మెంట్ చేసి సముద్రంలోకి వదిలేందుకు, సదరు వైసీపీ ఎంపి గారి కంపెనీ.. ఆ వంద కెమికల్ కంపెనీల నుంచి ఫీజుగా భారీ రుసుము వసూలు చేస్తుంటుంది.
అదేవిధంగా మరొకచోట భూమిలో సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రకియలో భాగంగా.. లేయర్ల పద్ధతిలో పూడ్చిపెట్టేందుకు, అదే వైసీపీ ఎంపీగారి కంపెనీ అనుమతి తీసుకుంది. అందుకు ప్రభుత్వం భూమి కూడా కేటాయించింది. వాటిని కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాత, వ్యర్ధాలను కె మికల్స్ను కలిపి పూడ్చిపెట్టాలి. అందుకు టన్నుకు ఇంత చొప్పున కంపెనీల నుంచి వసూలు చేస్తుంటుంది.
అయితే పీసీబీ.. సదరు ఎంపి గారి కంపెనీకి అనుమతించిన క్వాంటిటీ ఎంత? ఇప్పటివరకూ సదరు ఎంపీ గారి కంపెనీ పూడ్చింది ఎంత? నిజానికి వ్యర్ధాలను పూడ్చేముందు వాటిని న్యూట్రలైజ్ చేసే పద్దతి ఉంది. అయితే వీళ్లు ఎంత మేరకు న్యూట్రలైజ్ చేస్తున్నారని తనిఖీ చేసేది ఎవరు? తగినవిధంగా న్యూట్రలైజ్ చేయకపోతే పర్యావరణానికి పూర్తి హానికరం. దానివల్ల పరిసర ప్రాంతాల్లోని నేల, నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జనావాసాల మధ్య ఇది ఉంటే ఇంకా ప్రమాదం. ఇటీవల జరిగింది అదే. భూమిలో పాతిపెట్టిన వైనంపై ఫొటోలతో సహా వార్తలు రావడంతో, హడావిడిగా వాటిని జెసిబీలతో శుభ్రం చేయించింది. వ్యర్ధజలాలను శుద్ధి చేసే కార్యక్రమం కూడా ఎంత కఠినంగా అమలుచేసి, వాటిని సముద్రంలోకి పంపిస్తున్నారని తనిఖీ చేసేది ఎవరని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రధానంగా విశాఖ జిల్లాకు చెందిన ఓ పీసీబీ అధికారి ఇటీవలి కాలంలో అచ్యుతాపురం లో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా, ఓ కంపెనీకి కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సిఎఫ్ఓ) మంజూరు చేసిన వైనం పలు విమర్శలకు కారణమవుతోంది. నిజానికి పీసీబీ సిఎఫ్ఓ ఇస్తేనే కంపెనీలు ఆపరేట్ చేసుకుంటాయి. వాటికి ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ లభిస్తుంది. అయితే సదరు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కయిన ఒక అధికారి, ఆ కంపెనీకి ఎలాంటి సదుపాయాలు లేకపోయినా, లైసెన్స్ మంజూరు చేసిన వైనంపై కార్మిక సంఘ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పది ఎకరాలు ఏపిఐసిసి నుంచి తీసుకున్న సదరు కంపెనీ ఇంతవరకూ ప్రారంభం కాకపోవడమే వింత.
పీసీబీ ఎన్విరాన్మెంటల్ మాజీ ఇంజనీరు ఒకరు, దీనికి లైసెన్స్ ఇప్పించినట్లు పీసీబీలో ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై చర్యలు తీసుకోవలసిన ప్రస్తుత అధికారులు కూడా గుడ్డిగా సిఎఫ్ఓ మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారికి విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలోని కొందరు కీలక వ్యక్తులు, రిటైరయిన అధికారుల దన్ను కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అంటే ఆ వంద కెమికల్ కంపెనీల నుంచి తీసుకునే విష వ్యర్ధాలను.. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడి), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడి)లను పరిశీలించి.. తర్వాత వాటిని అవసరమైన మోతాదులో ట్రీట్మెంట్ చేసి, పైప్లైన్ల ద్వారా సముద్రంలోకి పంపాల్సి ఉంది. ఇదీ నిబంధన. ప్రభుత్వం కూడా ఈ నిబంధనల మేరకే, సదరు ఎంపి గారి కంపెనీకి అనుమతి ఇచ్చింది. అప్పటినుంచి విశాఖలో ఆ ఒక్క కంపెనీ మాత్రమే ఈ రంగాన్ని శాసిస్తుండటం విశేషం.
వైసీపీ కంపెనీ గారి కంపెనీ రూటే సెప‘రేటు’
సహజంగా ఒక కంపెనీ ఉత్పత్తి చేసే వస్తువుకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటే.. దానికి పోటీగా మరికొన్ని కంపెనీలు ముందుకు వస్తుంటాయి. కానీ విశాఖలో మాత్రం దానికి భిన్నమైన పరిస్థితి. ఇన్నేళ్లలో సదరు వైసీపీ ఎంపి గారి కంపెనీకి పోటీగా, దశాబ్దాల నుంచి ఒక్క కంపెనీ కూడా ముందుకురావడం లేదంటే.. అధికార-ప్రతిపక్ష పార్టీలలో ఆయన హవా ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
సహజంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కంపెనీల లొసుగులను ఆధారం చేసుకుని, అధికార పార్టీ వివిధ రూపాల్లో దాడులు చేసి.. పెనాల్టీ వేయడమో, సీజ్ చేయడమో చేస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మైనింగ్లలో, కొన్ని దశాబ్దాల నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. విపక్ష పార్టీలకు చెందిన వారి క్వారీలపై వందల కోట్లలో పెనాల్టీలు వేయడం, సీజ్ చేయడం, వారు విధిలేక అధికార పార్టీలో చేరుతున్న పరిస్థితి కొనసాగుతోంది.
కానీ విచిత్రంగా విశాఖ జిల్లా పరవాడ సహా ఇతర పారిశ్రామికవాడల్లో మాత్రం, వైసీపీ ఎంపీగారి ఈ కంపెనీపై ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం పెనాల్టీ విధించడం గానీ, తనిఖీలు చేయకపోవడం గానీ లేదంటే.. సదరు ఎంపి గారి పలుకుబడి ఎంతన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అంటే పీసీబీలో ఎంపి గారి కంపెనీ ఏ స్ధాయిలో పాతుకుపోయిందో అర్ధమవుతూనే ఉంది.
సీఓడీ కథ ఇదీ
సదరు ఎంపి గారి కంపెనీలో తమకు వివిధ కంపెనీల నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చిన లిక్విడ్ శాంపిల్స్‌ను తీసుకుని.. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ)-బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ) పరిమితులు పూర్తిగా తగ్గించి, పరిమితిలోనే ఉన్నట్లుగా చూపించే బాధ్యత ఒకరిది. దానిని అనుమతించే అధికారి మరొకరు. ఇవన్నీ పూర్తిగా ప్రతినెల పర్యవేక్షించే బాసు ఒకరు. ఇద్దరు కృష్ణులు, ఒక వెంకటేశ్వరుడు. ఇదీ సదరు కంపెనీలో సీఓడీ కథ!
పరవాడలో పాతేసిన ఆ ఘటనపై పీసీబీ విచారణ ఏదీ?
పరవాడ ఫార్మా సిటీలో రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో ఫార్మా-నాన్ ఫార్మా పరిశ్రమల ద్వారా వచ్చిన హజార్డస్ వేస్ట్‌ను పీసీబీ ధృవీకరించిన ప్రాంత ంలో కాకుండా.. అన్లోడ్-ప్రాసెస్ జరుగుతున్న వైనంపై స్థానికులు, కార్మిక సంఘాలు చేసిన ఆందోళనపై పీసీబీ అధికారుల విచారణ ఏమైంది? దానిపై ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై ఇప్పటికీ సమాచారం లేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
ల్యాండ్‌ఫిల్‌లో సదరు ఎంపి గారి కంపెనీ నిబంధనలు పాటించకపోవడంపై స్థానిక ప్రజలు, సమీపంలోని రైతులు ఇబ్బందిపడుతున్నారన్న ఫిర్యాదులపై పీసీబీ ఏం చర్యలు తీసుకుందన్న ప్రశ్నలకు, ఇప్పటిదాకా పీసీబీ నుంచి సమాధానం కరవు. ఇన్సెనరేషన్ (వ్యర్ధాలను తగలబెట్టే ప్రక్రియ) పేరు మీద తీసుకున్న వేస్ట్ ఇన్సెనరేషన్ చేయకుండా, ల్యాండ్‌ఫిల్‌లో వేస్తున్నారన్న కార్మిక సంఘాలు, స్థానికుల ఆందోళనను పీసీబీ అధికారులు పట్టించుకోకుండా… ఎంపి గారి కంపెనీకి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.