– అప్పుడు అదానీ మీటర్లు వద్దన్న కూటమి
– ఇప్పుడెందుకు పెడుతోంది
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి హెచ్ బాబూరావు
గుంటూరు : ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన నారా లోకేష్, టీడీపీ కూటమి సర్కారు గతంలో అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి హెచ్ బాబూరావు ప్రశ్నించారు.
నగరంలోని పాతగుంటూరు బాలాజీ నగర్ లో సీపీఎం ఆధ్వర్యంలో అదానీ స్మార్ట్ మీటర్లు వద్దంటూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన టీడీపీ నేడు అధికారంలోకి వచ్చిస్మార్ట్ మీటర్లు వేగంగా ఏర్పాటు చేస్తూ ప్రజలపై భారాలు మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని పేర్కొన్నారు.
ఇప్పటికే ట్రూ అప్, సర్దుబాటు చార్జీలతో విసిగిపోయిన ప్రజలు అదానీ ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఆగస్టు 5 వ తేదీన జరిగే పోరాటంలోనూ ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రజాసంఘాలు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ కమిటీలు ఆధ్వర్యంలో అధికారులకు సామూహిక రాయబారాలు, విద్యుత్ భారాల వ్యతిరేక ఆందోళనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బిల్లులు పెరిగాయని,స్మార్ట్ మీటర్లు మోసపూరితంగా అనుమతి లేకుండా బిగిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్, సీఐటియూ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీ నారాయణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు లక్కా అరుణ, బి ముత్యాలరావు, యం ఎ చిష్టీ, నగర కార్యదర్శివర్గ సభ్యులు కె శ్రీనివాసరావు, నగర కమిటీ సభ్యులు షేక్ ఖాశిం షహీద్, ఎ కళ్యాణి, షేక్ అబ్దుల్ సలీమ్, పాత గుంటూరు శాఖ కార్యదర్శి కార్తీక్, సభ్యులు కె గంగాధరరావు, కె సుధీర్, జె నాంచారయ్య, ఆది నికల్సన్, ఫణీంద్ర కుమార్, కె సునీత తదితరులు పాల్గొన్నారు.