– విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహించే వారు ఉన్నారా?
– ప్రజలు మానవ బాంబుల్లా జీవిస్తున్న పరిస్థితి
– బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పాలనా తీరును బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. అవినీతి, డ్రగ్స్, కల్తీ పదార్థాలు.. ఇవే కాంగ్రెస్ పాలన యొక్క నిజ స్వరూపాలుగా మారాయని ఆయన చెప్పారు. పాలన అనే భావననే ప్రజలు మరిచిపోయే స్థితి ఏర్పడిందని, ప్రతి వారం రాష్ట్రంలో ఏదో ఒక ఆశ్రమ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రుల పాలవుతున్న దుస్థితి దారుణమని వ్యాఖ్యానించారు.
ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పదే పదే జరుగుతున్నాయని, విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహించే వారు ఉన్నారా? అనే సందేహం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలు ఇప్పుడు మానవ బాంబుల్లా జీవిస్తున్న పరిస్థితి ఏర్పడిందని, ఇవి వెలుగులోకి వచ్చినవే తప్ప, వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో ఉండే అవకాశం ఉందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యపానమే ఆదాయ వనరుగా మలుచుకుంటోందని ఆరోపించారు.
ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రమాదంలో పడుతుండగా, విద్యార్థుల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మత్తు వ్యాపారానికి, కల్తీ పాలనకు ఒకే ఒక పరిష్కారం ఉందని, అందుకు బిజెపి యే విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు వస్తుందని స్పష్టంగా తెలిపారు.
తెలంగాణలో ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పాలనా వ్యవస్థ నియంత్రణ కోల్పోయిందని, విజిలెన్స్ శాఖ నామమాత్రంగా మాత్రమే మిగిలిందని మండిపడ్డారు.
అధికార పార్టీ నేతలతో పిచ్చాపాటి మాట్లాడినా “ఢిల్లీకి కూడా కట్టాలి కదబ్బా” అనే మాటలు వినిపిస్తున్నాయంటే.. పరిపాలన ఎంత కలుషితమైందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పరిపాలన మొత్తం కల్తీ మయం అయిందని, మద్యం మయం అయిందని, డ్రగ్స్ మయం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు కల్తీ విత్తనాలు పంపిణీ అవుతుండగా, ప్రజల ఆరోగ్యాలు కల్తీ ఆహారంతో ప్రమాదంలో పడుతున్నాయని తెలిపారు. ఈ కల్తీ విత్తనాల వ్యవహారం కూడా త్వరలో బయటపడుతుందని చెప్పారు. అసలు ముఖ్యమంత్రి ఎవరి కోసమే పనిచేస్తున్నాడో ప్రజలకు అర్థం కావడం లేదని, దేనికోసం ఇప్పటికీ పదవిలో ఉండాలనుకుంటున్నాడో చెప్పాలని ఎన్.వి.ఎస్.ఎస్. డిమాండ్ చేశారు. బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రెండు గంటలపాటు ప్రజల వినతిపత్రాలను స్వీకరించామని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తెలిపారు.
మరోవైపు జీహెచ్ఎంసీ అసలు ఉందా లేదా అనే అనుమానం కలిగేలా పరిస్థితి ఉందని ఎన్.వి.ఎస్.ఎస్. అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్ మోకాళ్ళ లోతు నీటిలో మునిగిందని, గతంలో తండ్రి-కొడుకులు పురపాలక మంత్రులుగా ఉన్నా మారలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నా అదే దుస్థితి కొనసాగుతోందని విమర్శించారు.