– రాజధానిలో యాన్యుటీ పేచీలు
– తనిఖీ పేరుతో కౌలు నిలిపివేత
– మరణధృవీకరణతో నాలుగేళ్లు ఇచ్చిన అధికారులు
– ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశం
– మ్యుటేషన్ దారులకు కౌలు నిలిపేసిన అధికారులు
రాజధానిలో యాన్యుటీ(భూములిచ్చిన రైతులకు ఇచ్చే వార్షిక కౌలు) చెల్లింపులో 11 ఏళ్ల తరువాత సిఆర్డీఏ పేచీలు పెట్టింది. మరణధృవీకరణలు చెల్లవని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇస్తేనే చెల్లింపులు చేస్తామని ఇప్పుడు మెలిక పెట్టారు. దీంతో సుమారు 11,868 మందికి అండర్ ప్రాసెస్ అని చెబుతూ పెన్షన్లు నిలిపేశారు.
భూములు కుటుంబ సభ్యుల మధ్య వాటాలు పంచుకుని మ్యులేషన్ అయిన తరువాత వాస్తవ ఓనర్ కే పెన్షన్లు వేస్తామని చెప్పి వారసులకూ యాన్యుటీ నిలిపేశారు. దీనిపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కౌలు ఆలస్యంగా వేస్తున్నారని, 11 ఏళ్ల తరువాత ఇప్పుడు కొత్తగా ఈ సమస్య ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తులకు సంబంధించి మరణధృవీకరణపత్రం గ్రామాల్లోని కాంపిటెంట్ అధారిటీ అధికారులకు సమర్పిస్తే కౌలు వేశారని, నాలుగేళ్ల తరువాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అడగడం ఏమిటని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన కౌలు ఐకాయిల్లో ఈ ఏడాది బకాయిలు రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామని సీఆర్ఏ అధికారులు ప్రకటించారు.
తొలిదశలో 21,560 మందికి బకాయిలు వేయగా బ్యాంకు వివరాలు సరిగా లేవని 725 మందికి పెండింగ్ పడింది. మిగిలిన 11,868 మందికి రెండోదశలో యాన్యుటీ చెల్లిస్తామని పేర్కొన్నారు. రెండోదశ కోసం ఎదురు చూస్తున్న సమయంలో వేర్వేరు కారణాలతో చెల్లింపులు నిలిపినట్లు అండర్ ప్రాసెస్ పేరుతో పెండింగ్‌లో వారందరికీ పెండింగ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. వీరిలో ఎక్కువమంది భూములిచ్చిన వాస్తవ యజమాని చనిపోయిన అతని తాలూకూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వలేదనే కారణాన్ని సిఆర్డిఏ అధికారులు చెబుతున్నారు.
ముందే చెప్పి ఉంటే ఇచ్చేవాళ్లమని, నాలుగేళ్ల తరువాత ఈ పేచీ ఎందుకు పెట్టారో చెప్పాలని రైతులు కోరుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య భాగస్వామ్యవాటాలు పంచుకున్న వారికి సంబంధించిన ఖాతాలకూ డబ్బులు జమ చేయడం లేదని అధికారులు తెలిపారు. దీనిలోనూ న్యాయపరమైన సమస్యలు ఉన్నందున వాస్తవ యజమాని తాలూకా వివరాలూ, మ్యుటేషన్ వివరాలూ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
వీరితోపాటు భూములు కొనుగోలు చేసిన వారు వాస్తవ యజమాని నుండి సంబంధిత ధృవీకరణ పత్రం ఇవ్వలేదని, అందువల్లే నిలిపేశామని తెలిపారు. వాస్తవంగా ఇలా కొనుగోలు చేసిన వారికి గత ఆరేళ్లుగా యాన్యుటీ వేస్తూనే ఉన్నారు. ఇ ఏడాది పేచీ పెట్టారు.
విచారణ పూర్తయిన అనంతరం లబ్దిదారులను పరిశీలించి అందరికీ కౌలు చెల్లిస్తామని సిఆర్డీఏ కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. అండర్ ప్రాసెస్‌లో ఉన్న వాటిల్లో 50 వరకూ ఈ ఏడాది పూలింగుకు ఇచ్చిన వారి వివరాలూ పొందుపరిచారు.
– వల్లభనేని సురేష్
(సీనియర్ జర్నలిస్టు)
9010099208