– పొలాల్లో విషం నింపుతున్న కెమికల్ కంపెనీలు
– కెమికల్ కంపెనీ అరాచకాలపై సమీక్షలేవీ?
– పొల్యూషన్ ధిక్కారం పవన్‌కు పట్టదా?
– అనకాపల్లి కంపెనీతో ఎమ్మెల్యేల కుమ్మక్కు
– జక్కంపూడి గ్రామంలో 15 ఎకరాల్లో కెమికల్ వేస్ట్‌ను కుమ్మరించిన అనకాపల్లి కంపెనీలు
– లారీకి 25 వేలు ఇచ్చి పొలాలను విషంగా మారుస్తున్నారు
– సీజ్ చేసిన ఆ కంపెనీలను తెరిపించేందుకు రాయబేరాలు
– నష్టం 7 వేల టన్నులయితే 500 టన్నులతోనే సరిచేయించే కుట్ర
– నష్టం తక్కువగా చూపించే కుట్రలు అడ్డుకుంటాం
– రైతులకు న్యాయం చేయాల్సిందే
– క్రెబ్స్, కేకేఆర్ పారబోసిన జక్కంపూడి పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: కూటమి పాలనలో పచ్చటి పంట పొలాలను విషతుల్యం చేస్తున్న కెమికల్ కంపెనీలకు ఎమ్మెల్యేలు అండగా నిలిచి రైతుల పొట్టకొడుతున్నారని విజయవాడ మాజీ ఎమ్మెల్యే, ప్లానింగ్‌బోర్డు మాజీ వైస్ చైర్మన్ మల్లాది విష్ణు ఆరోపించారు.
రైతుల పొలాల్లో కెమికల్ విషం కుమ్మరిస్తున్న కెమికల్ కంపెనీపై కొరడా ఝళిపించాల్సింది పోయి, వారితోనే కుమ్మక్కవుతున్న కుట్రలను త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని విష్ణు వెల్లడించారు.
జనవరిలో అనకాపల్లికి చెందిన క్రిబ్స్ కెమికల్ కంపెనీకి చెందిన వ్యర్ధరసాయనాలను కేకేఆర్ అనే మరో కంపెనీ జక్కంపూడికి తీసుకువచ్చి, వాటిని 15 ఎకరాల విస్తీర్ణంలో పారబోసిందని విష్ణు మీడియాకు వెల్లడించారు. ఆ మేరకు పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారన్నారు. దానితో పీసీబీ ఆ కంపెనీలను సీజ్ చేసిందని వివరించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణు ఈ సందర్భంగా జక్కంపూడికి వెళ్లి, కెమికల్ వల్ల నష్టపోయిన పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమక్షంలోనే ఏసీపీకి అక్కడి నుంచే ఫోన్ చేయగా, వారిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు విష్ణుకు వివరించారు. ఒక్కో లారీకి 25 వేలు తీసుకుంటున్నారని తమ విచారణలో తేలిందని ఆయన విష్ణుకు వివరించారు.
కెమికల్ వ్యర్ధాలను తరలించేందుకు ఒక్కో లారీకి 25 వేలు తీసుకుంటున్న కంపెనీ, వాటిని శాస్త్రీయ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసి డిస్పోజ్ చేయకుండా, ఈవిధంగా పచ్చటి పొలాల్లో పారబోయడం వల్ల భవిష్యత్తులో అక్కడ ఒక మొక్క కూడా మొలిచే అవకాశం ఉండదని, ఫలితంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆవిధంగా సీజ్ చేసిన క్రెబ్స్, కేకేఆర్ కంపెనీలను తిరిగి తెరిపించేందుకు రాయబారం నడుపుతున్నారని, అందులో భాగంగా ఇటీవల జరిగిన చర్చల్లో భారీగా ముడుపులు ముట్టాయన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఇందులో జనసేన సీనియర్ ఎమ్మెల్యే, పీసీబీలోని కీలక వ్యక్తి పేరుతో డీల్ జరిగిందని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
జక్కంపూడిలో కెమికల్ వ్యర్ధాల వల్ల దాదాపు 7 వేల టన్నుల మేర పొలాలకు నష్టం జరిగిందని, ఆ మేరకు వాటిని తొలగించాల్సి ఉందన్నారు. అయితే రాయబారంతో దానిని కేవలం 500 టన్నులకు కుదించి నష్టనివారణ చేపట్టేందుకు పీసీబీ ఉన్నతాధికారులు అంగీకరించారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. క్రెబ్స్-కేకేఆర్ కంపెనీ వల్ల జరిగిన మొత్తం 7 వేల టన్నులను శుద్ధి చేసి, ఎకరానికి 5 లక్షల నష్టపరిహారం ఇప్పించే బాధ్యత పీసీబీ అధికారులదేనని విష్ణు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తాను సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాస్తానని చెప్పారు.
కెమికల్ వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా జనావాసాలు, పొలాల్లో పారబోస్తున్న కెమికల్ కంపెనీల ధిక్కారంపై మీడియాలో వార్తా కథనాలు వస్తున్నా, డిప్యూటీ స్పీకర్ పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతాయన్నారు. ప్రతిదానికి తాటతీస్తానని హెచ్చరించే పవన్ కల్యాణ్, ె మికల్ కంపెనీల అరాచకాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. జక్కంపూడి అంశంలో తాము రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. కంపెనీ యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విష్ణు డిమాండ్ చేశారు.