– 6 న మహా ధర్నా
– రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం
విజయవాడ: స్థానిక ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని పెద్ద కంపెనీలకు కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు.. లూలూ కంపెనీకి మేలు చేస్తూ విజయవాడకు, రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం హాని చేస్తోందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బాలోత్సవ భవన్ లో విజయవాడ పౌరవేదిక ఆధ్వర్యంలో గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నగర ప్రముఖులు, సామాజికవేత్తలు, న్యాయవాదులు, మేధావులు ఆర్టీసీ, ఇతర కార్మిక ఉద్యోగ సంఘ నేతలు, వ్యాపార వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పౌర, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని, మాట్లాడారు.
స్థానిక వ్యాపారాలను దెబ్బతీసి లులు సంస్థకు సర్కార్ జయ్ కొడుతోంది… విజయవాడ నగర ప్రణాళిక బద్ధమైన అభివృద్ధిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. విజయవాడను, స్థానిక వ్యాపారాలను, ఆర్టీసీని, ప్రభుత్వ స్థలాలను కాపాడుకుంటాం.. ఆర్టీసీ, ప్రభుత్వ స్థలాల జోలికి.. ప్రభుత్వం , లులు వస్తే అడ్డుకుంటాం, విజయవాడ నగరాన్ని పరిరక్షించుకుంటామని వారు శపథం చేశారు. ఈ సందర్భంగా పౌర వేదిక ఆధ్వర్యంలో “ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ” ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఆగస్టు 6వ తేదీన పాత బస్టాండ్ వద్ద మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.
మాజీ మంత్రి, రైతు నేత వడ్డే శోభనాద్రిశ్వరరావు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్, ఆర్టీసీ ఉద్యోగ నేతలు పి.దామోదర్, సుందరయ్య, జన చైతన్య వేదిక నేత లక్ష్మణ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు, పౌర సంఘాల నేతలు సిహెచ్.బాబురావు, డి.కాశీనాథ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కమిటీకి సుంకర రాజేంద్రప్రసాద్ కన్వీనర్ గా ఎన్నికయ్యారు.
విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండ్ 4.17 ఎకరాల స్థలం, విశాఖపట్నంలో 13.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని లులు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకు లీజుకు ఇస్తూ విడుదల చేసిన 137 జీవో రద్దు చేయాలి. ఆర్టీసీ సంస్థను దెబ్బతీసే ఈ ఆదేశాలను ఉపసంహరించాలి. స్థానిక వ్యాపారులను, ఉపాధిని నాశనం చేసే రీతిలో ప్రభుత్వం బడా కంపెనీలకు ప్రోత్సహించడం తగదు అని తీర్మానించింది.
ఈ సమావేశంలో అక్కినేని భవాని ప్రసాద్ (రైతు ప్రముఖుడు), వై కేశవరావు (రైతు నేత), వెంకటేశ్వర రెడ్డి (హోటల్ ఓనర్స్ అసోసియేషన్), జి.ధన శేఖర్(సామాజిక కార్యకర్త) మురహరి (ఆర్టీసీ పెన్షన్ దారుల సంఘం) ముత్తం శెట్టి ప్రసాద్ బాబు (న్యాయవాది), వి.సాంబిరెడ్డి (మాజీ ప్రిన్సిపాల్) బి.రమణ, కె.దుర్గారావు, ఇవి.నారాయణ, (సిఐటియు) బోయి సత్యబాబు, (కార్పొరేటర్), పి.కృష్ణ (యువజన నేత) తదితరులు పాల్గొన్నారు.