– అసెంబ్లీ నా జ్ఞాపకాలు
సుమారు 20 సం.క్రిందట జరిగిన సంఘటన ఇది. ఇక్కడ పొందు పరిచిన ఫోటో తాలూకు సందర్భంలో యాదృచ్చికంగా జరిగింది.
2004 సం. తరువాత వైఎస్సార్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు / శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలను హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ ఇంటర్నేషనల్ స్టేడియం లో ప్రారంభించి వెళ్లారు.
కొద్ది సేపటి తరువాత గౌరవ స్పీకర్ – XI మరియు ముఖ్యమంత్రి -XI జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. సదరు మ్యాచ్ కు నాటి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహా దారుడు & సినీ నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం గారు కామెంటేటర్.
సి.యల్.పి. సిబ్బంది కాబట్టి గౌరవ ప్రజా ప్రతినిధులతో కలిసి క్రికెట్ ఆడే అవకాశం మాకు కూడా కల్పించారు.నేను స్పీకర్ గారి టీమ్ లో వున్నాను. ఇరు జట్లలోని శాసనసభ్యుల్లో 8 మందికి పైగా రంజీ స్థాయి ఆటగాళ్ళు ఉన్నారు.
అయితే నేను ఫాస్ట్ బౌలర్ గా వేసిన బంతులను అప్పటి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా ఎదుర్కున్నారు. ఒక బాల్ బౌన్స్ అయ్యి బాలినేని గారి నుదుటి మీద తగిలి బడబడ రక్తం కారింది. ఆయన వేసుకున్న వైట్ టీ షర్ట్ రక్తం చుక్కల మయం అయ్యింది.
ఆయనకు గాయం అయ్యింది అని తెలుసుకున్న వైఎస్సార్ గారు వెంటనే అక్కడకు చేరుకుంటునట్టు సమాచారం రానే వచ్చింది. ఆ క్షణంలో నాకు మాత్రం 102 కొట్టు కుంటోంది. ఎందుకంటే గాయం అయ్యింది ఎమ్మెల్యే కి. పైగా వైఎస్సార్ గారికి చాలా దగ్గర.
మరో పక్క గ్రౌండ్ లోనే డాక్టర్స్ ఆయనకు ప్రధమ చికిత్స చేసి, అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ పక్కన టివిల్లో స్క్రోలింగ్ వచ్చేస్తోంది ఈ సంఘటన గురించి.
ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలో నా భుజం మీద చెయ్యి వేసి ” ఏం పర్వాలేదు” నేను ఉన్నాను అంటూ నాటి ప్రకాశం జిల్లా సీనియర్ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి ” జీ.వి. శేషు గారు” భరోసాగా నాతో నిలబడ్డారు. కొద్ది సేపటి తరువాత అంబులెన్స్ రానే వచ్చింది. ఆ అంబులెన్స్ ఎక్కబోతున్నారు గాయపడ్డ బాలినేని గారు.
సరిగ్గా ఆ సమయంలోనే జివి శేషు గారు *నన్ను తోడ్కొని బాలినేని గారి దగ్గరకు తీసుకుని వెళ్లారు. అంబులెన్స్ యెక్క బోతున్న “బాలినేని” గారి చెవిలో “జీవి శేషు” గారు ఏదో చెప్పారు.
ఆ మరుక్షణమే బాలినేని గారు నవ్వుతూ నా భుజం మీద చెయ్యి వేసి ” ఏం పర్వాలేదు.. కంగారు పడకు.. ఆటల్లో ఇవన్నీ సహజమే”.. అంటూ అంబులెన్స్ ఎక్కి వెళ్ళారు.
“హమ్మయ్య బ్రతికి పోయానురా” అని మనసులో అనుకుంటూ శేషు గారి కేసి కృతజ్ఞతగా చూసాను. ఆ క్షణంలో నాకు జీవి శేషు గారు కొండంత దేవుడిలా కనిపించారు.
ఈ సంఘటన జరిగిన సరిగ్గా 20 రోజులకీ మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఆ విస్తరణలో ” బాలినేని” గారికి కేబినెట్ బెర్త్ దక్కింది.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ను మీకు చెప్ప బోతున్నాను.
కేబినెట్ విస్తరణ అనంతరం ఓ ఫైన్ మార్నింగ్ ” ” జీవి శేషు” గారు ఓ ముగ్గురు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో నా సీట్ దగ్గరకు వచ్చారు. సీరియస్ గా మొహం పెట్టీ ఏమయ్యా శ్రీనివాస్… సీనియర్స్ అయినప్పటికీ మాకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. దీనికి కారణం నువ్వే.. ఎందుకంటే బాలినేని గారికి వేసినట్టే మాకు బౌన్సర్ వెయ్యి.. అటువంటి గాయం మాకు కూడా లక్ గా కలిసి వచ్చి కేబినేట్ బెర్త్ తగులుతుం దేమో” అని అనగానే మా ఆఫీస్ అంతా నవ్వులతో నిండిపోయింది.
అప్పటి నుండి జీవి శేషు గారితో సహా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు నన్ను చాలా ఆప్యాయంగా చూసేవారు.
ఆ సంఘటన … అప్పటి శాసన సభ్యుల్లో నాకు ఓ చక్కని గుర్తింపు తెచ్చి పెట్టింది అప్పట్లో!
ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నెన్నో.. నా 25 సం.ల సర్వీస్ లో “సిఎల్పీ ఆఫీస్ సిబ్బందిలో ఒకనిగా!
(శ్రీపాద శ్రీనివాస్)