– 11 ఏళ్లలో రైతుల కోసం రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మోదీదే
– రైతులు ఎరువుల కోసమే సబ్సిడీ రూపంలో రూ.11 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేశాం
– కనీస మద్దతు ధర అందించేందుకు 16 లక్షల 35 వేల కోట్లు ఖర్చు చేసిన మోదీ సర్కార్
– కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల 69 వేల 561 కోట్లు జమ
– టెన్త్ బాగా చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు యత్నిస్తా
– సైకిళ్ల పంపిణీకి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం లభిస్తోంది
– దేశంలోని ఎంపీలంతా సైకిళ్ల పంపిణీ గురించి వాకబు చేస్తున్నారు
– ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి మరింతగా కృషి చేస్తా
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
– చొప్పదండిలో సైకిళ్ల పంపిణీ, కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి
– సంజయ్ చేతుల మీదుగా టెన్త్ విద్యార్థులకు సైకిళ్లను అందజేసిన బండి సంజయ్
చొప్పదండి: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం… రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గత 11 ఏళ్లలో రైతుల సంక్షేమం, వ్యవసాయం, అనుబంధ రంగాలకు దాదాపు రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత మోదీ సర్కార్ కే దక్కిందన్నారు. రైతును రారాజు చేయడమే లక్ష్యంగా నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా 9 కోట్ల 70 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.3.89 లక్షల కోట్లకుపైగా సొమ్మును జమ చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తెలంగాణ విషయానికొస్తే 30 లక్షల 80 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.13 వేల కోట్లు జమ చేసినట్టు వివరించారు.
ప్రధానమంత్రి కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసి నుండి కిసాన్ ఉత్సవ్ దివస్ లో చేసిన ప్రసంగాన్ని బండి సంజయ్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం మోదీ బటన్ నొక్కి దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును జమ చేశారు. కరీంనగర్ జిల్లా విషయానికొస్తే… 1 లక్షా 81 వేల 305 మంది రైతుల ఖాతాల్లో 36 కోట్ల 26 లక్షల 10 వేల రూపాయల కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును జమ చేశారు. ఒక్క చొప్పదండి మండలంలోనే 4 వేల 612 మంది రైతుల అకౌంట్లో 92 లక్షల 24 వేల రూపాయలను జమ చేయడం గమనార్హం.
అనంతరం చొప్పదండిలో అదే వేదికపై జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు జిల్లా కలెక్టర్ పమేల సత్పతితోపాటు జిల్లా ఉన్నతాధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
ఈరోజు కాశీ విశ్వనాథుడి ప్రసాదంగా కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును రైతులకు అందజేయడం గొప్ప కార్యక్రమం. దేశవ్యాప్తంగా 9 కోట్ల 70 లక్షల మంది రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు వేయడం మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే ఇంత పెద్ద గొప్ప స్కీం మరొకటి లేదు. ఇది వరల్డ్ రికార్డు. దళారులు, పైరవీలతో పనిలేకుండా నేరుగా ఏటా రూ.6 వేల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
తొలిసారి 2019 ఫిబ్రవరిలో 9 కోట్ల 70 లక్షల మందికిపైగా రైతుల ఖాతాలో జమ చేశారు. నాటి నుండి నేటి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తూ క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధి పైసలను జమ చేస్తున్న ఘనత మోదీగారికే దక్కింది. గత ఐదేళ్లలో 19వ విడతలుగా నిధులను చేసినం. ఇప్పటి వరకు ఈ స్కీం కింద 3 లక్షల 69 వేల 561 కోట్లను రైతుల అకౌంట్లో వేశారు. ఈ రోజు 20వ విడత కింద మరో 20 వేల 834 కోట్ల రూపాయలను 9 కోట్ల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నాం.
తెలంగాణ విషయానికొస్తే ఈ స్కీం కింద 30 లక్షల 80 వేల మందికిపైగా రైతులు లబ్ది పొందుతున్నారు. గత 19 దఫాలుగా ఒక్క తెలంగాణ రైతాంగానికి 13 వేల 8 కోట్ల 29 లక్షల రూపాయల నగదును వారి ఖాతాల్లో నేరుగా జమ చేశాం. ఈరోజు మరో 620 కోట్ల రూపాయలు జమ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఎన్నికలతో, ఓట్లతో సంబంధం లేకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఠంచన్ గా కోట్లాది మంది రైతుల అకౌంట్లో డబ్బును జమ చేస్తున్న ఘనత మోదీ సర్కార్ దే.
టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి అద్బుతమైన స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో చాలా మంది ఎంపీలు ఇదే విషయంపై అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో పేదలను ఆదుకునేందుకు యత్నిస్తా. ప్రభుత్వ పాఠశాలలను మరింతగా అభివృద్ధి చేసేందుకు క్రుషి చేస్తా. వాస్తవానికి సైకిళ్ల పంపిణీ చేయడానికి నిర్మల్ పాదయాత్రలో ఎదురైన అనుభవాలే కారణం. స్కూల్ కు వెళ్లడానికి సైకిల్ లేకపోవడంతో చదువుకు దూరమైన విద్యార్ధి దుస్థితిని చూసిన తరువాతే సైకిళ్లను పంపిణీ చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బాగా చదివి టెన్త్ ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు భవిష్యత్తులో ఇంటర్ విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇకపై మీరంతా తల దించుకుని చదవండి. భవిష్యత్తులో తల ఎత్తుకునేలా ఉద్యోగాలు చేస్తారు. మీ తల్లిదండ్రులు మిమ్ముల్ని పెంచేందుకు ఎన్ని కష్టాలు పడుతున్నారో గుర్తుకు తెచ్చుకుని కష్టపడి చదవండి