నవ తెలంగాణ 10వ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ “ఖబడ్దార్ ” అని ఒక సోదరుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టును సీనియర్లుగా చెప్పుకొనే కొంతమంది జర్నలిస్టులు పొద్దుగాల నుంచి తెగ తిప్పేస్తున్నారు . రాసిన మిత్రుడికి, కాపీ పేస్టులు చేసేవారికి అవగాహన కోసం…..
సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటల్లో మీరు హెచ్చరించేంత స్థాయి తప్పు కనిపించట్లే. జర్నలిజం పరిధి పెరిగి గల్లీ కి డజను మంది జర్నలిస్టులు తయారవుతున్నారు. స్థానిక రాజకీయాల్లో వాళ్లే. అక్రమ దందాల్లో వాళ్లే. అన్నదమ్ముల పంపకాల్లో వాళ్లే. ఆలుమగల పంచాయతీ లో వాళ్లే. చివరికి వాళ్ళ పంపకాల్లో తేడా వచ్చినా వాళ్లే.
ఇక వారు రాసే వార్తల్లో విశ్వసనీయత పక్కనబెడితే వారు చేస్తున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. ఒక గ్రామంలో చెట్టుకు కట్టి తన్నారు. ఇంకో చోట బట్టలిప్పారు. వారి ఆగడాలకు ఒక కుటుంబమే బలైయింది. చాలా ప్రాంతాల్లో కేసులు పెట్టారు. ఇవన్నీ మనందరికీ తెలిసిందే. ఇలాంటప్పుడు సీఎం మాటల్ని ఎలా తప్పుపడదాం.
ఇది మరో కోణం..
అణగారిన ప్రజల హక్కుల కోసం పని చేయాల్సిన మీడియా ఎవరి కోసం పని చేస్తున్నాయో చూస్తున్నాం. మీడియాలోకి చొరబడ్డ పెట్టుబడిదారులు మీడియాను నిర్వీర్యం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు సొంత మీడియా సంస్థలను పెట్టుకొని మీడియా విశ్వసనీయతను మసక బారుస్తున్నాయి. స్వాతంత్రోద్యమంలో ప్రజల్ని ఏకం చేసేందుకు జాతీయోద్యమ నాయకులు పత్రికలు స్థాపిస్తే..
పదవుల కోసమో, వ్యాపారం కోసమో, అక్రమాస్తుల రక్షణ కోసమో ఇప్పుడు చానళ్లు, పత్రికలు పుట్టుకొస్తున్నాయి.
ఆ మోటో తో పని చేస్తున్న సంస్థలను కూడా మీడియా అందామా…?
సీఎం వ్యాఖలు బాధాకరమే అయినా భౌతిక పరిస్థితుల దృష్ట్యా సరైనదే అనే భావన కలుగుతోంది.
_ రాజశేఖర్