– బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర
దేశ జనాభాలో 60%పైగా ఉన్న బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80 ఏండ్లు సమీపిస్తున్నా రాజ్యాధికారంలో బీసీలకు సరైన వాటా లభించకపోవడం, చాలా కులాల వాళ్లు చట్టసభల్లో కాలు కూడా పెట్టకపోవడం బాధాకరమన్నారు.
బీసీలపై ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలా వివక్ష కొనసాగుతుండడం విచారకరమని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్యా , ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని,ప్రతి వార్షిక బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ ఆర్భాటంగా ప్రకటించి అధికారంలోకి వచ్చాక మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నదని కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు.
కామారెడ్డి డిక్లరేషన్ లో, ఎన్నికల మేనిఫెస్టోలో,ప్రచార సభల్లో చేసిన వాగ్దానం మేరకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందేనని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.