– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలుగా జీవిత పర్యంతం గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి (ఆగష్టు-6) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన నిర్విరామ కృషిని, సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
జయశంకర్ సార్ స్వరాష్ట్ర కలల జెండాను.. భవిష్యత్ అజెండాను ఎన్నడూ వదలిపెట్టలేదన్నారు. తెలంగాణే శ్వాసగా, ధ్యాసగా, లక్ష్యంగా బతికారని, కోట్లాది సకల జనుల్లో ఉద్యమ స్పూర్తిని రగిలించారన్నారు. తన జీవితం తెలంగాణకు అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, ప్రజలు ఏవిధంగా నష్టపోయారో గణాంకాలతో సహ ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్ధాలు సజీవంగా ఉంచిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్ దేనని ముఖ్యమంత్రి కొనియాడారు. జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఆయన ఆశయ సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.