– కొట్టుకుపోయిన దరాలి గ్రామం
– 60 మందికి పైగా గల్లంతు
– రంగంలో రక్షణ దళాలు
– ప్రధాని మోదీ వాకబు
– సీఎం పుష్కర్ సింగ్ దామీ సమీక్ష
డెహ్రాడూన్: ఉత్తరకాశీని వరదలు వణికించాయి. వరద ఉధృతికి ఏకంగా ఒక గ్రామమే కొట్టుకుపోయిందంటే, వరద ఉధృతి స్థాయి ఏమిటన్నది సప్ష్టమవుతోంది. ఇప్పటివరకూ 6మంది మృతి చెందగా, దాదాపు 60 మంది గల్లంతయినట్లు గుర్తించారు. దీనితో రక్షణ దళాలు రంగంలోకి దిగి బాధితులను రక్షించే పనిలో పడ్డాయి. తాజా పరిణామాలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అటు సీఎం పుష్కర్ సింగ్ దామీ సైతం తన పర్యటనను రద్దు చేసుకుని, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం ఉత్తర కాశీ సమీపంలోని దరాలి గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 6మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 60 మంది వరకు గల్లంతయినట్లు తెలుస్తుంది.
దీనిపై సమాచారం అందుకోగానే జిల్లా అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గంగోత్రికి వెళ్లే మార్గం భారీ వరదల కారణంగా కొట్టుపోయింది. దీంతో ఆ ప్రాంతంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి.
పర్వత ప్రాంతాలపై కురిసిన భారీ వర్షం వరదగా మారి, జనావాసాలను ముంచెత్తాయి. దీంతో పలు ఇళ్లు ఆ ప్రవాహ దాటికి కొట్టుకుని, భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.