– బీసీ ధర్నాకు రాహుల్, ఖర్గే ఎందుకు ముఖం చాటేశారు?
– రేవంత్‌వి రాజకీయ డ్రామాలు
– 10 శాతం ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే మేము వ్యతిరేకం.
– జనగామలో బిజెపి కార్యకర్తల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు
జనగామ: కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఒక్క శాతం కూడా తగ్గించకుండా తెలంగాణలో అమలు చేస్తుందా, లేదా? ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి. అది చెప్పకుండా, “గుజరాత్, యూపీలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు” అనే సాకులు చెబుతున్నారు.
మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. వారికి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుంది. ప్రస్తుతం ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది.
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 డివిజన్లు బీసీలకు కేటాయించగా, వాటిలో 35 సీట్లు ఎంఐఎం ముస్లింలు గెలిచారు. దీని వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. కాంగ్రెస్ తీసుకొచ్చే 10 శాతం ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే మేము వ్యతిరేకం. మాట మార్చడమే కాంగ్రెస్ పార్టీ నైజం. వారి చిత్తశుద్ధి ఇక్కడే బయటపడుతోంది. అసలు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్ విషయాన్ని ప్రకటించాల్సింది.
19 నెలలు గడిచినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చితీరాల్సింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ అసెంబ్లీలో పూర్తిగా మద్దతు తెలిపింది. మరి కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు ఓబీసీల హక్కులతో చెలగాటం ఆడుతోంది?
రేవంత్ రెడ్డి… ప్రధాని మోదీ టైమ్ ఇవ్వడంలేదంటున్నారు. కానీ, అసలు ఆయనకు టైమ్ ఇవ్వనిది రాహుల్ గాంధీనే! ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ టైం ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ధర్నా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ డ్రామాకు డైరెక్టర్ అయిన రాహుల్ గాంధీ రాలేదు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరుకాలేదు.
తెలంగాణ రాష్ట్రాన్ని అనాథలా వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇది పంటల సాగు సీజన్. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా, వారిని పట్టించుకోకుండా ఢిల్లీలో ధర్నా పేరుతో డ్రామా చేయడానికి వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి కేసుల్లో ఎవరినీ ఇప్పటివరకు అవినీతికి పాల్పడ్డ రాజకీయనాయకులను అరెస్ట్ చేయలేదు. ఎందుకు?
బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులను సీబీఐ విచారణకు అప్పగించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే, బీఆర్ఎస్ హయాంలో తీసుకువచ్చిన సీబీఐ ఎంట్రీపై నిషేధించిన జీవోను రద్దు చేయాలి.
అప్పుడు సీబీఐ వచ్చి కాళేశ్వరం అవినీతి కేసులో తప్పు చేసిన వారినుంచి డబ్బులు రికవర్ చేసి ప్రభుత్వ ఖజానాలో జమచేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్రదారులైన మంత్రులు, ఇతర రాజకీయ నాయకులను జైలుకు తరలిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు వంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోంది.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది. అధికంగా గెలుస్తుంది కూడా. గ్రామీణ పేదలకు ఉచిత బియ్యం, ఇండ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, రూ.5 లక్షల ఉచిత వైద్యం, పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలు, యువతకు స్వయం ఉపాధి రుణాలు— ఇవన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి.
గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, స్మశాన వాటికలు, రైతు వేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమలవుతున్నాయి. ప్రధాన మంత్రి సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి పక్కా రోడ్లు నిర్మించేందుకు కేంద్రం నిధులు కేటాయించింది.
6 గ్యారంటీల పేరుతో 420 మోసాలకు పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది.