– ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసిన మాధవ్
న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోడీ సలహాలు, సూచనలు ఇచ్చారు. ట్రంప్ టారిఫ్ వల్ల ఆక్వా రైతుల ఇబ్బందులు ప్రధానికి దృష్టికి తీసుకెళ్లానని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రధానిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆక్వా రైతులకు నష్టం కలుగుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ప్రధాని చెప్పారన్నారు. ఇంకా, మాధవ్ ఏమన్నారంటే…
రాష్ట్రంలో రైతులు, ఇతర వర్గాల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లా. ఏపీలో పార్టీ అభివృద్ధిపై రోడ్ మ్యాప్‌ను ప్రధానికి వివరించా… హర్ ఘర్ తిరంగాను ప్రతి గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించాం. వైసీపీకి, ఆ పార్టీ కార్యక్రమాలకు మా పార్టీ మద్దతు లేదు.
వైసీపీకి కేంద్రం మద్దతు ఉందన్న ప్రచారం అవాస్తవం. వైసీపీ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూకేటాయింపుల్లో ఒక విధానం ఉంది. గతంలో కొన్ని సంస్థలకు రాయితీలు ఇచ్చారు. ప్రస్తుతం ఒక విధానం ఉన్నందున భూ కేటాయింపుల్లో ఎలాంటి పక్షపాతం లేదు.