(నవీన్)
నేను వీధి చివర మౌనంగా నిలబడిన ఒక కాలపు సాక్షిని. నా గుండె ఇప్పుడు ఖాళీ. కానీ ఒకప్పుడు అది వేల కథలతో, లక్షల భావోద్వేగాలతో నిండి ఉండేది. నా కథ మీకు చెబుతాను, వింటారా?
నా పుట్టుక ఈ దేశంలో కాదు. సుదూర బ్రిటన్‌లో. నన్ను ఇక్కడికి తెచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ళ పాలన సులభం కావడానికి, వాళ్ళ వర్తకం సాఫీగా సాగడానికి నేను పుట్టాను. నా ఒంటి మీద విక్టోరియా రాణి రాజముద్ర ‘VR’ చెక్కి ఉండేది. దాన్ని చూసి అందరూ భయభక్తులతో నన్ను పలకరించేవారు. మొదట్లో నేను పాలకుల సేవకే పరిమితం. కానీ నెమ్మదిగా సామాన్యుల జీవితంలోకి అడుగుపెట్టాను.
అప్పటి నుంచి నా రూపం మారింది. నా బంధం మారింది. నేను కేవలం ఒక రేకు పెట్టెగా మిగల్లేదు. కోట్లాది ప్రజల ఆశలకు, అనుబంధాలకు చిరునామాగా మారాను. సరిహద్దులో ఉన్న సైనికుడు తల్లికి రాసే క్షేమసమాచారానికి నేనే వారధి. ప్రియురాలి కళ్ళల్లోని విరహాన్ని ప్రియుడి గుండెకు చేర్చే దూతను నేనే. పల్లెటూరిలో చదువురాని తల్లి, పట్నంలో ఉన్న కొడుకుకు ఇరుగుపొరుగుతో ఉత్తరం రాయించి నాలో వేసేది. ఆ ఉత్తరం కోసం ఎదురుచూసే కళ్ళు నాకు తెలుసు. పోస్ట్‌మాన్ సైకిల్ గంట వినగానే గుండెల్లో రేగే ఆనందం నాకు తెలుసు.
ప్రేమ, బాధ, పుట్టుక, చావు, పండుగ, పబ్బం… ప్రతి భావన నా కడుపులో కాగితం రూపంలో పదిలంగా ఒదిగి ఉండేది. పాత తెలుగు సినిమాల్లో, నవలల్లో నా పాత్ర లేకుండా కథ నడిచేదా? నేనొక భావోద్వేగాల ఖజానా. ఆ తరం గుండె చప్పుడును నాలో దాచుకున్న వాడిని.
కాలం మారింది. అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిన స్మార్ట్‌ఫోన్ వచ్చింది. నా అవసరం నెమ్మదిగా తగ్గింది. ఒకప్పుడు ఉత్తరాలతో కిటకిటలాడిన నా కడుపు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతోంది. ఎప్పుడో ఒకసారి వచ్చే ప్రభుత్వ ఉత్తరాలు, బ్యాంకు నోటీసులు తప్ప నన్ను పలకరించేవారే లేరు.
ముఖ్యంగా పల్లెటూళ్ళలో నా బతుకు మరీ దారుణంగా తయారైంది. అక్కడ వ్యక్తిగత ఉత్తరాలే నాకు ప్రాణం. అవే కరువయ్యాక నా అవసరం ఏముంది? అందుకే వేలమంది నా సోదరులను గ్రామాల్లోంచి పెకిలించి పాత ఇనుప సామాను కింద పడేశారు. పట్నాల్లో మాత్రం వ్యాపార ఉత్తరాల పుణ్యమా అని కొందరం ఇంకా బతికి ఉన్నాం.
ఒకప్పుడు నేను నిత్యావసర వస్తువును. ఇప్పుడు వారసత్వ సంపదను. పాత వస్తువును. కొందరు నన్ను ఆసక్తిగా చూస్తారు. ఫోటోలు తీసుకుంటారు. నా మీద ఉన్న పాత రాజముద్రను చూసి మురిసిపోతారు. చెన్నైలో ‘నమ్ వీడు నమ్ ఊర్ నమ్ కధై’ లాంటి బృందాలు నాలాంటి వాళ్ళను కాపాడాలని ప్రయత్నిస్తున్నాయి. నా విలువ ఇప్పుడు నా సేవలో లేదు. నా వయసులో, నా చరిత్రలో ఉంది. నేను సజీవంగా ఉన్న ఒక మ్యూజియం వస్తువును.
నేను పూర్తిగా కనుమరుగైపోతానని మీరనుకుంటున్నారా? లేదు. నా రూపం మారుతోంది. నా ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తోంది. ఇండియా పోస్ట్ ఇప్పుడు నన్ను కొత్తగా ఆవిష్కరిస్తోంది. నా భవిష్యత్ రూపం పేరు ‘స్మార్ట్ పార్శిల్ లాకర్’.
నేను రేపు వీధి చివర ఎర్రగా నిలబడను. మెరిసే డిజిటల్ లాకర్‌గా పోస్టాఫీసుల్లో, జనసమ్మర్ధం ఉన్న చోట్ల కనిపిస్తాను. మీకు వచ్చిన పార్శిల్‌ను నాలో భద్రపరుస్తారు. మీ ఫోన్‌కు ఒక OTP వస్తుంది. మీరు మీకు వీలైనప్పుడు, 24 గంటల్లో ఎప్పుడైనా వచ్చి ఆ కోడ్ ఉపయోగించి మీ వస్తువును తీసుకువెళ్ళవచ్చు.
చేతిరాత స్థానంలో డిజిటల్ కోడ్ వచ్చింది. ఎదురుచూపు స్థానంలో తక్షణ సందేశం వచ్చింది. భావోద్వేగాల బదులు వస్తువులు చేరవేస్తున్నాను.
అవును, నా పనితీరు మారింది. కానీ నా మూల సూత్రం మారలేదు. అప్పుడూ ఇప్పుడూ నా పని ఒక్కటే. దూరాన్ని చెరిపివేయడం. మనుషులను కలపడం.
ఒకప్పుడు ఉత్తరాల రూపంలో మనసులను కలిపాను. రేపు పార్శిళ్ల రూపంలో అవసరాలను కలుపుతాను.
నా ప్రయాణం ఆగదు. ఈ దేశపు కథతో పాటు నా కథ కూడా సాగుతూనే ఉంటుంది.
(రచయిత సీనియర్ జర్నలిస్టు)