– కూటమి ప్రభుత్వం చర్యలతో భారీగా పెరిగిన హజ్ యాత్రికుల సంఖ్య
– 2019 తర్వాత ఏపీ నుండి అత్యధిక యాత్రికులు
– విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రానికి ప్రాధాన్యం
– రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో హజ్-2026 యాత్ర కోసం 2649 మంది యాత్రికులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్నారని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఇందులో 2314 మంది అర్హులుగా తేలారని, 2019 తర్వాత ఏపీ నుండి హజ్ యాత్రకు వచ్చిన దరఖాస్తుల్లో ఇదే అత్యధిక దరఖాస్తులని అమరావతి లో సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి నుంచి వెళ్లే వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు.
హజ్ -2025 యాత్ర కు విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎన్నుకొని, తదుపరి సాంకేతిక కారణాల వల్ల హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల నుండి 72 మంది యాత్రికులు హజ్ కు వెళ్లినట్టు తెలిపారు. దిగ్విజయంగా హజ్ పూర్తి చేసి వచ్చిన ఈ హజీలకు ఒక్కొక్కరికి లక్ష ప్రకారం 72 మందికి మంజూరు చేయడం, 24 గంటల వ్యవధిలోనే వారి బ్యాంకు అకౌంట్లకు మొత్తాన్ని జమ చేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చిందని వెల్లడించారు.
విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం పునరుద్ధరణ, హజ్-2026 కు దరఖాస్తు గడువు పెంపు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సకాలంలో జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో గన్నవరం పునరుద్ధరణతోపాటు, దరఖాస్తు గడువును కేంద్ర హజ్ కమిటీ పొడిగించిందన్నారు. గడువు పెంపుతో విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎన్నుకునేందుకు ప్రభుత్వ విస్తృత ప్రచారంతో హజ్-2026 దరఖాస్తుదారుల్లో 389 మంది యాత్రికులు విజయవాడ ఎంబార్కేషన్ కు మొదటి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. మరో 627 మంది యాత్రికులు రెండవ ప్రాధాన్యం ఎన్నుకున్నారని తెలిపారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 128 మంది యాత్రికులు 65 ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు కలవారని తెలిపారు.
విజయవాడ కేంద్రాన్ని ఎన్నుకుని హజ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసినవారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం అందించడంతో హజ్ – 2026 యాత్రికుల నుండి విజయవాడ ఎంబార్కేషన్ ఎన్నుకోవడానికి విశేషమైన స్పందన లభించిందని మంత్రి ఫరూక్ తెలిపారు. హజ్-2025 కు ఏపీ నుండి 1618 మంది హాజీలు వెళ్ళగా, వీరందరి సౌకర్యాల కోసం తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, సమన్వయంతో ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. 2026 హజ్ కు విజయవాడ ఎంబార్కేషన్ పునరుద్ధరణ, మొదటి ప్రాధాన్యతగా దీనికి విశేష స్పందన లభించడంతో కూటమి ప్రభుత్వం మరింత పకడ్బందీగా, విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు