శీతల గిడ్డంగుల ఏర్పాటుకు చర్యలు
– రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
రైల్వేకోడూరు/రాయచోటి: పదవిని బాధ్యతగా స్వీకరించి రైతాంగానికి అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం రైల్వే కోడూరులోని కడప-చెన్నై మెయిన్ రోడ్ లో గల రాజ్ రెసిడెన్సిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ వరలక్ష్మి, వైస్ చైర్మన్ శివయ్య, బోర్డు డైరెక్టర్లు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులు నూతనంగా ఎంపికైన వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా వరలక్ష్మి, వైస్ చైర్మన్ శివయ్య ఇతర సభ్యులను ఘనంగా ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు. పదవి అనేది బాధ్యతని ప్రజలకు నిజాయితీతోను, నిబద్ధతతో, అంకితభావంతో పనిచేయాలన్నారు. అహర్నిశలు కృషి చేస్తున్న రైతాంగం కోసం పనిచేస్తూ దళారీ వ్యవస్థ నుండి రైతులను కాపాడాలన్నారు.
అత్యధికంగా వాణిజ్య పంటలు పండుతున్న రైల్వే కోడూరులో శీతల గిడ్డంగుల ఏర్పాటుకు ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. కమిటీ సభ్యులు కొత్త ఆలోచనలతో మార్కెటింగ్ ఆదాయాన్ని పెంచే దిశలో ఆలోచించాలన్నారు. జిల్లాలోని 11 ఎం ఎల్ ఎస్ పాయింట్ల నుండి నిత్యవసర వస్తువులు సక్రమంగా వెళుతున్నాయా లేదా అన్న అంశాలను ఇంటెన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా సేకరిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి, వాటిని విజయవంతంగా అమలు చేస్తూ, రైతుల జీవితాల్లో మలుపుతిప్పే మార్పులు తెచ్చామని మంత్రి తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసి, వారికి ఆర్థిక భరోసా కల్పించామన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో మొత్తం 63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 12,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి కేవలం 24 గంటల్లోనే జమ చేసిన ఘనత సాధించామని పేర్కొన్నారు. రైతులు తమ ఇష్టానుసారం మిల్లులకు ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం కల్పిస్తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా, దీపం పథకం కింద మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. అన్నమయ్య జిల్లాలోనే మూడు లక్షల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేశామని వివరించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 1,240 గ్రామపంచాయతీలలో తీర్మానం చేసిన మేరకు సిమెంట్ రోడ్లు సహా మౌలిక సదుపాయాలను ఉప ముఖ్యమంత్రి కల్పించారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం నెలకు 2,500 కోట్లు పెన్షన్ల రూపంలో నిరు పేదలకు అందజేస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో వున్న ఆర్థిక పరిస్థితులను అధిగమించి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని…. ఆ విషయాన్ని గుర్తించి పార్టీలకతీతంగా ప్రజలకు అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వరలక్ష్మి, మాట్లాడుతూ రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ యార్డ్ సదుపాయాల అభివృద్ధి, పారదర్శక విధానాల అమలుపై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతు నాయకులు, అధికార ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని నూతన చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు