– బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
రాజంపేట: ప్రతిపక్షంలో ఉంటే ప్రజాసమస్యలపై పోరాటం చేయడం సులువే… కానీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు ప్రజల తరఫున ప్రభుత్వానికి ఎదురుగా నిలబడడం కొంత కష్టమేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో సోమవారం జరిగిన భారతీయ జనతా పార్టీ ‘సారథ్యం’ అనే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొత్తగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మాధవ్ చాలా కీలకమైన పరిస్థితులను హ్యాండిల్ చేస్తూ విభజిత రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కిరణ్ కుమార్ రెడ్డి సలహా ఇచ్చారు. ఒక మిత్రపక్షం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న మాధవ్ – రాష్ట్రంలో సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడితే అధికారపక్షం నొచ్చుకుంటుంది… అలాగని మాట్లాడకపోతే ప్రజలు బాధపడతారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ క్లిష్టపరిస్థితిని మాధవ్ చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేయాలని సూచించారు.
మరోవైపు రాహుల్ గాంధీ ఈవీఎంలపై ప్రజల్లో సందేహాలు లేవనెత్తుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో సహేతుకత లేదని కిరణ్కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం రాహుల్ నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్, ఎన్నికల నిర్వహణ అంశాల్లో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.