– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచంద్రరావు
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్ర, దేశభక్తి కార్యక్రమాల నేపథ్యంలో తిరంగా యాత్రలు అండ్ హర్ ఘర్ తిరంగా వంటి దేశభక్తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాల నుంచి యావత్ భారతదేశంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు ఆరో సంవత్సరం హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ చైర్మన్గా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోహర్ రెడ్డి, సభ్యులుగా.. శాసన సభ్యుడు పాల్వాయి హరీష్ బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ చేవెళ్ల, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఉన్నారు. వీరి నేతృత్వంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నాం.
ఆగస్టు 14వ తేదీ వరకు తిరంగా ర్యాలీ, 14 లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకం ఎగురవేయడం, ఆగస్టు 15 సాయంత్రం గౌరవప్రదంగా జెండాను అవనతం చేయడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అన్ని మండలాల్లో తిరంగా ర్యాలీ నిర్వహణ చేయాలని నిర్ణయించాం. ఆగస్టు 14న ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ మీద దాదాపు 15 వేల మంది కాలేజీ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. భారతదేశంలో భావితరాలకు స్వాతంత్య్ర చరిత్రను, అనేక మంది త్యాగాలను, విషాద గాథ చరిత్రను తెలియజేయడానికి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆగస్టు 14, 2025వ తేదీన విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా అన్ని జిల్లాల్లో, మండలాల్లో ప్రదర్శనలు, హాల్ మీటింగ్లు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.