– ఇప్పటికే దళాలలను అందుబాటులో ఉంచామన్న అమిత్షా
– అవసరమైతే మరింత సాయం చేస్తానని హామీ
– కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు
– సహాయ కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలు
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర హోంమత్రి అమిత్ షా తో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. హైదరాబాద్లో మూసీనది, ఇతర కాల్వలు పొంగి పొర్లుతున్న సందర్భంలో.. మరో రెండ్రోజులపాటు భారీ వర్ష సూచన అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో మాట్లాడాను.
తెలంగాణలో పరిస్థితిని వివరిస్తూ.. సహాయక చర్యలకు సహకరించాల్సిందిగా కోరాను. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నందున.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను పంపాల్సిందిగా కోరాను.
దీనికి అమిత్ షా స్పందిస్తూ.. ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంచామని, అవసరమైతే.. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అదనపు బృందాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
భారీ వర్షాలు, మరో రెండ్రోజుల వర్ష సూచన నేపథ్యంలో తెలంగాణ ప్రజలను కోరుతున్నాను. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లోని నదీ తీర, వాగుల అంచున ఉన్న గ్రామాల ప్రజలు అలర్ట్ గా ఉండాలి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. కాబట్టి మూసీ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనల ప్రకారం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.
ఈ వరద సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు కూడా వరద ప్రాంతాల్లో.. ప్రజలకు కావాల్సిన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
వరద బాధిత ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తాత్కాలికంగా.. కావాల్సిన ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర మందులు అందించడం వంటి సహకారాన్ని బీజేపీ కార్యకర్తలు అందించాలని మనవి చేస్తున్నాను.