– హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి సహాయక చర్యలకు సిద్ధం
– ప్రజల రక్షణ కోసం కార్యకర్తలు తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టాలి.
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, మాన్సూన్ డ్రైన్లు దగ్గరగా వెళ్లరాదు. పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను.
వాతావరణ కేంద్రం హెచ్చరించిన ప్రకారం ఈ రోజు హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్, కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, మల్కాజ్గిరి, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోవడం, ట్రాఫిక్ అంతరాయం, మురుగు నీటి ఉప్పొంగడం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితులు గమనించిన వెంటనే ప్రభుత్వ హెల్ప్‌లైన్ లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వండి.
బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలకు సిద్ధంగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం–తాగునీరు పంపిణీ, వైద్య సహాయం, వృద్ధులు మరియు చిన్నపిల్లలకు సహకరించడం వంటి కార్యక్రమాల్లో బిజెపి కార్యకర్తలు పాల్గొనాలి. అత్యవసర పరిస్థితుల్లో జాతీయ విపత్తు సహాయ బలగాలతో సమన్వయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడం కర్తవ్యం. అందరూ ఒకరొకరు అండగా నిలవాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు.