– తెలంగాణలో భారీ వర్షాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్: గత రెండ్రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో ప్రజలకు అండగా నిలబడుతున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వరదముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి కావాల్సిన ఆహారం, అన్నిరకాల ఇతర సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సీనియర్ ప్రభుత్వ అధికారులను వరద ప్రభావిత ప్రాంతాల సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు తక్షణం పంపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాను.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత ప్రజలకు సహాయం అందించడానికి కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో ఇప్పటికే ఏడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను తెలగాణ ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కలిసి పాల్గొంటున్నాయి. ఖమ్మం జిల్లాలో ఒక బృందం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు బృందాలు, నిర్మల్ జిల్లాలో ఒక బృందం, ములుగు జిల్లాలో ఒక బృందం, హైదరాబాద్ లో ఓ బృందం, మహబూబాబాద్‌లో మరో బృందం అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఒక్కో బృందంలో.. 50 మంది సభ్యులుంటారు. ఇందులో స్ట్రక్చరల్ ఇంజనీర్లు, టెక్నీషియన్స్, ఎలక్ట్రీషియన్స్, కెనైన్ యూనిట్స్, మెకానికల్, పారామెడికల్ సిబ్బంది కూడా ఉంటారు. మరో రెండ్రోజులపాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను. ఆయా జిల్లాల్లోని నదులు, వాగుల అంచున ఉన్న గ్రామాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.