– మంత్రి పార్థసారథికి వినతి పత్రాన్ని అందజేసిన ఏపీజేఎఫ్ నేతలు
అమరావతి: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల జర్నలిస్టులు ఇప్పటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని, ఆగస్టు 30 లోపల నూతన అక్రిడిటేషన్ మంజూరు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.శివ రాజేష్ నేతృత్వంలోనీ బృందం గురువారం సాయంత్రం సెక్రటేరియట్ లో మంత్రి పార్థసారథికి వినతిపత్రం అందజేశారు.
జర్నలిస్టుల ఆరోగ్య బీమా పరిమితి రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని, అదేవిధంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చలామణి అయ్యేవిధంగా తగు ఆదేశాలు ఇవ్వాలని ఏపీజెఫ్ నాయకులు మంత్రిని కోరారు. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఏపీజేఎఫ్ చొరవ తో అమలులోకి వచ్చిన జర్నలిస్ట్ బీమా పథకాన్ని 10 లక్షలు నుంచి 20 లక్షలకు పెంచి తక్షణమే అమలు చేయాలని, 20 ఏళ్ళు దాటిన పాత్రికేయులకు వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న విధంగా 15,000 పెన్షన్ మంజూరు చేయాలని, జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ కు 100 కోట్లు కేటాయించి పాత్రికేయ మిత్రులకు భరోసా కల్పించాలని, గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జర్నలిస్టు వ్యవస్థలపై వచ్చిన జీవోను పున పరిశీలించి జర్నలిస్టుల ఇంటి నిర్మాణ కలను సాకారం చేయాలని కోరారు. అలాగే, జర్నలిస్టులకు వేజ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకునే విధంగా చూడాలని ఏపీజేఎఫ్ నేతలు మంత్రి నీ కోరారు. ఏపీజేఎఫ్ నేతలతో గంటకు పైగా సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి జర్నలిస్టుల 10 లక్షల బీమా పథకం పై, అదేవిధంగా జర్నలిస్టుల హెల్త్ కార్డుల పరిమితి 20 లక్షలకు పెంపుపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. జర్నలిస్టుల పెన్షన్ ఇళ్ల నిర్మాణం పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టిలో ఉన్నాయని వాటిని అందించేందుకు కృషి చేస్తామని మంత్రి ఏపీజేఎఫ్ నేతలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర కోశాధికారి గాంధీ బాబు,ఏపీజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షులు మద్దినేని అనిల్, గౌరవాధ్యక్షుడు ఈశ్వర్, ఎపిజేఎఫ్ నాయకులు చక్రధర్, లిఖిత, సీనియర్ జర్నలిస్ట్ సంఘం నాయకులు ఏ.వి. శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.