– పాలెగాళ్లరాజ్యంపై సామాన్యుడి తిరుగుబాటు
-వైఎస్ కోటకు వ్యతిరేకంగా ఓటెత్తిన పులివెందుల
– పులివెందులలో పరిఢవిల్లిన ప్రజాస్వామ్యం
– ఒక మహిళను అవమానించిన చోటనే మరో మహిళకు పట్టాభిషేకం
– షర్మిలను అవమానించిన జగన్‌కు లతారెడ్డి ఝలక్
– పులివెందుల పడగనీడలో తొలిసారి ఓట్ల పండగ
– పులివెందుల గడ్డపై మురిసిపోయిన ఓటు
– వైఎస్ కుటుంబంపై గెలిచిన ప్రజాస్వామ్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)
నలభై దశాబ్దాల ‘ఎదుగూరి సందింటి’ కోటపై తొలిసారి ‘ఓటు జెండా’ సగర్వంగా రెపరెపలాడింది. వైఎస్ గడ్డపై తొలిసారి ఓటు తనను తాను చూసుకుని మురిసింది.. ఓటు నవ్వింది. వేలిమీద బులుగురంగు వేయించుకున్న పులివెందుల ఓటరు తమ అదృష్టానికి మురిసిముక్కలయ్యాడు. బ్యాలెట్ పేపరు అందుకున్న ఓటు స్వామ్యంలో విజయగర్వం తొంగిచూసింది. తొలిసారి పోలింగ్ బూత్‌లలో నిండిపోయిన బ్యాలెట్ పేపర్లు ఎదుగూరి సందింటి పెత్తనంపై ఎదురుతిరిగాయి. ఎక్కడయితే ఒక మహిళను ఎదుగూరి సందింటి వారసుడు అవమానించారో.. సరిగ్గా అదే గడ్డపై మరో మహిళను గెలిపించారు. ఇది పులివెందుల- ఒంటిమిట్టలో జరిగిన స్థానిక సమరానికి సంబంధించిన ముచ్చటే కాదు. తొలిసారి ఓటుస్వామ్యానికి లభించిన అపూర్వ విజయం కూడా! గెలుపు, ఓటమి కాదు.. ప్రజాస్వామ్యం పరిఢివిల్లిన మధురక్షణాలవి!!
ప్రపంచంలో ఇది ఎనిమిదో వింత కాదు. ఎనిమిదో అద్భుతం! పులివెందులను అడ్డాగా చేసుకుని దశాబ్దాలపాటు, రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వైఎస్ కుటుంబానికి దారుణ విషాద ఫలితం. ఈ విజయం గెలిచిన తెలుగుదేశం పార్టీదో, దానికి సహకరించిన జనసేన, బీజేపీదోకానే కాదు. నలభై దశాబ్దాల్లో ఒక్కసారి కూడా ఓటుకు నోచుకుని పులివెందుల జనాల వేలికి ఇంకు, చేతికి బ్యాలెట్ పేపరు ఇప్పించి.. ప్రజాస్వామ్యం పరిహాసం కాకుండా గుండెధైర్యం ప్రదర్శించిన పోలీసులదే ఈ విజయం.
నిజంగా పోలీసులు పనిచేయకపోతే ప్రజాసామ్యం యధావిథిగా ఈసారి కూడా ఓడిపోయేదే. వైఎస్ కుటుంబం మరోసారి ప్రజాస్వామాన్యి చెరబట్టేదే. సెల్యూట్ కొట్టడానికి.. చెప్పిన పనిచేయడానికి తప్ప, అవినాష్‌రెడ్డి కోటకు వెళ్లని పోలీసులు.. ఈసారి ఏకంగా పటాలంతోనే కవాతు చేసి, ఆయన కోట తలుపుబద్దలు కొట్టిన అద్భుత దృశ్యాలు ఒక్కటి చాలు.. పులివెందులలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని చెప్పడానికి! అందుకే పులివెందులలో ప్రజాస్వామ్యం నవ్వింది. కలసి వెరసి పులివెందుల పులన్న పరువుపోయింది.
ఐజి కోయ ప్రవీణ్‌పై తనపై వైసీపీ మూకలు ఎన్ని ఆరోపణలు చేసినా లెక్కచేయకుండా, వైఎస్ కోటను బద్దలు చేసి నాలుగు దశాబ్దాలుగా ఓటు ముఖం తెలియని జనాలకు, ఓటుస్వామ్యంలో ఉన్న మాధుర్యం చూపించిన ఆయన తెగువను అభినందించాల్సిందే. అసలు అవినాష్‌రెడ్డి కోటలో అడుగుపెట్టడమే ఒక సాహసం. ఆయన తలుపులు బద్దలు కట్టి, కలుగునుంచి బయటకు తెప్పి, చెరబట్టడం మరో సాహసం.
సమాచారం వచ్చిన మరుక్షణమే తింటున్న అన్నం కూడా వదిలేసి పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లి, ఓటరుకు ఓటుహక్కు కల్పించేందుకు కోయ ప్రవీణ్ పడ్డ కష్టం అభినందించదగ్గ దగ్గదే. అవినాష్‌రెడ్డితో పాటు, ఏకకాలంలో టీడీపీ ఎమ్మెల్సీని కూడా అదుపులోకి తీసుకోవడం ద్వారా, తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టడంలో కోయ ప్రవీణ్ చాతుర్యం మెచ్చదగిందే.
30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓటేశాం. పోలీసు అన్నలకు కృతజ్ఞతలు.. మా యబ్బ కూడా ఓటేయలేదు.. మా వివేకా సారుకు న్యాయం చేయండి సారు.. అని బాక్సుల్లో స్లిప్పులు కూడా వేశారంటే, పోలీసులు ఎంత సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించారో సుస్పష్టం.
ఈ మొత్తం వ్యవహారంలో పాపం వైసీపీ అభ్యర్ధి, అసలు తన ఓటునే తాను వేసేందుకు భయపడ్డారంటే, పులివెందులలో ప్రజాస్వామ్య స్ధాపన కోసం పోలీసులు ఎంత శ్రమించారో అర్ధమవుతూనే ఉంది.
ఇప్పటిదాకా జగన్‌ను పులి- సింహంతో పోల్చిన ఆయన అభిమానులకు.. పులివెందులలో పులన్న పరువు ఎంతుందోనన్న నిజాన్ని, జడ్పీటీసీ ఉప ఎన్నికలు తేల్చాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయం చేసిన పులివెందుల, ఆయన కుటుంబానికి తిరుగులేని కోట. వైఎస్ తన రాజకీయచరిత్రలో ఎక్కువరోజులు అక్కడ గడిపిన దాఖలాలు లేవు. తమ్ముడు వివేకానే అంతా చూసుకునేవారు. వైఎస్ ఎమ్మెల్యే అయినా, ఎంపి అయినా ఏ ఎన్నికలు జరిగినా పులివెందుల గ్రామాల్లో పోలింగ్ జరగడం బహు తక్కువ. బ్యాలెట్ పేపరు ముఖం చూసిన వారి సంఖ్య కూడా బహు తక్కువ. అసలు నలభు ఏళ్ల నుంచి బ్యాలెట్ పేపర్ ముఖమే చూడని గ్రామాలు డజన్ల సంఖ్యలో ఉంటాయంటే ఆశ్చర్యం లేదు.
ఇక ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలయితే ఏకపక్షమే. అసలు నిలబడే దమ్ము గానీ, పోలింగ్ ఏజెంట్లుగా కూర్చునే ధైర్యం కూడా ఎవరికీ ఉండదు. గ్రామం, మండలం, నియోజకవర్గ, జిల్లాకు వైఎస్ కుటుంబం ప్రతినిధి ఒకరుంటారు. సూటిగా చెప్పాలంటే, టీడీపీ అధికారంలో ఉన్నా అక్కడ రాజ్యం వైఎస్ కుటుంబానిదే.
అలాంటి అరాచక-పాలెగాళ్ల రాజ్యంలో ఒక మహిళ నిలబడి కలబడి వైఎస్ కుటుంబం నిలబెట్టిన అభ్యర్ధిని ఓడించి, వేల మెజారిటీ సొంతం చేసుకోవడం అద్భుతం. అపూర్వం. అనన్యసామాన్యం. ఈ విషయంలో జగన్‌కు సవాలు విసురుతున్న టీడీపీ నేత బీటెక్ రవి ధైర్యం మెచ్చదగిందే. ఎవరినో నిలబెట్టకుండా తన భార్యనే పోటీ పెట్టి, తన ప్రతిష్ఠను పణంగా పెట్టి వైఎస్ కుటుంబానికి ఎదురునిలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
అభ్యర్ధి అయిన బీటెక్ రవి భార్య కూడా ఏమాత్రం భయపడకుండా, భర్త నమ్మకాన్ని నిలబెట్టి వైఎస్ కుటుంబాన్ని ఢీకొట్టడమూ అపూర్వమే. పులివెందులలో పాలెగాళ్ల పాలనకు ముగింపు పలికిన భార్యాభర్తలను జమిలిగా అభినందించాల్సిందే.
సూటిగా చెప్పాలంటే ఇది టీడీపీ విజయం కాదు. టీడీపీ అభ్యర్ధి గుండెధైర్యానికి దక్కిన విజయం మాత్రమే.
కానీ ఇది జగన్ నైతిక పరాజయం. కలలో కూడా తన కోట ఇంత విషాదంగా బీటలు వారుతుందని భావించని జగన్.. తన కోటను పులివెందుల జనం బద్దలు కొడుతుంటే నిస్సహాయంగా, నిర్లిప్తంగా, నిస్సత్తువగా కళ్లప్పగించి చూడాల్సిన పెను విషాదం. దశాబ్దాల తరబడి పులివెందులలో కాపాడుకుంటూ వస్తున్న తన కుటుంబ పరువును ఒక మహిళ వెక్కిరించి.. తన కుటుంబమంటే వణికిపోయే ఓటరు, తననే ధిక్కరించిన దారుణ అవమానం. దుర్యోధనుడి మయసభ కంటే.. అంతకుమించిన పరిహాసం. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఇది పాలెగాళ్లరాజ్యంపై సామాన్యుడి తిరుగుబాటే!
నిజానికి జగన్‌కు అక్కడ రెండుచోట్లా ఉప ఎన్నికలు వస్తాయని తెలుసు. ఆ మేరకు వాటిపై దృష్టి పెట్టకుండా, తన పాలెగాళ్ల రాజ్యంలో తనకు వ్యతిరేకంగా ఎవరు ఓటెత్తుతారన్న మితిమీరిన విశ్వాసమే ఆయన పరువు తీసేందుకు కారణమయింది.నిజానికి ఇప్పుడు పులివెందులలో జగన్ ఒంటరి. ఆయనకంటూ సొంత వర్గం లేదు. అవినాష్రె డ్డి, ఆయన నాయన తప్ప, జగన్‌కు సొంత మనుషులు లేరు. ప్రస్తుత పరాజయానికి అదొక కారణమన్నది జగనాభిమానుల విశ్లేషణ. నిజం జగన్నాధుడికెరుక.
నిజానికి ఇప్పుడు పులివెందులలో జగన్ ఒంటరి. ఆయనకంటూ సొంత వర్గం లేదు. అవినాష్రె డ్డి, ఆయన నాయన తప్ప, జగన్‌కు సొంత మనుషులు లేరు. వారిని ఆధారం చేసుకునే జగన్ రాజకీయం చేయాల్సిన అనివార్య పరిస్థితి. అంటే అవినాష్‌రెడ్డి కుటుంబ వ్యతిరేకత జగన్ ఖాతాలో కలవని తప్పని వాతావరణం. ప్రస్తుత పరాజయానికి అదొక కారణమన్నది జగనాభిమానుల విశ్లేషణ. నిజం జగన్నాధుడికెరుక.
ఈ విజయంతో టీడీపీకి అదనంగా వచ్చిన లాభమేమీ లేకపోవచ్చు. కాకపోతే పాలెగాళ్లరాజ్యంలో జండా ఎగరవేశామన్న తృప్తి. అలాగే ఈ పరాజయంతో వైసీపీకి రాజకీయంగా వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే టీడీపీ సిలబస్ మారిన నేపథ్యంలో, ఇలాంటి ఫలితాలు వస్తాయని అది ముందే ఊహించింది. అందుకే పోలింగుకు రెండురోజుల ముందే కాడి కింద పడేసి, మీడియా యుద్ధం మొదలెట్టింది.
కాకపోతే కోయ ప్రవీణ్ లాంటి మొండివాడిని నియమిస్తే, అసెంబ్లీ ఎన్నికలోనూ అద్భుతాలకు అవకాశం ఉంటుందన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే ఈ ఫలితం పులివెందులలో టీడీపీ శ్రేణులకు, భవిష్యత్తులో వైసీపీతో పూర్తిస్థాయి యుద్ధం చేసేందుకు ఒక టానిక్‌లా అక్కరకొస్తుంది. అలాగని ఈ ఉప ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని, వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్ ఓడిపోతారని అంచనా వేస్తే తప్పులో కాలేసినట్లే.
ఇక పులివెందులలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, రిగ్గింగ్ రాజ్యమేలిందని, పోలీసులే కార్యకర్తల్లా పనిచేశారంటూ జగన్ నుంచి సత్తిబాబు వరకూ చేస్తున్న హాహాకారాలు, ఆర్తనాదాలే విచిత్రం. దయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో? జగన్ జమానాలో అసలు నామినేషన్లు వేసే దిక్కు కూడా లేదు. దానితో పోల్చుకుంటే, పులివెందుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లినట్లే లెక్క.
చంద్రబాబు నాశమయిపోతారంటూ జగన్ పెట్టిన శాపనార్ధాలు రాజకీయాల్లో దిగజారుతున్న విలువలకు పరాకాష్ఠ. రాజకీయాల్లో విమర్శలు-ప్రతి విమర్శలుంటాయి. మీడియాను ఆకట్టుకునేందుకు కొందరు నేతలు ఓవరాక్షన్ చేస్తుంటారు. కానీ జగన్ మాదిరిగా వ్యక్తులు నాశనం కావాలంటూ ఇప్పటివరకూ వ్యాఖ్యానించిన నేతలెవరూ లేరు.
జగన్ ఈ వ్యాఖ్య చేసిన తర్వాత.. పావురాలగుట్టలో పావురమైన వైఎస్‌లా ఎవరూ నాశనం కాలేరు. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు తన తండ్రికీ వర్తిస్తాయా? అంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం మొదలయింది. నిజానికి ఇటీవల జరిగిన ఎయిర్‌లైన్స్ ప్రమాద ఘటన మినహాయిస్తే.. దేశ రాజకీయాల్లో పార్టులు కూడా గుర్తుపట్టని రాజకీయ నాయకుడి శవం ఎవరిదయినా ఉందంటే అది ఒక్క వైఎస్‌దే.
ఓటమిని హుందాగా అంగీకరించి, దానికి కారణాలు అన్వేషించి ఆత్మవిమర్శ చేసుకునే బదులు, ఓటమి ఒప్పుకోలేని ఫ్రస్టేషన్ మరిన్ని పతనాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు.. ఎన్నికల్లో ఓడిపోయినోడు ఏదో వాగుతాడు. గెలిచినోడే నాయకుడు. గెలిచామా. ఓడామా అన్నదే ముఖ్యం’. మరిప్పుడు పులివెందుల పులన్న ఓడాడా? గెలిచాడా?
https://www.facebook.com/YSJagananna2.0/videos/667314938970282/?rdid=sS4zA7JZNaJQY3zC#