– రెండు నెలలుగా తెలంగాణలో మైనస్ ద్రవ్యోల్బణం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిదర్శనం
– దేశంలోనే ఇలాంటి పరిస్థితి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
– రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలు..తిరోగమనంలో రాష్ట్రాభివృద్ధి
హైదరాబాద్: వరుసగా రెండు నెలల పాటు తెలంగాణ ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) మైనస్‌లోకి పోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనానికి స్పష్టమైన నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఆరోపించారు.
కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్ల పాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, కేవలం ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా చితికిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలతోనే తెలంగాణకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు.
తెలంగాణ చరిత్రలో తొలిసారిగా జూన్, జులై నెలల్లో ద్రవ్యోల్బణం మైనస్‌లో నమోదైందన్నారు కేటీఆర్. జులైలో రాష్ట్ర ద్రవ్యోల్బణం -0.44%గా ఉండగా, జాతీయ సగటు +2.10%గా ఉందన్నారు. జూన్‌లో రాష్ట్రంలో -0.93%గా ఉంటే, దేశవ్యాప్తంగా +1.55%గా ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో డిఫ్లేషన్ (ద్రవ్యోల్బణం తగ్గుదల) మరింత తీవ్రంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
ద్రవ్యోల్బణం తగ్గడం సానుకూల సంకేతం కాదన్న కేటీఆర్, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రమాదకర సంకేతమని హెచ్చరించారు. ప్రజలు అత్యవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారని, వ్యాపార,వాణిజ్య, పారిశ్రామిక రంగాలన్నీ స్తంభించిపోయాయని చెప్పారు. కొత్త ఉద్యోగాల కల్పన లేకపోవడం, ఆర్థిక కార్యకలాపాలు మందగించడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆర్థిక నిపుణుల సూచనలను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.
“ఒకప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇప్పుడు తిరోగమనంలోకి వెళ్లడం బాధాకరం. క్లూలెస్ కాంగ్రెస్ పాలనలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోంది,” అని విమర్శించారు.
“హోప్లెస్ గవర్నమెంట్, హోప్లెస్ గవర్నెన్స్” అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆశలు చూపించి మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఉద్యోగ కల్పనకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకెళ్లిందని, ఇప్పుడు ఆ రంగాలన్నీ కుదేలైనట్లు విమర్శించారు.
ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం వెంటనే సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి పోకుండా ఉండడానికి తక్షణమే ఆర్థిక సంస్కరణలు, ఉద్యోగ కల్పన కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించాలని సూచించారు. లేకపోతే, తెలంగాణ ఆర్థిక భవిష్యత్తు మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మళ్లీ పురోగతి పథంలో నడవాలంటే, ప్రభుత్వం తన వైఫల్యాలను సరిదిద్దుకోవాలన్నారు.